Friday, December 10, 2010

బాబోయ్ ఇవేం ధరలు

 ఉదయాన్నే ఓ శుభవార్త. పాలు లీటరుకు  రెండు రూపాయలు పెరిగాయి అని. ఒక్క క్షణం నేత్రాలు గిర్రున తిరిగాయి.మనసు గబగబా లెక్కలు వేసేసింది.నిజంగా అన్నీ రేట్లు ఇలా పెరిగిపోతున్నాయి  ఏమిటండీ  బాబూ.
  
ఆల్ రెడీ బియ్యం,పప్పులు,కూరలు ,పళ్ళు అన్నీ తారాజువ్వల్లా ఆకాశం లోకి వెళ్లి,ఇక దిగిరామంటూ అక్కడే కూర్చున్నై.శక్తివంచన లేకుండా మిగిలినవి కూడా  ఉల్లి,వెల్లుల్లి సహా పెరుగుతూనే ఉన్నాయి. మళ్లీ పాలు ఇంకో రెండు రూపాయలు. వెరసి లీటరు పాలు కొనుక్కుంటే  నెలకు వెయ్యి రూపాయలు బడ్జెట్.ఇలా ఒక్కొక్క దానికి బడ్జెట్ పెంచుకుంటూ పొతే నెలవారీ ఖర్చు ఎంత పెరుగుతుందో తలచుకుంటే గుండె గుబుక్కుమనక మానదు.

అప్పుడప్పుడూ అనిపిస్తుంది. చేతికి ఆరేడు వేలు మాత్రమే వచ్చే సామాన్య  జీవి ఎలా బ్రతకగలడా  అని. సింపుల్. లీటర్ నుండి ముప్పావుకి  తగ్గుతాం, అవీ  ఎక్కువనిపిస్తే అర లీటర్ తో సరిపెడతాం.ఇదీ మా కజిన్ నుండి టక్కున వచ్చిన జవాబు. ఏవి ఎంత పెరిగినా కొనకా తప్పదు, తినకా తప్పదు, బ్రతక్కా  తప్పదు.ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో  పెరిగే రేట్లకు అనుగుణంగా ఆదాయం పెంచుకోవలసిందే తప్ప మరో మార్గం లేదేమో.

మళ్లీ పెట్రోల్ రెండురూపాయలు పెరుగుతుంది అని నిన్న న్యూస్ లో చెప్తున్నారు.నాకైతే  ఒక్కటే అనిపించింది.మూడు, నాలుగు లక్షలు పోసి కారు కొని,దాన్ని  మైంటైన్ చేస్తూ, పెట్రోల్ కి తగలేసే బదులు ఆ వడ్డీ పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా క్యాబ్ తెప్పించుకుని వెళ్ళొచ్చు ఏమో. కనీసం డ్రైవింగ్ యాతన అన్నా తప్పుతుంది ఈ ట్రాఫిక్ లో. 

సాధారణంగా మా రోజుల్లో అంటూ మొదలెడతారు మన తల్లిదండ్రులు ప్రతి విషయానికీ .మనమూ ప్రస్తుతం హ్యాపీగా ఆ కేటగిరీ లోకి  చేరిపోయి  కాపురం పెట్టుకున్న తొలిరోజుల్లో బడ్జెట్  గురించి చెప్పొచ్చేమో. 

 చివరగా ఒక్క మాట. అధికారం కోసం తపించే ఏ నాయకులైనా ,చిత్తశుద్ది తో పనిచేసి, ధరలు తగ్గించి, జనానికి బ్రతుకు బరువు కాకుండా ఆనందంగా బ్రతకగలిగేలా చేస్తే, జనం బ్రహ్మరధం పట్టరూ.అసాధ్యమంటారా ఇది.







Post a Comment

2 comments:

రాధిక(నాని )

లతగారు,మీరు పాలు లిటర్ ఎంతకి కొంటారో తెలిదు కానీ ,మేము కేంద్రానికి పాలు పోస్తే చచ్చిచెడి లిటర్ కి ఇరవై రూపాయలు ఇస్తారు.మధ్యలో మిగిలేది ఎవరికంటారు?వర్షాలు ఎక్కుగా పడటం వలన కూరగాయల రేట్లు మాకు ఎక్కువగానే ఉంటున్నాయి.
మీ పోస్ట్లన్ని బాగున్నాయి.

లత

హోల్ మిల్క్ 36 రూ,నార్మల్ మిల్క్ 28 రూ అండీ.
అదే కదా బాధ, ఎవరు బాగుపడేదీ దేవుడికే తెలియాలి.
నా పోస్ట్స్ నచ్చినందుకు బోలెడు థాంక్యూలు

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008