Wednesday, September 21, 2011

మరల తెలుపనా ప్రియా

అద్భుతమైన పాట.ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.ప్రతిసారీ ఓ అందమైన అనుభూతి మనసుని 
తాకి ఊయలలూగిస్తుంది.ఓ కన్నెమనసు నునుసిగ్గుల బరువుతో,దాచుకోలేని భావాలని పాటలో వెల్లడి చేస్తే ఎదలోయలలో పరిమళాలు,కనుపాపల్లో పరిచయాలు,మనసుపడే తడబాటు,కనురెప్పల నీడల్లోని బిడియాలు ఇలా ఎన్ని అనుభూతులు అలవోకగా మనసుని తాకి,మనని పలకరించి గిలిగింతలు పెడతాయో.ఎంతో చెప్పాలనుకున్నా  ఒకోసారి మాటలు దొరకవు.ఏం చెప్పాలో తెలియక మనసు పరితపిస్తుంది అలాంటప్పుడు మౌనమే మాట్లాడుతుంది.

"మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి,తెలియలేక తెలుపలేక మనసు పడే మధురబాధ" .
ఎంత చక్కని సాహిత్యమో.చిత్ర స్వరంలో ప్రాణం పోసుకుని జాలువారుతుంది.









మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా 
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా 
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని 
కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని 
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా 

విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని 
విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని
అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని
అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని

మరల తెలుపనా ప్రియా
మరల తెలుపనా


నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూసి
నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూసి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన ,మరుక్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసుపడే మధురబాధ

మరల తెలుపనా ప్రియా
మరల తెలుపనా 


ఈ పాట కంపోజ్ చేసినది వందేమాతరం శ్రీనివాస్ అన్నప్పుడు మాత్రం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.ఆయన చేసిన మిగతా పాటలకు భిన్నంగా లలితంగా ఉంటుంది.అలాగే ఇందులో అసలు నచ్చనిది ఈ పాట చిత్రీకరణ.అంత అందంగా ముగ్ధంగా ఉన్న లయ ఒక్కదానిపై ఏ విరబూసిన వెన్నెల్లోనో తీయక,ఆ పార్కుల్లో, మధ్యలో మూడో వ్యక్తిని(బ్రహ్మాజీని) పెట్టి , ఏమిటో అర్ధం కాదు.ఇంకా అందంగా చిత్రీకరిస్తే బావుండేది అనిపిస్తుంది. అందుకే వీడియో చూడబుద్ధి కాదు.




Saturday, September 10, 2011

మా విఘ్నేశ్వరుడు



వినాయకచవితి అంటేనే హడావుడి.దేవుణ్ణి,పత్రిని,పూలు,పళ్ళు అన్నీ తెచ్చుకోడం,పిండివంటలు చేయడం,పూజకు అమర్చుకోడం,ఆ ఒక్కరోజూ మాత్రం ఊపిరాడదు.చిన్నప్పుడు నాన్నగారు శుక్లాంభరధరం అని చదువుతూ పాలవెల్లి కట్టి దేవుణ్ణి పెడుతుంటే చిన్నిచిన్ని కాయలన్నీ దారాలుకట్టి అందించడం ఓ గొప్ప సరదా.

బుజ్జిబుజ్జి సీతాఫలం,జామకాయలు,ద్రాక్షగుత్తి అన్నీ వేలాడుతుంటే ముచ్చట పడిపోయి తప్పనిసరిగా వైరు హోల్డరూ పెట్టించి దానికి ఆకుపచ్చ బల్బ్ పెడితే చిన్న పందిరిలా భలే ఉండేది.

చిన్నప్పుడున్నంత సరదా ఇప్పుడు లేకపోయినా సాధ్యమైనంత వరకు ఓపికగా అలంకరించి పూజ చేసుకుని,అంతా అయ్యాక చూసుకుంటే వెలిగే దీపాల మధ్య వినాయకుడు దీవిస్తూ మెరిసిపోతుంటాడు ఉదయం నుండీ పడ్డ శ్రమంతా మర్చిపోతాము,తెలియని తృప్తి మనసంతా నిండుతుంది.

మా ఫ్లాట్స్ లో కూడా గణపతి విగ్రహం పెట్టి బాగా చేస్తారు,ఈ సారి ఎకోఫ్రెండ్ లీ అని ఎంత ట్రై చేసినా మట్టితో చేసింది దొరకలేదు,అందుకని పైన ఫోటోలోని విగ్రహమే తేవలసివచ్చింది.రోజూ సాయంత్రాలు పూజలు,ప్రసాదాలు,శుక్రవారం లక్ష్మీపూజ ఆఖరిరోజున అందరికీ భోజనాలు,తరువాత నిమజ్జనం అదీ కార్యక్రమం,ఏడాదికోసారి గణపయ్య పుణ్యమా అని సందడి.







Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008