Wednesday, November 24, 2010

జీవితం చాలా విలువైనది

               ఉదయాన్నే తెలిసిన వార్త మనసుని పిండేసింది.చదువుల వత్తిడి తట్టుకోలేక ఒక చిన్నారి  బలవంతంగా ప్రాణం తీసుకుంది.మా నైబర్స్ కి క్లోజ్ ఫ్రెండ్ కూతురు.ఎంత అందంగా ఉంటుందో లతా.దాన్ని అలా చూసి తట్టుకోలేక పోయాను అన్నారావిడ. ఎప్పుడూ ఆ అమ్మాయిని చూడకపోయినా నాకే  చాలా బాధ వేసింది ఏ తల్లి శోకమైనా ఒకటే కదా.

                     పద్దెనిమిదేళ్ళ అమ్మాయి. ప్రాణం తీసుకోడానికి అంత ధైర్యం ఎలా వచ్చిందో. చిన్న దెబ్బ తగిలితే విలవిలలాడి పోతాం. అలాంటిది చనిపోవాలంటే ఎంత ధైర్యం కావాలి. పాపం ఎంత క్షోభ అనుభవిస్తే ఆ నిర్ణయం తీసుకుందో 
                   చదువు,సంపాదన,జీవితం లో సెటిల్ కావడం అన్నీ ముఖ్యమే కాదనను కానీ జీవితం ఇంకా ముఖ్యం కదా. చదువే జీవితమా, సంపాదనే కొలబద్దా.ఇది నాకు ఎప్పుడూ ప్రశ్నే,మొదటి రెండు, మూడేళ్ళు ఏమి హాయిగా గడుపుతారో పిల్లలు.నర్సరీ,నుండి మొదలైన పరుగు పందెం ఎప్పుడు ఆగుతుందో తెలియదు.దీనికి పేరెంట్స్ ఎంత వరకూ కారణమో తెలియదు.పిల్లల మీద ఆశలు పెట్టుకోడం తప్పు కాదేమో కానీ,రాంక్ రాలేదని తిట్టడం, ఇంటికి ఎవరొచ్చినా చదవడం లేదని చెప్పడం,వాడు చూడు ఎలా చదువుతాడో అని కంపేర్ చెయ్యడం మాత్రం ఖచ్చితంగా తప్పే.అందుకే ఏ పిల్లలు కన్పించినా నేను రాంకుల గురించి ఎప్పుడూ అడగను.
                       మా అబ్బాయి చదువు విషయంలో నాకు చాలా సంతృప్తి ఉంది.నర్సరీ,ఎల్కేజీ నేను ఇంట్లోనే చెప్పుకున్నాను.ఫస్ట్ క్లాస్ నుండి h .p .s లో చదివాడు.స్కూల్ 3 గంటలకే అయిపోయేది. పెద్ద హోంవర్క్ కూడా ఉండేది కాదు.ఎయిత్ క్లాస్ వరకు బాల్యాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాడు. నేనెప్పుడూ ఒకటే చెప్పేదాన్ని.నీకు తెలిసినవి తప్పు చెయ్యకు అదొక్కటి చాలు.అలాగే ఫస్ట్ టెన్ లో ఉంటే చాలు అని. అదీ తను బాగా చదువుతాడు కాబట్టి.
                          ఐ.ఐ.టి. లో సీట్ రాలేదని,ఎవరు ఫోన్  చేసినా ఏడ్చేసిన 
ఓ తల్లి నాకు తెలుసు.దాంతో వాడు ఎంత ఫీల్ అయిపోయాడంటే తండ్రి నచ్చచెప్పి రిపీట్ చెయ్యమన్నా వద్దని నార్మల్ ఇంజినీరింగ్ కాలేజ్ లో చేరి పోయాడు.అప్పుడు జరిగిన డిస్కషన్స్ లో మా అబ్బాయి ఒక మాట అన్నాడు.ఐ.ఐ.టి. నే జీవితమా అందులో సీట్ రాకపోతే మాకు అన్నం పెట్టరా ఇంట్లో ఉండనివ్వరా ఇదేం పిచ్చి మమ్మీ జనాలకి అని. ఆ ఒక్క ప్రశ్న చాలు తల్లిదండ్రులు ఆత్మ పరిశీలన చేసుకోడానికి .
                పిల్లలు కూడా తొందరపడి ప్రాణం తీసుకునే ముందు ఒక్క క్షణం   తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే, జీవితం విలువ తెలుసుకోగలిగితే,అప్పుడైనా ఈ బలవంతపు చావులు తగ్గుతాయేమో.
                 ఏ దిగంతాలకో తరలిపోయిన ఆ బంగారు తల్లి ఆత్మ అక్కడైనా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ

Sunday, November 21, 2010

బ్లాగ్ వనభోజనం లో మేతిచమన్,బ్రెడ్ బాసుంది

బ్లాగ్ వనభోజనాలు.

అందరికి ఆహ్వానం. వెరైటీగా బ్లాగ్స్ లో చేసుకుంటున్నాము కదా, అందుకే 

కొంచెం వెరైటీగా ఈ రెండు వంటలూ మీ కోసం.


                             మేథీచమన్




కావలసిన  పదార్ధాలు ;

మెంతికూర                 1 కప్ 
పాలకూర                   1 కప్ 
టమాటా ప్యూరీ             1 కప్   
పనీర్ తురుము            1 కప్
ఉల్లిపాయ                   1 మీడియం సైజ్  
పచ్చిమిర్చి                 4   
అల్లం,వెల్లుల్లి ముద్డ        2 టీస్పూనులు 
ఉప్పు,కారం                 తగినంత 
పసుపు                     అర స్పూను
కసూరిమేతి                 2 టీస్పూన్స్ 
గరంమసాలపొడి           1 టీస్పూన్ 
కాజూ                       1/2 కప్
క్రీం                          1/2  కప్
కొత్తిమీర                    కొంచెం.
నూనె                       4 టేబుల్ స్పూన్స్ 


తయారు చేసే విధానం; 

ఒక టేబుల్ స్పూన్ నూనె లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, మిర్చి కాజు వేయించి ముద్దగా నూరుకోవాలి.
మిగిలిన నూనె వేడిచేసి ఈ ముద్దను వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్దవేసి వేయించాలి.
టమాటా ప్యూరీ వేసి నూనె తేలేవరకూ ఉంచి  పసుపు,తగినంత కారం వేసి ఒక నిమిషం వేయించాలి. 
సన్నగా తరిగిన మెంతికూర, పాలకూర వేసి బాగా మగ్గిన తరువాత పనీర్ తురుము వేసి   ఉడికించాలి
చివరగా గరం మసాల పొడి, క్రీం, తగినంత  ఉప్పు, కలిపి అరకప్పు నీరు పోసి బాగా ఉడికించి కసూరిమేతి పొడి, కొత్తిమీర చల్లి ఒక నిమిషం  ఉంచి దింపెయ్యాలి.
కొంచెం తురిమిన పనీర్, క్రీం తో అలంకరించుకుంటే  మేతిచమన్ రెడీ .    

           
నిన్న స్పెషల్ గా మీకోసం చేసి మరీ  ఈ స్వీట్ ఫోటో తీసి పెట్టానండి.అందరూ వచ్చి నోరు తీపి చేసుకోవాలి మరి.

                                                             

బ్రెడ్ బాసుంది 




                                               

కావలసిన  పదార్ధాలు:

బ్రెడ్                       4 స్లైసెస్ 
పాలు                     1/2  లీటర్ 
పంచదార                 1 కప్  
యాలకుల  పొడి         1 టీస్పూన్ 
కాజూ బాదం              2 టీస్పూన్స్ 
నెయ్యి                    3 టేబుల్ స్పూన్స్ 
ఇన్ స్టెంట్ బాదం మిక్స్ పౌడర్   1 స్పూన్ 
టుటి ఫ్రుటిలు ,చెర్రిస్   అలంకరణకి 

తయారు చేసే విధానం:
 బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ లో ఒకటి రండు సార్లు జస్ట్ తిప్పి వదిలేస్తే క్రంబ్స్ లా అవుతుంది.
 రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొంచెం పెద్ద గాజు బౌల్ లో తీసుకుని ఈ బ్రెడ్ క్రంబ్స్ వేసి  మైక్రోవేవ్ లో 1 మినిట్  హై లో పెట్టాలి.
ఒకసారి బాగా  కలిపి టెంపరేచర్ తగ్గించి ఇంకో నిమిషం పెట్టాలి  బ్రెడ్  క్రిస్పీగా  లైట్ బ్రౌన్ గా  ఫ్రై అవుతుంది  
తరువాత కాచిన పాలు కలిపి 2 మినిట్స్  హై లో ఉంచాలి. తీసి మళ్లీ కలిపి పంచదార,యాలకుల పొడి  కలిపి,మళ్లీ 2 మినిట్స్ హై లో ఉంచాలి. 
తీసి నేతిలో వేయించిన కాజూ బాదం మిగిలిన ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక నిమిషంహై లో ఉంచి తియ్యాలి.
ఇన్ స్టెంట్ బాదం మిక్స్ పోదో ఆప్షనల్  అండీ  వేస్తే కొంచెం కలర్ ,ఫ్లేవర్  బావుంటుంది.
కాసేపు ఫ్రిజ్ లో ఉంచి, టుటి ఫ్రుటిలు,చెర్రిస్ తో గార్నిష్ చేసుకుని  సర్వ్ చేస్తే తిన్నవారు ఆహా  ఏమి రుచి అనక మానరు.
 ఫ్రిజ్ లో ఉంచినప్పుడు కొంచెం చిక్కగా అయ్యింది అనుకుంటే ఒక కప్పు చిక్కని పాలు కలిపి సర్వ్ చెయ్యొచ్చు. 

అందరూ రుచి చూసి (చదివి) ఎలా  ఉన్నది చెప్పాలి మరి.   
                              

Friday, November 19, 2010

మా ఇంట్లో మైక్రోవేవ్

             ప్రస్తుతం మైక్రోవేవ్ ఓవెన్ ప్రతి ఇంట్లోనూ  ఉంటోంది  కదా.మేము కొందాము అనుకున్నప్పుడు కూడా, మిగిలినవి వేడి చేసుకోవడానికే ఎక్కువ ఉపయోగం అంతే అన్నారు చాలా మంది .మా ఫ్రెండ్ కూడా నేనూ రీహీటింగ్ కాఫీ , పాలు కలపడానికి వాడతాను అంతే మా అక్క మాత్రం అప్పుడప్పుడు  కూరగాయలు బాయిల్ చేస్తుంది అని చెప్పింది.దాంతో నిజంగానే చిన్న డౌట్ వచ్చింది.కాని ఎప్పటినుండో కొనాలని ఉంది కనుక ఆ రోజే   బయల్దేరాము.
                షాప్ లోకి వెళ్ళాక అన్ని బ్రాండ్స్ చూసి మళ్లీ డౌట్.మా  బాబుని అడిగితే జనరల్ గా LG బాగానే ఉంటుంది తీసుకోండి అన్నాడు.సరే అన్నీ వదిలి samsung ,LG లలో ఆలోచిస్తుంటే పాపం అక్కడ డెమో ఇస్తున్న అతను నిజాయితీగా చెప్పాడు. రెండూ ఈక్వల్లీ గుడ్ అండీ కాకపోతే samsung లో లోపల బాడీ సిరామిక్ ఉంటుంది LG లో స్టీల్ ఉంటుంది కనుక ఇంకా త్వరగా అయిపోతాయి అని. సరే అని LG  తీసుకున్నాము .అలా మైక్రోవేవ్ మా ఇంటికి వచ్చింది 
                   వస్తూనే పాకింగ్ అంతా పీకేసి స్టార్టర్ కిట్ లోని గ్లాస్ లో నీళ్ళు తీసుకుని వేడిచేసేసి,ఓకే అనుకున్నాము.మా ఇంట్లో ఏ వస్తువైనా  తేగానే ఆన్ చెయ్యడం అలవాటులెండి.
మర్నాడు షాప్ నుండీ వచ్చిన  అతను  ఏవో కాంబినేషన్లు చెపితే జాగ్రత్తగా రాసుకున్నాను.మొదటగా తియ్యగా బిస్కట్స్ చేద్దాం కదా అని రెడీ చేసి అతను చెప్పినట్టే పెట్టాను ,రెండో  నిమిషం అవకముందే పొగ వచ్చి మాడటం మొదలెట్టాయి.సరే టెంపరేచర్  తగ్గిస్తే, సెకండ్ బాచ్  బాగానే వచ్చాయి  అనుకోండి.ఇలా కాదులే అని కాల్ సెంటర్ కి కాల్ చేస్తే ,కంపెనీ అతను వచ్చి కొన్ని చెప్పాడు.ఫ్రీ క్లాసెస్ కి వెళ్ళండి మేడం అని సలహా కూడా ఇచ్చాడు.ఆల్ రెడీ మూడు ఫ్రీ క్లాసెస్ కి కూపన్లు ఉన్నాయ్ కదా వెళ్ళమని మా వారు .ఏమి వద్దులే బాబూ నేనే నేర్చుకుంటాను అని నెట్ లోచూసి  కొంతా ,సొంతంగా చేస్తూ  కొంతా, మొత్తానికి బాగానే నేర్చుకున్నాను.నేనైతే ఇప్పుడు రోజూ  మాగ్జిమం వాడుతున్నాను.
             
మాది 21 Lts .హైలో 840  వాట్స్ వస్తుంది .ఇందులో నేను చేసే ఐటమ్స్ చెప్తాను.

 1 . టమాటాలు.ఉల్లి మిర్చి ముక్కలు కలిపి 3 నిముషాలు హైలో పెడితే చక్కగా  మగ్గిపోతాయి.తీసి తాలింపు వేసుకుని రసం పెట్టేసుకోవచ్చు.
2 . వేపుడు కూరలు చాలా త్వరగా అవుతాయి .ఉదా; దొండకాయ           వేపుడు,ఆలుగడ్డ పచ్చి ముక్కల వేపుడు ,బెండకాయ వేపుడు లాంటివి.బెండకాయ కూర  జిగురు కాని ,ముద్దగా అవడం కాని లేకుండా పొడిపొడిగా  వస్తుంది.
3 . స్వీట్స్ కూడా ఇందులో తొందరగా అవుతాయి. 7 కప్స్  స్వీట్ .బర్ఫీలు. ఖీర్ లు,కేసరి ,హల్వాలు చేసుకోవచ్చు.బ్రెడ్ ఖీర్ కూడా .కొబ్బరి ఉండలు,కొబ్బరి బర్ఫీ చెయ్యవచ్చు.
4 .convection మోడ్ లో కేక్స్  ,బిస్కట్స్ , పుడ్డింగ్స్ అన్నీ  చెయ్యొచ్చు.
5 .రోటి పచ్చళ్ళకు కూడా ఇందులో మగ్గిస్తే మాడుతాయి అన్న భయం ఉండదు.ఉదా;వంకాయ ముక్కలు,మిర్చి,టమాట  కలిపి ఉడికించి పచ్చడి చేసుకోవచ్చు,   
6 . చికెన్ కర్రీ కూడా బాగుంటుంది  ముక్క చాలా మెత్తగా   ఉడుకుతుంది. కానీ చికెన్ ముందు మారినేట్ చేస్తే బాగుంటుంది.
ఆలూ గోబీ,గోబీ మటర్ ఇలాంటి సైడ్ డిషెస్ కూడా చేసుకోవచ్చు. 
7 బొంబాయి రవ్వ ,సేమియా కలిపి వేసే ఇడ్లీలకి మాత్రం  640  వాట్స్ లో 4 
టూ 5 మినిట్స్ పడుతుంది .అలాగే రవ్వ,ఓట్స్  పౌడర్ కలిపి కూడా వెయ్యొచ్చు.
       రైస్ ,పప్పు మాత్రం కుక్కర్   లోనే త్వరగా అవుతాయి కనుక ఎప్పుడూ ట్రై చెయ్యలేదు.పాన్ లో డైరెక్ట్ గా వండే కూరలు కూడా  అనవసరం.ఉదా; సొరకాయ,ములక్కాయ లాంటివి.

సో ఇవీ నా మైక్రోవేవ్ కబుర్లు

Wednesday, November 17, 2010

సరోజ దళనేత్రి -- కే.ఎం .రాధాకృష్ణన్

ఈ మధ్య వచ్చిన కొత్త పాటల్లో  కే.ఎం.రాధాకృష్ణన్ కంపోజిషన్స్ అన్నీ బావుంటాయి.ఒక ఆనంద్,గోదావరి,చందమామ  వీటి లోని పాటలు అన్నీ చాలా కాలం పాటు మారుమ్రోగిపోయాయి.అలాగే రాజా, భూమిక  నటించిన మాయాబజార్ సినిమా లోని ఈ రెండు పాటలు చాలా బావుంటాయి బాలు,చిత్ర  పాడిన' సరోజ దళనేత్రి',  హరిహరన్,శ్రేయ ఘోషల్ పాడిన 'ప్రేమే నేరమౌనా 'రెండూ  నాకు ఇష్టం.

"సరోజ దళనేత్రి " వీడియో 



సరోజ దళనేత్రి,ఇదో లాహిరి
జన్మకి నవరాత్రి ,ఇదో అల్లరి 
ప్రియతమ నిండు మమమమ , అన్న మధురిమే పెళ్లి మంత్రం
బిడియపు లేత సరసపు  ఈడు సమిధగా ప్రేమ యజ్ఞం   "సరోజ"

మంగళ వాద్యం మదిలో మ్రోగ,మల్లెల జడలో వెన్నెలలూగా,
తెరచాటులలో మరులే రేగ ,పొగ చాటులలో అగచాట్లేగా,
తలనే వంచి,తపనే పెంచి ,
కలలే పంచే కల్యాణంలో         "సరోజ"
మనసే కలిసే మాంగల్యాలు,మనసున మనసు మాధుర్యాలు ,
జతగా కలిపే  శతమానాలు,శృతి కలిపే ఈ అనురాగాలు ,
దివిలో తలచి ,భువిలో జరిగే ,
శ్రీవారింటి  పేరంటంలో        "సరోజ"


" ప్రేమే నేరమౌనా  పాట"  వీడియో  

Tuesday, November 16, 2010

ఒక్క మనసు

ఈ జీవిత పయనంలో ఎంతో మంది పరిచయమౌతుంటారు. బంధువులు,స్నేహితులు, కొలీగ్స్ , నైబెర్స్ ,ఇంకా మన పిల్లల స్నేహితుల పేరెంట్స్ ఇలా ఎందఱో. ఎన్ని రకాల బంధాలు ,పరిచయాలు ఉంటాయో అన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి.
కొందరు అన్నీ మాకే తెలుసు అంటారు.మేము చెప్పిందే కరెక్ట్ అంటారు.మరి కొందరు డబ్బు,సంపాదన తప్ప ఏమీ మాట్లడరు.అది తప్ప ఏది ముఖ్యం కాదు అంటారు.కొంతమంది చేసేది చెప్పరు ,చెప్పేది చెయ్యరు .మరి కొంతమంది వాళ్ళ గురించి ఏమి చెప్పరు కాని మనని మాత్రం అన్నీ అడుగుతారు.ఇక ఇరుగు పొరుగులకు ఆరా తీసే తత్వం ఉంటే ఇక అంతే.ఇంట్లో ఏమి వండుకున్నది ,ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళింది,ఒకవేళ మనం తాళం వేస్తే ఎక్కడికి వెళ్ళింది అన్నీ వాళ్ళకే కావాలి. అయ్యబాబోయ్ ఇన్ని రకాల మనుషుల మధ్య మన బ్రతుకు బండి నడవాల్సిందే.
                      కాని ఎన్ని పరిచయాల మధ్యనైనా ,మన మనసు విప్పి అన్నీ చెప్పుకోగలిగి,బాధనూ సంతోషాన్ని  పంచుకోగలిగి, వారికీ మనం అదే స్థాయిలో తిరిగి అందించగలిగితే , ఒక జీవిత కాలం స్నేహాన్ని ఆస్వాదించడానికి,ఆత్మీయ నేస్తం  అవడానికి  ,

'ఆ ఒక్క మనసు ' చాలదూ.
.

Monday, November 15, 2010

చినుకు తడి స్పృశించే వేళ



ఎన్ని వేల పాటలో , పదే పదే వినాలనిపించేవి కొన్ని ఐతే  మనసుకు హత్తుకుపోయేవి కొన్ని.విన్న ప్రతిసారీ వెంటాడేవి కొన్ని.
 

కాని ఒకోసారి సినిమా హిట్ అవకపోతే ఎంత మంచి పాట అయినా మరుగున పడిపోతుంది.బహుశా ఈ పాట అలాంటిదేనేమో.పెద్దగ ఎప్పుడూ చానల్స్ లో కూడా కన్పించదు కాని అద్భుతమైన మెలోడి ఇది .ఎంతగా  మనల్ని హంట్   చేస్తుందంటే నాకైతే  నిజంగా అంత హాయి మోయలేమేమో అనిపిస్తుంది. దానికి తోడు సౌందర్య అందం చూపు తిప్పుకోనివ్వదు.చివరి బిట్ తప్పితే మిగతా  పాట అంతా బాగా తీసారు. 
ప్రియరాగాలు సినిమా లోని ఈ పాట వీడియో ఇది 











Thursday, November 11, 2010

కార్తీకపౌర్ణమి

కార్తీక పౌర్ణమి  అనగానే మనసు చిన్నతనం లోకి పరుగులు తీస్తుంది .వెన్నెల లాంటి జ్ఞాపకం అలలా పలకరిస్తుంది .
ఎందుకో తెలియదు కార్తీకపౌర్ణమి అంటే చాల ఇష్టం నాకు.చిన్నప్పుడు ఉపవాసం ఉండడం కూడా సరదాగా ఉండేది.పగలంతా కష్టపడి (ఏమి తినకుండా ఉండడానికి) ఉపవాసం ఉండి 5 గంటలకే శివాలయానికి వెళ్లి ముగ్గు వేసి ,అందులో బాదం ఆకులమీద ప్రమిదలు పెట్టి 365 వత్తులు కట్టగా కట్టి నానబెట్టినవి వెలిగించి ఇంటికి వచ్చేవాళ్ళం. 
ఒక అప్పటినుండి చంద్రుడు కోసం ఎదురు చూపులు అన్నమాట.మరి ఆయన వస్తేనే కదా భోజనం.


పున్నమిచంద్రుడు 
మాకు పెద్ద ఓపెన్ వరండా ఉండేది .పుచ్చపువ్వు లాంటి వెన్నెల్లో పీట వేసి దేవుణ్ణి పెట్టి పూజ చేసి తరువాత అక్కడే భోజనం చేసేవాళ్ళం.
చిట్టి గారెలు,పులిహోర,నేతిబీరకాయ పచ్చడి,పాయసం తప్పనిసరిగా  ఉండేవి.అసలే ఆకలి దంచేసేదేమో హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే అమృతంలా ఉండేది.
ఈ తరం పిల్లలకి ఆ ఆవకాశం లేదేమో .ఈ అపార్ట్మెంట్ జీవితాల్లో చంద్రుడు కనపడడమే గొప్ప .ఇంకా వెన్నెల్లో భోజనం కూడానా ,ప్చ్ .

Monday, November 8, 2010

హాయ్

హాయ్
అందరికీ నమస్తే.
నా పేరు లత.
మీ అందరి బ్లాగ్స్ చాలా రోజులనుండీ ఫాలో అవుతున్నాను.మీ స్నేహ  పరిమళాన్ని నేనూ ఆస్వాదించాలన్న చిన్న ఆశతో ఈ బ్లాగ్ మొదలుపెడ్తున్నాను.
నా గురించి చెప్పా లంటే బాలూ పాటలంటే ప్రాణం .మెలోడి సాంగ్స్ బాగా వింటాను.వంట చెయ్యడం ఇష్టం కాస్త  భావుకత కూడా ఎక్కువే.
నిదురించే  తోటలోకి పాట నాకు చాల ఇష్టం.అందుకే నా బ్లాగ్ పేరు అదే పెట్టాను.
నా మనసుకు నచ్చినవన్నీ ఇందులో రాసుకోవాలని కోరిక..ఇప్పటికి ఇంతే.  థాంక్ యు.

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008