Friday, February 25, 2011

జీవితపయనంలో


ఆశలు రేపినా అడియాశలు చూపినా

సాగే జీవితం క్షణమైనా ఆగదుగా 


జీవితమంటేనే పోరాటం. పుట్టిన దగ్గరనుండి ఆఖరిశ్వాస వరకూ ప్రతి  ఒక్కరికీ ప్రతిదశలోనూ పోరాటం తప్పదు.ఏ ఒక్కరి జీవితమూ వడ్డించిన విస్తరి కాదు.
అతి పెద్ద సమస్యలు లేనివాళ్ళు నిజంగా అదృష్టవంతులే.

జీవితాన్నిసంతోషంగా గడపటం,ఉన్నంతలో ఆనందాన్ని వెతుక్కోవడం
అన్నింటికన్నా ముఖ్యం. ఏ వ్యక్తికైనా చిరునవ్వు వెలకట్టలేని ఆభరణం.
ఆప్యాయంగా పలకరిస్తూ ఓ చిరునవ్వు నవ్వితే పోయేదేం లేదు కదా.

ఎప్పుడూ ఒకరితో పోల్చుకోకూడదు.మన జీవితం మనది.ఒకరు బావున్నారని అసూయపడినంత మాత్రాన మన బ్రతుకు మారదు పరిస్థితులని ఎప్పుడూ అంగీకరించాలి తప్పదు. 

అందరినీ మనం మెప్పించలేము.ఏది చేసినా లోపాలు వెతికేవాళ్ళు,వంకలు పెట్టేవాళ్ళూ ఎప్పుడూ ఉంటారు.వాళ్ళ సంస్కారం అంతే అని వదిలెయ్యడం తప్పచెయ్యగలిగేది లేదు.అలాంటివి పట్టించుకోవద్దు,ఈ జీవితం మనది అనుకుంటే అవేమి మన దరిచేరవు.

బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం అనుకోడానికీ,బ్రతుకుని ఆస్వాదించడానికీ చాల తేడా ఉంది.అది గ్రహిస్తే చిన్నచిన్న ఆనందాలు మన సొంతం అవుతాయి.ఓ చిన్నకల అది ఓ మొక్కని పెంచడమే కావొచ్చు.ఎంత చిన్నదైనా సరే మనని ఉత్తేజపరుస్తుంది.అది నెరవేరిన రోజున చాలా ఆనందం వేస్తుంది.

రోజులు గడిచిపోతుంటాయి.సంవత్సరాలు కరిగి పోతుంటాయి.వయసు పెరుగుతుంది.ఎన్నో నిన్నలు,మరెన్నో రేపులు, మధ్యలో సజీవం నేడు మాత్రమే.ఇది తెలుసుకోగలిగితే జీవనపయనం సాఫీగా సాగిపోతుంది.



Monday, February 21, 2011

మహరాణి

జనరల్ గా నేను టీ.వి ఎక్కువ చూడను.నిన్న సాయంత్రం మావారు

చానెల్స్ మారుస్తుంటే జెమినిలో ప్రజావేదిక ప్రోగ్రాం వస్తోంది.అప్పటివరకూ

జరిగిన  చర్చ ఏమిటో నాకు తెలియదు కానీ కార్యక్రమం ముగిస్తూ

పరుచూరి గోపాలకృష్ణగారు చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి.

ఆయన చెప్పినది ఇది

"నలభై ఏళ్ళ మా కాపురంలో నేను ఏనాడూ జేబులోనుండి డబ్బులు తీసి 

మా ఆవిడకు ఇవ్వలేదు.ఇంట్లో బీరువాలో ఎప్పుడూ డబ్బులు ఉంటాయి.

ఆవిడ తీసుకుని వాడుకుంటుంది.ఇప్పుడే కాదు నేను ఉద్యోగం చేసే

రోజుల్లో కూడా.

ఆర్ధిక అసమానత లేకపోతే  ఏఇల్లాలికీ అసంతృప్తి ఉండదు  

ఇల్లు ఆవిడ సామ్రాజ్యం,ఆ సామ్రాజ్యానికి ఆమె మహరాణి  "

ఎంత బాగా చెప్పారో అనిపించింది.

సమస్య అంతా మధ్యతరగతి మహిళలకే అని కూడా అన్నారు  బహుశా

జరిగిన చర్చ కూడా మధ్యతరగతి సంసారాల గురించే అనుకుంటా

తల్లిదండ్రులు ఇచ్చినది అంతా భర్తలకే ఇచ్చేసి ఆధారపడ్డ మొన్నటి తరం 

స్త్రీలు, ఆస్తి తమ పేరు మీదే ఉన్నావచ్చే ఆదాయం అంతా భర్తల చేతిలో

పెట్టి రూపాయికి వెతుక్కునే నిన్నటి తరం  మహిళలు, అందరూ

కాకపోయినా ఉద్యోగం చేస్తూ కూడా ఆధారపడి ఉండేవారు ఎక్కడో  ఒకచోట

ఉంటూనే ఉంటారు 

నిజంగానే ఇల్లాలిని మహరాణిని చేసి చూసుకునే భర్తలకి మాత్రం హాట్సాఫ్ .




.






 



Friday, February 18, 2011

జీవితం నేర్పిన పాఠం

జీవితంలో మార్పు సహజమే.కాలం గడిచేకొద్దీ ఎదురయ్యే అనుభవాలు 

ఎంతో కొంత  తమ ప్రభావాన్ని చూపుతాయి.మనుషులు అందరూ ఒకలా 

ఉండరు నిజమే కానీ ఒక్కొక్కరి మనస్తత్వాలు,స్వార్ధాలు చూస్తే ఆశ్చర్యం 

వేస్తుంది.

అందరినీ కావాలనుకోవడం,చేతనైన  సాయం చెయ్యడం,అతి మంచితనం 

కూడా పనికిరావేమో.ఒకరికి సహాయం చెయ్యడం తప్పని అనను కానీ 

దానికి ఒక లిమిట్ ఉండాలని మాత్రం బాగా అర్ధం అయ్యింది.ఎంత  చేసినా

విలువ ఉండదని,అదేదో తమ హక్కు అన్నట్టు ప్రవర్తిస్తారని చాలా

ఆలస్యంగా తెలిసొచ్చింది.


ఎవరి పనులు వాళ్లకి అయిపోవాలి ఎదుటివాళ్ళు ఎంత ఇబ్బంది పడినా

సరే. ఇదేమి స్వార్ధమో నాకు అర్ధం కాదు.వాళ్ళదే రూపాయి,మనది

కాదు.వాళ్ళు చేస్తే ఎంతో కష్టపడినట్టు,అదే మనం చేస్తే ఏముంది ఎంతసేపు

అంటారు.వాళ్ళ అవసరాలకీ మనమే తిరగాలి,మన అవసరాలకీ మనమే

తిరగాలి. ఇవన్నీ చూశాక ,అనుభవించాక విరక్తి వచ్చేసింది.అందుకే నేను 

మారుతున్నాను.మారక తప్పడంలేదు.


ఎవరైనా సరే ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు  అప్పుడే ప్రేమలూ,అభిమానాలు 

నిలుస్తాయి.ఒక్కసారి మనసు విరిగితే, తిరిగి ఆ ఆప్యాయత ఎప్పటికీ 

దొరకదు.






Monday, February 14, 2011

నిశ్శబ్దరాగం

చిగురాకు సవ్వడిలో 

తొలిపొద్దు వేకువలో 

ఇంద్రధనుసు వర్ణాలలో 

తడిసిన ప్రకృతి సోయగంలో 

అన్నింటా నిశ్శబ్దరాగమే 

మనసు పరవశిస్తే 

మయూర నాట్యమే

Tuesday, February 8, 2011

స్ఫూర్తి

జీవితంలో కొన్నికొన్ని మనకి చాలా స్ఫూర్తిని ఇస్తాయి.ఒక మంచి పుస్తకం,ఓ 

మంచి పాట,ఒక గొప్ప సినిమా ఇలా కనీసం ఆ క్షణంలోనైనా మనని ఎంతో 

కొంత ప్రభావితం చేస్తాయి.కొన్ని ఎంతగా మనసుకు హత్తుకుపోతాయి

అంటే పదేపదే మనకి గుర్తొస్తూనే ఉంటాయి.అలాంటి వాటిలోకి ఈ పాటను 

చేర్చేయ్యొచ్చు.

సరళమైన పదాలతోఎంత బాగా రాసారో సిరివెన్నెల.ఈ పాట మొత్తం 

బావున్నా ప్రత్యేకించి ఈ చరణం నాకు చాలా చాలా ఇష్టం


జీవితాన్ని సంతోషంగా గడపటం చాలావరకూ మన చేతుల్లోనే ఉంటుంది 

కదా ఈ చరణం విన్నప్పుడల్లా ఆనందంగా బ్రతకాలనిపిస్తుంది.


తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని  మొక్కలా 

ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా 

అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా 

ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా 

ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా 

వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా 

 
పరుగాపక పయనించవే తలపుల నావ

కెరటాలకు తలవంచితే తరగదు త్రోవ 

ఎదిరించిన సుడిగాలిని జయించినావా 

మది కోరిన మధుసీమలు వరించి రావా


Wednesday, February 2, 2011

ఎన్నో



గుప్పెడంత గుండెల్లో
 
చెప్పలేని అనుభూతులెన్నో 

కాంతులీనే కళ్ళల్లో 

దోబూచులాడే భావాలెన్నో 

అలుపెరగని నా మదిలో 

అనంతమైన ఊసులెన్నో 

ఏ కవిత నే వ్రాయను

ఏ పాట నే పాడను 

ఏ జీవనతీరాలకు నే చేరను   



Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008