Monday, April 25, 2011

మణి(న)దీపాలు



పిల్లలు.మణిదీపాలు.మన దీపాలు. కమ్మని కలలను కలబోసుకున్న మన ప్రేమలకూ,కోరికలకూ,ఆశలకూ ప్రతిరూపాలైన రేపటి స్వప్నాలు.మనం చూస్తుండగానే యిట్టే ఎదిగి పోతారు,వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బిజీ అయిపోతారు.నిజం.ఎంత మహా అయితే పదహారు పదిహేడేళ్ళు వాళ్ళు మన దగ్గర ఉండేది.ఒక్కసారి ఇల్లు వదిలారంటే ఇక గెస్ట్ లాగా వచ్చివెళ్ళడమే.

బాల్యం ఓ అందమైన వరం. అది దాటారంటే అంతే. ఏ పదేళ్ళు ఆనందంగా ఉంటారో. సెవెంత్ అయ్యిందంటే వత్తిడి మొదలు.టెన్త్, ఇంటర్ అంటే ఇక అంతే.మనం ఎంత టెన్షన్ పెట్టకపోయినా వాళ్ళ వత్తిడి వాళ్ళకి ఉంటుంది.ఐ.ఐ.టి.లు,బిట్స్,ఎంసెట్ లు, ఆ సెట్ లు, ఈ సెట్ లు అబ్బో ఎన్నో... ఊపిరాడదు.ప్రొఫెషనల్ కోర్స్ అమ్మయ్య అనుకుంటే ఇంటి నుండి దూరంగా హాస్టల్ బ్రతుకు తప్పదు అఫ్ కోర్స్,  అది బానే ఉంటుంది అనుకోండి.మళ్లీ అక్కడ పరిక్షలు,జి.ఆర్.యి అని అదనీ ఇదనీ,ఇంకా కాంపస్ జాబ్స్ కోసం ప్రెపేర్ అవడం సరిపోతుంది.

ఇక్కడ ఓ చిన్న విషయం చెప్పాలి.2009 లో పాస్ అవుట్ అయ్యారు మా బాబు వాళ్ళు.అప్పుడు ఎంత పీక్ రేసేషన్  అంటే అసలు ప్లేస్ మెంట్స్ కి కాంపస్ కి చాల తక్కువ కంపెనీస్ వచ్చాయి.చేతిలో రెండు మూడు జాబ్స్ తో బయటికి రావలసిన వాళ్ళు దొరికిన దానితో సరిపెట్టుకోవలసి వచ్చింది.ఆ  నెలరోజులూ ఎంత స్ట్రగుల్ అయ్యారంటే ఇక్కడనుండే ప్రతి రోజూ మాట్లాడుతూ ధైర్యం చెబ్తూ మానిటర్ చేసుకోవలసి వచ్చింది.ఆ బాచ్ లోని  అందరూ కూడా మెల్లగా ఇప్పటికి సెటిల్ అవుతున్నారు.ఎందుకు ఇది చెప్పానంటే వాళ్ళకీ ఎంత వత్తిడి ఉంటుందో అని అంతే.వర్క్ ప్రెషర్ తట్టుకుంటూ,పోటీని సమర్ధంగా ఎదుర్కొంటూ జీవితమంతా ఇక పరుగు పందెమే.ఒక్కోసారి ఇదంతా చూస్తుంటే దిగులేస్తుంది.

అయినా ఈతరం పిల్లల్నిచూస్తే ముచ్చటేస్తుంది,వాళ్లకి వాళ్ళ ప్రయారిటీస్ ఖచ్చితంగా తెలుసు.తమకి ఏం కావాలి అన్నది తెలుసు.బాధ్యతలు పంచుకోడం తెలుసు మధ్యతరగతి జీవితాల్లోని కష్టాలు తెలుసు.కన్నీళ్లు తెలుసు.అన్నిటినీ మించి జీవితాన్నిఎలా ప్లాన్ చేసుకోవాలో మనకంటే బాగా తెలుసు.

బాల్యం ఒక గొప్ప వరం అంటారు.ఏమీ తెలియని పసితనం,అమాయకత్వం,
ఏ చిన్నకష్టం వచ్చినా అమ్మా అంటూ చుట్టేసే ఆ నిశ్చింత,ఎదిగేకొద్దీ ఏమై పోతాయో.అందుకే పిల్లల్ని చూస్తే తెలియని ఉద్వేగం కలుగుతుంది.
ఆకాశమంత ప్రేమను పంచి ఇవ్వాలనిపిస్తుంది.ఎప్పటికీ వాళ్ళు మనకి  చిన్నారులే.మన కంటిదీపాలే కదా మరి.




Saturday, April 16, 2011

మల్లెలవాన



వేసవి వచ్చిందంటే చాలు మల్లెల ఘుమఘుమలూ,మామిళ్ళ మధురిమలూ మనసులోకి వచ్చేస్తాయి వీటి కోసమైనా వేసవి కోసం ఎదురుచూడాలని అనిపిస్తుంది.మన ప్రమేయం లేకుండానే మల్లెలు పూసే వెన్నెల కాసే అంటూ మనసు పాటలు పాడుకుంటుంది.ఏడాదికోసారి మల్లెల వానలోతడిసి 
పోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.

అరవిచ్చిన మల్లెల్నిచూస్తే నాకు పూలజడ గుర్తొస్తుంది.అసలు ఆడపిల్లకీ పూలజడకి బోలెడు అనుబంధం ఉంటుంది ఎంత సరదా పడి  వేయించుకునే వాళ్ళమో చిన్నప్పుడు.సీజన్ మొదలైన దగ్గరనుండీ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూపులు.పూలజడ బాగా  కుట్టే ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరో ఉండేవారు ముందు వాళ్ళ అప్పాయింట్ మెంట్ దొరకాలి.ఇక రేపు పూలజడ అంటే ఎంత సంబరమో.వాడుకగా పూలు తెచ్చే అతనికి మంచి మొగ్గలు తెమ్మని చెప్పేది అమ్మ.ఉదయమే తలంటు పోసుకుని,ఆరాక చిక్కు తీసి పిల్లకుప్పెలు పెట్టి జడ వేసుకునేదాన్ని.సవరం కూడా అక్కరలేదండోయ్  నిజ్జంగా అంత పెద్ద జుట్టు ఉండేది నాకు.ఏ మూడు గంటలకో పూలు రాగానే హడావుడి మొదలయ్యేది 

మంచి మొగ్గలు అన్నీ ఏరి పొడవుగా ఉన్న పుల్లలకి గుచ్చి రెడీ చేసేవారు.
జడకు రెండువైపులా రెండు చొప్పున పెట్టి పైనుండి కిందవరకూ  టాకాలు వేసి కుట్టేవారు. వాటిమధ్య గాప్ నింపడానికి మల్లెలూ,అక్కడక్కడా అందం కోసం కనకంబరాలూ,మరువం వేసి చివరి వరకూ కుట్టేవాళ్ళు.ఆఖరికి పైన ముద్దగా మల్లెచెండూ,మళ్ళీ కదంబమాల,మల్లెల మాల ఇలా పేర్చి అన్నివైపులా కుట్టడంతో జడ పూర్తయ్యేది అప్పటివరకూ వంచిన తలఎత్తితే ఒట్టు 

అప్పుడు ఫ్రెష్ అయ్యి పట్టులంగా వేసుకుని నగలు పెట్టుకుని ముస్తాబు అయ్యేసరికి స్నేహితులు కూడా రెడీ అయ్యి వచ్చేసేవారు.ఈ లోగా ఏదమ్మా జడ చూపించు అంటూ ఇరుగుపొరుగుల కేకలు మనం ఏమో మహరాణిలా వెళ్లి అందరికీ జడ చూపించి రావడం,ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది కానీ అప్పుడు సహజంగా ఆలా జరిగిపోయేవి. ఈలోగా ఊళ్ళో ఉన్న ఒక్క ఫోటో స్టూడియో అతన్నీ తీసుకొస్తే అద్దం ముందు మనం,అద్దంలో జడతో ఫోటో దిగడంతో ఒక ఘట్టం పూర్తయ్యేది 

ఇక అసలు కధ అప్పుడు మొదలయ్యేది ఎక్కడ జడ నలిగిపోతుందో అని కూర్చోవాలన్నా,పడుకోవాలన్నా భయం.అమ్మ చేత అన్నం తినిపించుకుని,జాగ్రత్తగా పక్క చేరి తెల్లవార్లూ బోర్లా పడుకోవడమే కదిలితే ఒట్టు తెల్లవారేసరికి మొగ్గలు విచ్చి ఇంకా అందంగా ఉండేది.ఇక ఆ రోజు మోయగలిగినంత సేపు ఉంచుకుని,మల్లెలు వాడుతుంటే అప్పుడు మెల్లగా ఊడదీస్తే పూలజడ ప్రహసనం పూర్తయ్యేది.మళ్లీ తలంటుకునే వరకూ జుట్టు మల్లెల పరిమళంతో గుబాళిస్తూ ఉండేది.ఒకోసారి సీజన్ అయ్యేముందు ఇంకోసారి  వేయించుకునే వాళ్ళం.అలా ఏటా సాగిన పూలజడ ముచ్చటకి పెళ్ళినాడు వేసుకోవడంతో ఫుల్ స్టాప్ పడిపోయింది 

ఇప్పుడు మూరమల్లెలు కొనుక్కుంటే తలలో నిలుస్తాయో లేదో అనుమానమే. 
ఏం చేస్తాం ఆ తీపి గుర్తులని తలచుకుని మురిసిపోడం తప్ప    

Monday, April 11, 2011

సరదాగా ఈ వీడియో

సరదాగా  ఈ  వీడియో చూడండి
మొదటి సారి చూసినప్పుడు భలేగా అనిపించింది. ఆ హావభావాలు,కూర్చునే చేసిన ఆ విన్యాసం,వెనకాల ఇంకో చిన్న బుడతడు మొత్తానికి చాలా నచ్చింది. 






Wednesday, April 6, 2011

సుజాత



అందం,హుందాతనం,స్వచ్చమైన చక్కని చిరునవ్వు,ముద్దు ముద్దుగా మాట్లాడే తెలుగు,ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే తీరు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి ఆమెని తలచుకుంటే.ఆమె నటన ఎంత సహజంగా ఉంటుందో.
ఒక గోరింటాకు,సుజాత,అనుబంధం ఇలా ఎన్నో సినిమాలు.ఎందులో నైనా  చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది ఆమె.

సుజాతతో నటిస్తుంటే ఇంట్లో ఇల్లాలితో ఉన్నట్టు ఉంటుంది కానీ నటిస్తున్నట్టు ఉండదు అని ఎన్నోసార్లు అక్కినేని ప్రశంసించారు కూడా. అంత మంచి నటి ఇక జ్ఞాపకమే. సుజాత అనగానే గుర్తొచ్చే పాట కొమ్మకొమ్మకో సన్నాయి.ఈ పాట ఇష్టపడని వారు ఉండరేమో.ఈ పాటలో నటించిన ఇద్దరూ లేరు అనుకుంటే బాధ వేస్తుంది 





Sunday, April 3, 2011

జయజయజయ ప్రియభారత



ఓ గొప్ప విజయంతో జాతి యావత్తూ పులకించిపోయిన వేళ,ఆనందం 

అంబరాల అంచులు దాటి సంబరాలు జరుపుకున్న వేళ, ప్రతి భారతీయుడి 

కలా నిజమైన వేళ,


ఇలాంటి క్షణాల్లోనే మన అన్న భావన,మన దేశం పట్ల మనకున్నమమకారం,

చెప్పలేని ఆ అనుభూతి బయటపడతాయి.


అంత అరుదైన క్షణాల్లో ఆటగాళ్లంతా ఒకరినొకరు హత్తుకుని వదలకుండా 

ఉద్వేగాన్ని ప్రదర్శించారు,అదంతా ఒక ఎత్తైతే మనసుని హత్తుకుపోయినది 

మాత్రం ఖచ్చితంగా సచినే.


అంతటి క్రికెట్ దేవుడూ ఉద్వేగంతో కన్నీరు పెట్టినా పసివాడిలా కేరింతలు 

కొట్టినా,ఇరవై ఏళ్ళ కల నిజమైన తరుణాన సెలెబ్రిటీని అయినా నేనూ మీలో 

ఒకడినే అన్నట్టు ప్రవర్తిస్తే,అంతే దీటుగా అతన్ని భుజాన మోస్తూ గ్రౌండ్ 

అంతా తిప్పిన సహచరులు మేమూ తీసిపోలేదని నిరూపించారు.ఇరవైఒక్క 

ఏళ్ళు భారతక్రికెట్ కు సేవలందించిన సచిన్ ను భుజానమోయడం మా 

కర్తవ్యం అన్న రైనా మాటలు నిజంగా మనసుని కదిలించాయి.ఎప్పటికీ 

మర్చిపోలేని అనుభూతి ఇది.


ఇదే స్ఫూర్తితో,ఇదే ఐక్యతతో టీం ఇండియా ముందుకు సాగాలని 

కోరుకుంటూ 

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008