Tuesday, May 31, 2011

అమెరికా- అమెరికా

అమెరికా అందమైన దేశం.భూతలస్వర్గం.జీవితంలో ఒక్కసారైనా ప్రతివారు చూడాల్సిన ప్రదేశం ఒప్పుకుంటాను.ఆఫ్ కోర్స్ నాకు అమెరికా గురించి అంత ఏమి తెలియదు అనుకోండి అక్కడున్నస్నేహితులు చెప్పేమాటలు తప్ప.
వచ్చిన కొత్తలో డాలర్ టు రూపీ కన్వర్షన్ మాత్రం అద్భుతంగ ఉంటుంది,ఆ 
తరువాత లైఫ్ ఏమి ఉండదు ఇక్కడ అంటుంది ఓ ఫ్రెండ్,ఆ కంఫర్ట్స్అవీ వేరు
అలవాటుపడితే ఇండియా రాలేము అంటారు మరొకరు ఎవరి అభిప్రాయం వారిది .

కానీ అమెరికా వెళ్ళకపోతే జీవితం వ్యర్ధమనీ,ఏదో పొరపాటు జరిగిపోయింది  అంటే మాత్రం ఒప్పుకోను.ఎక్కడ ఉండే కష్టసుఖాలు అక్కడ ఉంటాయి.ఇవన్నీ
పక్కన పెడితే ఇది ఎందుకు రాస్తున్నాను అంటే,గత రెండు సంవత్సరాలుగా విసిగి ఉన్నాను కాబట్టి.

అసలు జరిగింది ఏమిటంటే ఒక ఆప్షన్ గా ఉంటుంది అని,వీలైతే m.sచేద్దామని
gre రాసాడు మా అబ్బాయి.మంచి స్కోరు వచ్చింది.కాంపస్ ప్లేస్మెంట్స్ లో
జాబ్  కూడా వచ్చింది.సో ఒక నిర్ణయం తీసుకోవలసిన టైంలో అక్కడ ఏ 
యూనివర్సిటీ లోనూ ఎయిడ్ ఇవ్వట్లేదు చదివితే టాప్ వాటిలోనే చదవాలి 
చేతిలో జాబ్ ఉండగా లోన్ పెట్టి వెళ్ళడం అనవసరం అనీ,అందులోనూ తను చేద్దామనుకున్న ఫీల్డ్ అక్కడ చాలా డౌన్ లో ఉండడంతో రిస్క్ ఎందుకనీ డ్రాప్ అయిపోయి జాబ్ లో చేరిపోయాడు.m.s చేస్తేనే ఫ్యూచర్ బావుంటుంది అనుకుంటే వెళ్ళు లేదంటే నీ ఇష్టం అని నిర్ణయం తనకే వదిలేసాము మేము 
ఇంతవరకూ బాగానే ఉంది 

ఇక చూడండి అమెరికా వెళ్ళడం లేదా అంటూ ప్రశ్నలు .అయ్యో అని జాలి 
చూపించడం,వెళ్ళాల్సింది అని సలహా ఇవ్వడం,మీరు పొరపాటు చేశారు వెళ్తే వాడే సెటిల్ అయ్యేవాడు అని కొందరు,పోన్లెండి జాబ్ లో కూడా పంపిస్తారులే అని సానుభూతి చూపించడం ఇలా అయినవాళ్ళు,బయటివాళ్ళు ఫ్రెండ్స్ 
ఒకరని కాదు అసలు అడగనివారు లేరు అనుకోండి.దేవుడా అనిపించేది.

ఒళ్ళుమండి ఇంట్లో వాళ్ళకి అయితే చెప్పేశాను అసలు మేము పంపించము ఇక ఆ టాపిక్ తేకండి అని.వాళ్ళదీ తప్పులేదు లెండి ఇంటికి ఒకరు అమెరికాలో ఉన్నఊళ్ళో నివాసం మరి ఏమిచేస్తాం.మాకు లేనిబాధ అందరికీ ఎందుకో అర్ధం అయ్యేదికాదు.అసలు హైదరాబాద్ లో జాబ్ వస్తే ఇంకా ఆనందం,అంతకంటే జీవితంలో ఏమి కావాలి అని చెప్పాలని అనిపించేది
ఎంత ఓపిక కావలసి వచ్చిందంటే చివరికి స్పందించడం మానేసి (టీవీ భాషలో)ఓ నవ్వునవ్వెయ్యడం అలవాటు చేసుకున్నాను.ఈ మొత్తం ఎపిసోడ్ లో నేను నివ్వెరపోయిన మరో సంఘటన మిత్రులొకరు చాలా కాజువల్ గా ఏముందండి మేము పంపించలా,వాళ్ళే సెటిల్ అవుతారు.అయ్యాక ఓ పాతిక
లక్షలు పంపిస్తే మేమూ సౌండ్ అయిపోతాము అన్నప్పుడు మాత్రం ఇలా
కూడా ఆలోచిస్తారా అనుకుంటే చాలా బాధ వేసింది.

ఇది ఎవరినీ నొప్పించాలని రాయడం లేదు.ఎవరి అభిప్రాయం వారిది.ఎవరి 
ఇష్టం వారిది.జీవితాన్నిఎలా ప్లాన్ చేసుకోవాలో ఎవరికి వారికి బాగా తెలుసు .
ఇది గ్రహిస్తే బావుంటుంది కదా.ఎక్కడైనా అది అమెరికా అయినా,ఇండియా 
అయినా సెటిల్ అయ్యేవరకూ కొంచెం స్ట్రగుల్ తప్పదు.ఈలోగానే ఇదంతా.

ఎప్పటినుండో ఈ టపా రాయాలని ఉన్నా,టైం రావాలి తను ఎన్నుకున్న మార్గంలో విజయం సాధించాక రాద్దామని ఆగాను.నా ఆనందాన్ని పంచుకుని మనస్ఫూర్తిగా సంబరపడ్డ బంధుమిత్రులకు,బ్లాగ్మిత్రులకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.
 

Monday, May 23, 2011

మనసా మాటాడమ్మా

ఒక మనసు పాడే మౌన గీతం ఇది.జీవితంలో ప్రేమ ఒక భాగం.ఆ ప్రేమ జీవితానికి చాల అవసరం కూడా.పసితనం నుండి మన చుట్టూ ఎన్నో ప్రేమలు అల్లుకుంటాయి.
తల్లిదండ్రుల ప్రేమ మనకి భద్రతనిస్తుంది .తోబుట్టువుల ప్రేమ తోడౌతుంది.
బిడ్డల ప్రేమ మనని మురిపిస్తుంది.స్నేహితుల ప్రేమ వెన్నెలలు కురిపిస్తుంది 
కానీ చివరివరకూ మనతో నడిచేదీ మనని నడిపించేదీ జీవిత భాగస్వామి ప్రేమ.కష్టమైనా సుఖమైనా ఏ పరిస్థితిలో నైనా నీకోసం నేనున్నాను అన్న ఈ ప్రేమ ఆఖరి శ్వాస వరకూ మన వెన్నంటే ఉంటుంది.
తలవంచి తాళి కట్టించుకుని చిరుజల్లుల తలంబ్రాల నడుమ చిటికెన వేలు పట్టుకుని కొత్త పెళ్లి కూతురిగా జీవితంలోకి అడుగు పెట్టే ఒక ఆడపిల్ల మనసు లోని భావం ఎంత అద్భుతంగ ఉంటుందో ఈ సాహిత్యంలో వినిపిస్తుంది. ఈ పాట సినిమాలో వచ్చే సందర్భం వేరే అయినా భావం మాత్రం మనసుని హత్తుకుపోతుంది.  
"నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ"  భార్యాభర్తల అనుబంధానికి ఇంతకంటే నిర్వచనం ఏముంటుంది.సిరివెన్నెల సాహిత్యం చిత్ర స్వరంలో 
ఎంత ఆర్ద్రంగా ఉంటుందో వినండి 







మనసా నా మనసా మాటాడమ్మా 
ఎగసే భావాలతో పలికే ఈ సమయంలో ఇంత మౌనమా
మనసా 

చెవిలో మంగళవాద్యం మోగేటి వేళలో 
విన్నా నీ అనురాగపు తేనె పాటనీ 
మెడలో మంగళసూత్రం చిందించు కాంతిలో 
చూశా నీతో సాగే పూలబాటని
నీతో ఏడడుగులేసి నడిచిన  ఆ నిమిషం 
నాతో తెలిపిందొకటే తిరుగులేని సత్యం 
నేను అన్న మాటకింక అర్ధం నీవంటూ 
మనసా ....మాటాడమ్మా 


తల్లీ  తండ్రి నేస్తం  ఏ బంధమైనా 
అన్నీ నీ రూపంలో ఎదుట నిలిచెగా 
తనువూ మనసూ ప్ర్రాణం నీవైన రోజునా 
నాదని వేరే ఏదీ మిగిలి లేదుగా 
ఎగసే కెరటాల కడలి కలుపుకున్నవెనుక 
ఇదిగో ఇది నది అంటూ చూపగలర ఇంకా 
నీవు లేని లోకమింక నాకుండదంటూ 

మనసా.... మాటాడమ్మా

Tuesday, May 17, 2011

పుత్రోత్సాహం




ఆనందంతో మనసు నిండిపోవడం,మాటల్లో చెప్పలేని అనుభూతి,గాలిలో  తేలిపోతున్న ఫీలింగ్  ఇవన్నీ ఒక్కసారిగా చుట్టుముడుతున్నాయి.అవును పుత్రోత్సాహం తండ్రికే కాదు తల్లికీ ఉంటుంది కదా.నిన్నటి నుండీ ఆ ఉత్సాహమే మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది .కారణం మా బాబుకి తను కోరుకున్న కంపెనీలో,తనకు నచ్చిన చోట ఆఫర్ లెటర్ రావడమే.జీవితంలో ఇంతకంటే ఆనందించాల్సిన క్షణం ఇంకొకటి లేదేమో అనిపిస్తోంది.

ఎంత దూరమైనా,ఎన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా తొలి అడుగుతోనే మొదలవుతుంది అంటారు. ఆ తొలి అడుగు కొంచెం నిరాశపరచినా,ఈ మలి అడుగులో విజయం సాధించినందుకూ,ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ప్రాక్టీస్ స్కూల్ అప్పుడు చేసిన వర్క్ నచ్చినా,హైరింగ్ ఫ్రీజ్ నడుస్తుండడంతో అప్పుడు జాబ్ ఇవ్వలేకపోయినా,ఇప్పుడు ఓపెనింగ్స్ రాగానే నువ్వు మాకు కావాలి అని పిలిచి ఆఫర్ ఇచ్చారు అంటే చెప్పొద్దూ ఎంత సంతోషం వేసిందో .నిజంగా మాటలు రావడం లేదు.పిల్లలు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్ అవడమే కదా మనకి కావలసింది.ఇంత ఆనందాన్ని పంచుకోవడం కోసమే ఈ నాలుగు మాటలూ.
 

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008