Thursday, March 31, 2011

రాగరంజితం



తడి  ఆరని జ్ఞాపకాల నీడలో

ఎన్ని మమతల సుగంధాలు

మూసిన కనురెప్పల చాటున 

ఎన్ని స్మృతుల సవ్వడులు 

ప్రతి జ్ఞాపకం ఓ మధురస్వప్నం 

ప్రతి స్మృతిలో ఓ మలయసమీరం 

అనుభూతులన్నీ తోడై ఉంటే

జీవిత పయనం రాగరంజితం    

Monday, March 28, 2011

మనసుకి నేస్తాలు

చాలా చాలా రోజులు ఊహూ సంవత్సరాల తరువాత నిన్న వెన్నెల్లో ఆడపిల్ల నవల చదివాను.ఆ రోజుల్లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ నవల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు.కానీ నాకు ఇప్పటికీ గుర్తు మొదటిసారి ఈ నవల చదివాక ఆఖరి పేజీ అయ్యేసరికి కళ్ళనిండా నీళ్ళతో మనసు భారమై చాలా సేపు అలాగే కూర్చున్నాను.ఇన్నేళ్ళ తరువాత చదివినా అదే అనుభూతి మనసుని తాకి పూర్తయ్యేసరికి కళ్ళు చెమర్చాయి.

ఒక మంచి పుస్తకం చదివితే,ఒక మంచి పాట వింటే వచ్చే ఆనందం ఇవే కదా ఒంటరిగా ఉన్నప్పుడు మనకి తోడుగా ఉండేవి.  ఇంత చిన్న జీవితంలో ఎన్నని ఆస్వాదించగలం.అన్నీ కొంచెం కొంచెం చవిచూసేసరికే  జీవితం అయిపోతుంది అంటుంది రమ్య ఈ నవలలో.
నిజమేనేమో

అసలు పుస్తకాలుంటే ఏమీ అక్కర్లేదు.చిన్నప్పుడు పరిక్షలు అయిపోయి సెలవులు వచ్చాయంటే చాలు అమ్మనడిగి  నవలల  లిస్టు  అంతా  రాసుకుని  రెడీ అయిపోవడమే.ఊళ్ళో లైబ్రరీ ఉండేది రోజూ రెండు నవలలు ఇచ్చేవాళ్ళు.ఉదయాన్నే రెడీ అయిపోయి వెళ్లి తెచ్చేసుకుంటే మరునాటికి  చదివేయ్యాలి.అదే కార్యక్రమం.అంతా నిద్రపోయాక,వేసవిలో ఆరుబయట పడుకుని వెన్నెల్లో పుస్తకం చదువుకుంటే వచ్చే అనుభూతి మర్చిపోగలమా.
అలా దాదాపు అన్ని నవలలూ చదివేశాను.తిరిగి కాలేజ్ కి  వెళ్ళినప్పుడు లంచ్ టైం అంతా ఫ్రెండ్స్ తో ఇవే కబుర్లు.

ఆ అలవాటే ఇప్పటికీ ఉన్నా,ఇక్కడ లైబ్రరీ దగ్గరలో లేక నవలలు దొరక్క చదవడం కుదరడం లేదు.కానీ వీక్లీస్ మాత్రం మానలేదు.లెండింగ్ లైబ్రరీకి మెంబర్షిప్ కట్టి రోజూ ఒక వీక్లీ తీసుకుంటాను.

ఈ మధ్యే తెలిసింది ఈవెనింగ్ అవర్ అని లైబ్రరీలో బుక్స్ వారానికి రెండు రెంట్ కి ఇస్తారు అని మరి మా ఏరియాకి హోం డెలివెరీ ఉందొ లేదో కనుక్కోవాలి.ఉంటె మరోసారి అన్నీ పుస్తకాలూ చదవాలి ఎవరికైనా ఆసక్తి ఉంటే www.eveninghour.com చూడండి.



Friday, March 18, 2011

అరటిపళ్ళే ,కానీ


అరటిపళ్ళు ఫోటోచూసి ఆశ్చర్యం వేస్తోంది కదూ.ఎంత పసుపు పచ్చగా, 

పండుగా ఉన్నాయో చూడండి.అందుకే ఫోటో తీసాను.వీటిని వలిచి తినబోతే 

లోపల కాయ రాడ్ లాగా గట్టిగా ఉన్నాయి.ఒకటి కాదు రెండు కాదు నాలుగు 

కాయలు ట్రై చేసాను  నిన్న సాయంత్రం పాపకి ఇవ్వడానికి.ఊహూ అంత 

గట్టిగా ఉన్నవాటిని పెట్టడానికి ప్రాణం ఒప్పక, బిస్కట్స్ ఇచ్చాను చివరికి.ఈ 

రోజు ఉదయం కూడా అలాగే ఉన్నాయి.

ఈ మధ్య స్ప్రేచల్లి  కలర్ తెప్పించేస్తున్నారు అని వింటున్నాము కానీ

ఇంతవరకూ ఎప్పుడూ అనుభవంలోకి రాలేదు.మొదటిసారి ఇలా జరగడం.

మళ్లీ ధర చూస్తే ముప్ఫై రూపాయలు.యాపిల్స్ అంటే వాక్స్ అంటున్నారు 

డబ్బు,కాయలు వేస్ట్ అయ్యాయి అని కాదు కానీ ప్రక్రుతి సహజమైన పళ్ళని 

 కూడా ఇలా చేసేసి మనని మోసం చేసేస్తున్నారని బాధ.

ప్చ్

Thursday, March 17, 2011

మధువొలకబోసే

పాత పాటల్లో నాకు చాలా నచ్చే పాటల్లో ఇదొకటి. కన్నవారికలలు సినిమా

లోది ఈ పాట.ఎంత అందంగా మొదలవుతుందో ఈ పాట. హిందీలో తీసిన 

ఆరాధనకు ఈ సినిమా రీమేక్ అనుకుంటా. కానీ శోభన్,వాణిశ్రీల జంట 

చాలా బావుంటారు.

ఆపిల్ చెట్లూ,కాయలూ వీటి మధ్య చిత్రీకరణ కూడా బావుంటుంది.

మనసు మనసుతో ఊసులాడనీ 

మూగ భాషతో బాస చేయనీ 

ఈనాటి హాయీ వేయేళ్ళు సాగాలనీ 


సుశీల,రామకృష్ణ  స్వరాలలో వింటున్నంత సేపూ హాయిగా ఉంటుంది.






మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు 

అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు                        "మధువొలక"


అడగకనే ఇచ్చినచో  అది మనసుకందమూ 

అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ 

తలవకనే కలిగినచో అది ప్రేమ బంధమూ

బహుమతిగా  దోచితివీ నాలోని సర్వమూ 

మనసు మనసుతో ఊసులాడనీ 

మూగ భాషలో బాస చేయనీ 

ఈనాటి హాయి వేయేళ్ళు  సాగాలనీ                        "మధువొలక"


గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ 

తలపులకు వలపులకు సరిహద్దు లేదనీ 

కుసుమముతో ఆ భ్రమరం తెలిపింది ఏమనీ 

జగములకు మన చెలిమి ఆదర్శమౌననీ 

కలలుతీరగా కలిసిపొమ్మనీ

కౌగిలింతలో కరిగిపొమ్మనీ 

ఈనాటి హాయీ వేయేళ్ళు సాగాలనీ                         "మధువొలక"

Monday, March 14, 2011

ఆకు - జీవితం, ఆకు


చిగురించే ప్రతి ఆకూ 
మనసును ఉరకలు వేయిస్తుంది 
కొత్తచివుళ్ళతో జీవించమంటుంది 


ఎదిగే ప్రతి ఆకూ 
ఒదిగి ఉండమంటుంది
అనుభూతుల మంచుముత్యాలను
ఒడిసి పట్టుకోమంటుంది


పండిపోయిన  ప్రతి ఆకూ 
వార్ధక్యాన్ని తలపిస్తుంది 
అనుభవాల జ్ఞాపకాలను 
నెమరువేసుకోమంటుంది 


రాలిపోయే ప్రతిఆకూ 
రేపు నీ గమ్యం ఇదేనంటూ 
జీవితసత్యాన్ని నేర్పుతుంది 


ఆకు 


చిరు మొలకవై 
పుడమిని చీల్చుకొస్తావు

చిగురాకు ఊయలవై 
చిలకమ్మకు జోల పాటవుతావు

లేలేత మావిచిగురువై 
కోయిలమ్మకు రాగం నేర్పుతావు 

తొలి ఉషస్సున దోసిలివై 
తుషార బిందువులను లాలిస్తావు 

చిరుగాలికి తల ఊపుతూ 
పూబాలలను  ప్రేమిస్తావు

మండే ఎండకు అల్లాడితే
నీడవై సేదతీరుస్తావు  

హరిత వర్ణంతో  ప్రాణ వాయువై 
లోకానికి శ్వాసవవుతావు

నువ్వు లేకపోతే 
పచ్చని పుడమి లేదు 
బంగారు భవిత లేదు


Monday, March 7, 2011

పెళ్ళంటే


పెళ్ళంటే కళ్యాణమండపాలు, కటౌట్లు,భారీ అలంకరణలు, ఫోటో గ్రాఫర్లూ , వీడియోలు, కోలాహలం,హడావుడీ ఇదేనా.ఖచ్చితంగా కాదు 

పెళ్ళంటే ఓ అందమైన అనుభూతి.రెండుమనసుల్నీ,జీవితాలనీ ముడివేసే అపురూపమైన ఘట్టం.మధురస్మృతిగా కలకాలం నిలుపుకోవలసిన అందమైన వేడుక.జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే పండగ.

అంత ప్రాముఖ్యత ఉన్న వేడుక హడావుడిగా ఎవరో తరుముకు వస్తున్నట్టు,
ఫోటోలకు ఫోజులివ్వడమే సరిపోయేట్టు,చుట్టూ మూగే స్నేహితుల అరుపులు,
కేకలు వీటన్నిటికంటే కాస్త ఉన్నవాళ్ళైతే చాలు పాటల కచేరీలు వీటి మధ్య జరుగుతోంటే చాలా వింతగా ఉంటోంది.

నిన్న అంగరంగ వైభవంగా జరుగుతోంది అని లైవ్ టెలికాస్ట్ ఇచ్చిన అల్లు అర్జున్ పెళ్లిని పదినిమిషాలు చూసేసరికి నిజంగా చిరాకు వచ్చింది.వెనుక
నుండీ పక్కనుండీ తోసుకుంటూ అక్షింతలు వేసేసే అతిధులు,ఎవ్వరికీ పెళ్లి కనపడకుండా మూగేసిన జనాలు  చూసేవాళ్ళకే  ఊపిరాడలేదు.దానికి తోడు పీటల మీద కూర్చుని  ఒకటే కబుర్లు చెప్పెసుకుంటూ జోకులు వేసుకుంటూ ,ఏమిటో చాలా విచిత్రంగా ఉంది.ఇంత కంటే అతి ముఖ్యమైన వాళ్ళమధ్య ఆహ్లాదంగా పెళ్లి చేసుకుని,జనాలందరికీ రిసెప్షన్ ఇచ్చేపని కదా అనిపించింది.ఐతే అంత రష్ లోనూ,గందరగోళంలోనూ చేతిలో అక్షింతలు పట్టుకుని ఓపిగ్గా అక్కడే పది నిమిషాలు నించుని జీలకర్ర బెల్లం పెట్టాక మాత్రమే అక్షింతలు చల్లి  దీవించిన బాలకృష్ణ సంస్కారం మాత్రం నచ్చింది.
సెలెబ్రిటీల పెళ్లి అంటే అంతేనేమో 


ఆ మధ్య మా కజిన్ పెళ్ళిలో కూడా అంతే చుట్టూ స్నేహితులు చేరిపోయి అసలు  స్టేజ్ మీద ఏమి జరుగుతోందో ఎవరికీ కనపడనివ్వలేదు.పెళ్లి వరకూ ఎందుకు ఉన్నామో కూడా అర్ధం కాలేదు.ఇక  పాటల కచేరీ గురించి చెప్పనక్కర్లేదు గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అంటూ పెళ్ళిలో పాడటం. మొన్న మొన్న జరిగిన ఇంకో పెళ్ళిలో కూడా  అక్షరాల లక్ష రూపాయలు పెట్టి గీతామాదురిని  తీసుకొచ్చి ప్రోగ్రాం పెట్టారు.ఇవన్నీ అవసరమా. డబ్బులున్న జబ్బులు తప్ప. ఇక ఈ మధ్య పెళ్ళిళ్ళలో  ఎప్పుడూ టైం దొరకదు అన్నట్టు అమ్మాయి, అబ్బాయి పీటలమీదే తెగ కబుర్లు చెప్పెసుకోవడం.ఇది మరీ విచిత్రం 


ప్రతి మంత్రానికీ అర్ధం తెలుసుకుని చేసుకోమని కాదు కానీ,కనీసం మనసు పెట్టి ఇష్టంగా సంప్రదాయాన్ని ఆస్వాదిస్తూ చేసుకోవచ్చు కదా.అసలు జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు కానీ,తాళి కట్టినప్పుడు కానీ ఆ మంత్రాలు,హై పిచ్ లో  బాండ్ శబ్దం వీటితో, చూసేవాళ్ళకే మనసు స్పందిస్తుంది .ఈక్షణం నుండి వీళ్ళిద్దరూ ఒక్కటి అన్నఉద్వేగంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి.అలాంటిది వధూవరులకి ఇంకెంత స్పందించాలి.

చివరగా ఒక్క మాట. కబుర్లూ,జోక్స్,స్నేహితులూ అన్నీ జీవితాంతం మీవెంటే ఉంటాయి.తిరిగిరానిది వివాహ వేడుక. కనీసం ఆ ఒక్క గంటా అన్నీ వదిలేసి మనసావాచా ఆస్వాదిస్తూ,మనసారా ఒకరి జీవితంలోకి మరొకరిని
ఆహ్వానించుకుంటే కలకాలం ఆ మధురానుభూతి ఓ అందమైన కావ్యంలా  మీ హృదయాల్లో నిలిచిపోతుంది.

Wednesday, March 2, 2011

రుద్రాభిషేకం


మా ఊరిలో చాలా  గుళ్ళు ఉన్నా అన్నింటిలోకి పెద్దది మాత్రం శివాలయమే.

చాలా విశాలంగా చుట్టూ ఎత్తైన గోడలు,లోపల అంతా చెట్లు,పూల మొక్కలతో 

చాలా  అందంగా ఉంటుంది.అక్కడికి వెళ్తే ఒక పట్టాన రావాలని అనిపించేది 

కాదు.ప్రతి పుట్టిన రోజు నాడు కొత్తబట్టలు  కట్టుకుని ఆ గుడికి వెళ్ళేదాన్ని.

అందులోనూ  నవంబర్ లోనేమో సామాన్యంగా  కార్తీకమాసం 

కలిసొచ్చేది.మంచిదని అభిషేకం కూడా చేయించుకునే వాళ్ళం.


ఇక అభిషేకం సంగతి కొస్తే ఒకే ఒక్కసారి శివరాత్రి నాడు మహారుద్రాభిషేకం 

చూశాను.ఇక్కడే బేగంపేట లో ఫ్లై ఓవర్ ఎక్కే ముందు ఎడమవేపున 

ఉంటుంది ఆ శివాలయం.అప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం.రాత్రి 

పన్నెండు గంటలకి రుద్రాభిషేకం బావుంటుంది అంటే చేయించాము.నిజంగా 

చూసి తీరాల్సిందే.దాదాపు రెండుగంటలు జరిగింది.ఎవరో చెప్పారు 

కొబ్బరిబొండాల నీటితో అభిషేకం  చేయిస్తే చాలా మంచిది అని.అందుకని 

అన్నిటితోపాటు పెద్దపెద్ద బొండాలు తీసుకువెళ్ళాము.గర్భగుడి ముందు 

మమ్మల్ని కూర్చోబెట్టి వరుసగా అన్నింటితో అభిషేకం చేసి,అయ్యాక 

స్వామిని అలంకరించి,అప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రసాదం ఇచ్చారు.

అంత సేపూ మంత్రాలతో పాటు ఓంనమశ్శివాయ అంటూ శివనామస్మరణ. 

ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజాము మూడుగంటలు అయినా,ఆ రోజు మాత్రం 

మనసుకు  చాలా తృప్తిగా అనిపించింది

Tuesday, March 1, 2011

అంతా జ్ఞాపకమే

అంతా జ్ఞాపకమే 

పసితనపు బోసినవ్వులు 

ఆడుకున్న బొమ్మలాటలు

అమ్మానాన్నల అపురూపాలు 

తోబుట్టువుల అనురాగాలు  


నేస్తాల ఆత్మీయతలు 

తొలిచూపుల నునుసిగ్గులు 

జతగూడిన మధుర స్మృతులు 

మనసును మీటిన అనుభూతులు 


మాత్రుత్వపు మధురిమలు 

మరో బాల్యపు కేరింతలు 

ఎదిగే ఆశల ప్రతిరూపాలు 

మదిని తాకిన మమతల సుగంధాలు 

అంతా జ్ఞాపకమే  

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008