Tuesday, January 25, 2011

ఈ జ్ఞాపకాలు మధురం


ఇరవై మూడేళ్ళు.
కాలం ఎంత త్వరగా పరుగులు తీస్తుందో.నిన్నోమొన్నో జరిగినట్టు  అనిపించే సంఘటనలు అన్నీ జ్ఞాపకాలై మదిలో దోబూచులాడు తున్నాయి.
రధసప్తమి నాడు తెల్లవారు జామున ఈ ప్రపంచం లోకి రావడానికి తహతహలాడుతున్న నా బిడ్డని తలచుకుని ఎందుకో తెలియదు ఆ క్షణం నా మనసులో మెదిలింది 
కళ్యాణ రామునికి కౌసల్య లాలి,
యదువంశ విభునికి యశోద లాలి 
అంతలోనే చిరునవ్వు విరిసింది. ఆప్యాయంగా అనుకున్నాను నీ కోసం నేనెవరిని కాను కన్నా అని.లేత గులాబి  రంగు చెక్కిళ్ళు ,మూసి ఉన్న గుప్పెళ్ళు,చిట్టి చిట్టి పాదాలు ,ఆ లేలేత స్పర్స ,తొలిసారి తనని చూసిన క్షణం ఎప్పటికీ మర్చిపోలేను.
పుట్టిన పది రోజులకే జబ్బు చేసి డాక్టర్ ఆయిల్ ఇంజెక్షన్స్ చేస్తుంటే భయంతో వాడు దక్కుతాడో లేదో అని చిగురాకులా వణికిపోయిన నా నిస్సహాయత ఇంకా నాకు గుర్తుంది.ఎలా అయితేనే అన్నీ తట్టుకుని వాడు పెరిగాడు 
మగపిల్లలు లేకపోవడంతో డాడీ ఎప్పుడూ అనేవారు వీణ్ణి ఇంజినీర్ ని చేసి నీకు అప్పచెప్తాను నాకు ఇచ్చేయ్యమ్మాఅని. పైకి నవ్వేసినా లోపల అమ్మో అనుకునేదాన్ని.
ఒక్కరోజు కూడా వదలకుండా అపురూపంగా పెంచుకున్నాను.తన బాల్యాన్నిఆస్వాదించాలి  అన్న కారణంతో 
ఉద్యోగం మాటే ఎత్తలేదు నేను.చాలా మెత్తని స్వభావం తనది.చాలా చిన్నప్పుడు కూడా చిన్న సన్నజాజి కొమ్మ ఇస్తే అరగంట ఆడుకునే వాడు.వాళ్ళ డాడీ కలర్ ఫుల్ గా ఉండే బుక్స్ తెస్తే చదువుకుని తన దిండు కింద పెట్టుకుని పడుకునేవాడు.చిన్నప్పుడు బజారు వెళ్తే చాలు అయిస్క్రీం షాప్ దగ్గర ఆగిపోయేవాడు.ఎంతగా అంటే మమ్మల్ని చూస్తూనే షాప్ అతను తనకి నచ్చే ఫ్లేవర్ కప్ తీసి బయటపెట్టేవాడు.
 hps లో  చదివించాలని  మావారికి కోరిక.ఫస్ట్ క్లాస్ కి ఎంట్రన్సు రాయించడానికి వచ్చాము.నాకు బాగా గుర్తు.పరిక్ష రాసాక ఏడుస్తూ వచ్చాడు.మాత్స్ బాగా చేశాను ఇంగ్లీష్ సరిగ్గా రాయలేదు అని.అంత సున్నితంగా ఉండేవాడు.సీట్ వస్తే తన చదువు కోసమే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము మేము .
సన్నగా ఎంత అమాయకంగా ఉండేవాడు అంటే అసలు పెద్దయ్యాక ఎలా బ్రతుకుతాడో ఈ లోకంలో అనుకునేదాన్ని.అలాంటిది ఒకసారి టెన్త్ క్లాస్ కి వచ్చి ఎక్స్పోజర్ వచ్చాక ఆటోమాటిక్ గా  ఆ మెచ్యూరిటీ వచ్చేసింది.చదువు పూర్తయ్యేసరికి  ఇంకా ఇండివిడ్యువలిటీ,డెసిషన్ మేకింగ్ వచ్చేసాయి. ఇంజినీరింగ్ కి రాష్ట్రం కానీ రాష్ట్రం హాస్టల్ కి వెళ్తోంటే ఎంత బాధ వేసిందో.ఇంక తరువాత అలవాటు అయిపోయింది అనుకోండి.జాబ్ చేస్తున్నా, ఇప్పటికీ వచ్చి వెళ్ళాక ఒక రోజంతా ఆ బాధ ఉంటుంది.
ప్చ్, ఏమిటో మనని కన్నవాళ్ళని  వదల్లేక ఒకప్పుడు బాధ.మనం కన్నవాళ్ళని వదల్లేక ఇప్పుడు బాధ.
ప్రతివారికీ ఈ ఫేజ్ తప్పదు కదూ.ఎవరి జీవితాలు వాళ్ళవి.మనం ఎలా వదిలేసి వచ్చేసామో మన పిల్లలూ అంతే.
అందరూ అంటారు తనని చూస్తే లతను చూడక్కర్లేదు అని. అంత జిరాక్స్ కాపీ అన్నమాట నాకు
వావ్,పిల్లలు మన కళ్ళ ముందే ఎంత ఎదిగిపోతారో కదా అనిపిస్తుంది. దేనికైనా తన సలహా అడుగుతాను నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలను  హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని.
ఎన్ని కబుర్లు చెప్తాడో .
మే బీ ప్రతి తల్లి ఇలాగే ఫీల్ అవుతుందేమో తన బిడ్డని తలచుకుని.నా మనసులోని అనుభూతిని  రాయాలని అనిపించింది.
ఎక్కడ పుట్టి పెరుగుతుందో తెలియదు తన మనసు అర్ధం చేసుకుని,తోడవ్వగల ఓ బంగారుతల్లి  తన జీవితంలోకి రావాలని,నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా బాబుకి, పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాన్నా



Tuesday, January 18, 2011

నాలో



నా ఊహలన్నీ ఊసులై 

నీ మనసు ముంగిట  రంగవల్లులు దిద్దాలనీ

నా  నవ్వులన్నీ పువ్వులై 

నీ వలపు వాకిట పరిమళాలు వెదజల్లాలనీ 

నా ఆశలన్నీ శ్వాసలై 

నీ చుట్టూ అల్లుకు పోవాలనీ 

నా కోర్కెలన్నీ దివ్వెలై 

నీ కలల తీరాలకు పయనించాలనీ 

నేనే నువ్వై పోవాలనీ 

నువ్వే నేనై మిగలాలనీ 

ఆరాటమో,ఆనందమో 

తెలియని ఉద్వేగం నాలో 




Saturday, January 15, 2011

శుభాకాంక్షలు


అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.




మా ఫ్లాట్ ముంగిట నేను వేసుకున్న చిన్న ముత్యాల ముగ్గు.

రంగులు అద్దను కానీ ఇలా పూల రేకలతో అలంకరిస్తాను.

ఏదో ఏడాదికోసారి అదో తృప్తి.

సంక్రాంతి  స్పెషల్స్ :  

Monday, January 10, 2011

సంక్రాంతి ఊసులు





ముత్యాల ముగ్గుల్లో,ముద్దబంతి గొబ్బిళ్ళో 


అంటూ సంక్రాంతి ఎన్నో జ్ఞాపకాల సిరులను మోసుకొస్తుంది.ధనుర్మాసపు

వణికించే  చలికి మంచు దుప్పట్లు కప్పుకుంటూ,బంతి పూల  తోరణాలతో,

కళకళలాడే రంగవల్లులతో,చేతికొచ్చిన పంటల సిరులతో పల్లె లోగిళ్ళు

విలసిల్లుతాయి.



చిన్నప్పుడు సంక్రాంతి సెలవులకి ఎక్కువగా మా

పెద్దమ్మ గారి ఊరు వెళ్ళేవాళ్ళం.తనకి ఒక

పాప, బాబు.మేము ముగ్గురం చాలా క్లోజ్ గా

ఉండే వాళ్ళం.

పల్లెటూరు కదా చాలా పెద్ద వాకిలి ఉండేది రోజూ

చుక్కలు పెట్టి ముగ్గులు వెయ్యడం,కొత్తవి నేర్చుకోవడం సరదాగా

ఉండేది.అమ్మగారికీ  దండం పెట్టు,అయ్యగారికి దండం పెట్టు అంటూ

గంగిరెద్దుల మేళాలు,కీర్తనలు పాడుకుంటూ హరిదాసులూ సందడి చేసే

వారు.
 



                  
మధ్యలో పిండి కొట్టించి అరిసెలు వండడం ఒక

హడావుడి .చలిమిడి తింటూ నువ్వులు అద్దడమో, 

వండిన అరిసెలు ఆరపెట్టడమో ఏదో ఒకటి మా పిల్లల పని.

 
ఇక పండగ మూడు రోజులూ ఒకటే హడావుడి.

సాయంత్రమే కళ్లాపి చల్లి  వాకిలి రెడీ చేసే వారు.

చుక్కల ముగ్గులు కాకుండా ముగ్గు గొట్టాలతో

అమ్మ,పెద్దమ్మ వేస్తూ ఉంటే మేము అంచులు

కలపడం,మధ్యలో సున్నాలు చుట్టడం చేసే

వాళ్ళం.

అంతా అయ్యాక ఆ సున్నాలలో  పసుపు

కుంకుమలు,రేగుపళ్ళు,చెరకు,బెల్లం  ముక్కలు పెట్టేవాళ్ళం

ముగ్గుల మధ్యలో బంతి,కారబ్బంతి పూలు ఉంచి మురిసిపోయే వాళ్ళం.

సాయంత్రాలు యిట్టే గడిచి పోయేవి.



 ఇక పండగ నాడు తలంటు,కొత్త బట్టలు,గారెలు,

చక్రపొంగలి,ఆవడలు తప్పనిసరి. వీటన్నినిటిలో

ఆవడలు నా ఫేవరేట్ .రోట్లో వెన్నలా రుబ్బి వండిన

గారెలు, చిలికిన చిక్కని పెరుగులో నాని

నోట్లో వేసుకుంటే కరిగి పోయేవి.

ఒకసారి నేను అడిగానట. మళ్లీ సంక్రాంతి ఎప్పుడు అని.ఇంకా ఏడాది ఆగాలి,

ఎందుకమ్మా అన్నారు.సంక్రాంతి వస్తే  ఆవడలు తినొచ్చు కదా అన్నాను.

అయ్యో ఆవడలకి సంక్రాంతి దాక ఎందుకు అని ఎప్పుడైనా చేసుకోవచ్చు

అని అప్పటినుండీ ఎప్పుడు గారెలు వండినా నాకోసం ఆవడలు సిద్దం.


కనుమ నాడు మరో హడావుడి.కోళ్ళు కోసి ,పలావు  చేసేవారు.పెద్ద గిన్నె

కట్టెల పొయ్యి మీద పెట్టి,ఎక్కడో తెలుసుకున్న రెసిపీని జాగ్రత్తగా ఫాలో

అవుతూ  చేసి, పైన మూత మీద నిప్పులు పోసి,అడుగంటుతుందేమో అని

టెన్షన్ పడుతూ ఎలా అయితేనే పూర్తయ్యేది.నానా  హంగామా

అన్నమాట.ఇప్పుడు ఎంత ఈజీగా  బిర్యానీలు చేసేస్తున్నామో  కుక్కర్ లలో

అనిపిస్తుంది నాకు అది తలచుకుంటే.



ఇక ఈ సెలవుల్లో మధ్యాన్నాలు మా ఇష్టం.ఇంటికి 

వెనుక వైపు సిరిసింత చెట్లు ఉండేవి. వాటినే 

సీమచింతకాయలు అని కూడా అంటారు.కర్రకి 

కొక్కెం కట్టిఎర్రగా మగ్గిన కాయలు కోసుకుని 

తినేవాళ్ళం.

చింతపిక్కలు,వామన గుంటలు ఆటలు ఆడుకునే

వాళ్ళం.అన్నట్టు సెలవుల మధ్యలో పక్కనే ఉన్న 

టౌన్ లో ఒక సినిమా ట్రిప్ తప్పకుండా ఉండేది.


పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి దారి వారిది అయిపోయింది.పండగ పూట

ఆత్మీయులు అందర్నీఫోన్ లో పలకరించుకుంటాము.కాకపోతే ఒకరికొకరం

దూరంగా ఉంటున్నాము అంతే.ఇప్పుడూ కళ్లాపులు  లేకపోయినా

ముగ్గులూ,బంతిపూల తోరణాలు .పిండివంటలు,తోడుగా టీవీ చానెల్స్

అన్నీ ఉంటున్నాయి.


ఎప్పుడైనా  మా పిల్లలతో సహా  అలా ఓ సంక్రాంతి పూట అంతా కలిసి

గడపాలని చిన్న కోరిక,ఆశ.ఎప్పుడు తీరుతుందో కాలమే చెప్పాలి.

Friday, January 7, 2011

బేబీస్ ఈటింగ్ లెమన్

సరదాగా ఈ వీడియో చూడండి. చిన్నారులు  మొదటిసారి నిమ్మకాయని రుచి చూస్తూ  ఎలాంటి ఫీలింగ్స్ మార్చారో 

భలే ఉంది కదూ.

Sunday, January 2, 2011

ఎన్నెన్ని ఇష్టాలో


              కొత్త సంవత్సరం లో, కాదు కాదు  కొత్త దశాబ్దం లో  మొదటి రోజు

అయిపోయింది.రెండో రోజూ అయిపోతోంది.అదే జీవితం,అవే పనులు అదే

రొటీన్. కానీ జనవరి ఫస్ట్ అనగానే ఏదో హడావుడి,సంతోషం ,కాస్త ఆశ,

వీటన్నింటి  మధ్య ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు.

         ఇన్నేళ్ళ  తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే , జ్ఞాపకాల పొరలు

విప్పుకుంటూ ఎన్నో గుర్తొస్తున్నాయి. ఒకప్పటి కలలూ,కోరికలూ, ఆశలూ

అన్నీ.

నాకే కాదు ఎవరికైనా మనసొకటే. స్పందన ఒకటే. ప్రతి ఒక్కరికీ వాళ్లకి

మాత్రమే సొంతమైన ఇష్టాలు ఖచ్చితంగా ఉంటాయి కదూ. 

పిండారబోసినట్టు విరబూసిన వెన్నెల్లో, కొబ్బరాకుల కింద కూర్చుని పాటలు

వింటూ,మనసుకు నచ్చిన పుస్తకం చదువుకోవడం ఇష్టం. అందాలు చిందే 

గులాబీలు,చిట్టి చిట్టి చేమంతులూ, విరబూసే మందారాలూ, పరిమళాలు

విరజిమ్మే మల్లెలూ వీటిని పెంచడం ఎంతో ఇష్టం.వాకిట్లో చుక్కలు పెట్టి

అందమైన ముగ్గులు వెయ్యడం ఇష్టం.ఓ వెన్నెల రాత్రి సముద్రపు ఒడ్డున

కూర్చుని కెరటాల హోరుని వినడం ఇష్టం.ఏ దూర ప్రాంతానికో వెళ్లి ప్రకృతిలో

మమేకమై పోవడం ఇంకా ఇష్టం. మనసుకి దగ్గరైన స్నేహితులతో, గంటల

తరబడి కబుర్లు చెప్పుకోవడం ఇష్టం. 

మా ఫ్రెండ్ అంటుంది మనం ఎక్కువ ఏమీ ఆశించలేదు, ప్రశాంతమైన

జీవితం కోరుకున్నాం.కానీ చిత్రం ఏమిటంటే అదే మనకి దొరకలేదు అని.

               ఇన్నేళ్ళ జీవిత పయనంలో ఇవన్నీ ఏ చాటుకు వెళ్లిపోయాయో

తల్చుకుంటే  ఆశ్చర్యం వేస్తోంది.నిశ్శబ్దంగా పరుగులు తీసే కాలం బంధాల

బాధ్యతల మధ్యకి నన్ను నెట్టేసి, కమ్మేసిందేమో.

Saturday, January 1, 2011

శుభాకాంక్షలు


  
 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు .

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008