Friday, December 31, 2010

మర్చిపోలేని 2010


కోటి ఆశలతో కొత్త సంవత్సరం మరి కొద్ది గంటల్లో

రానుంది.ఎన్నో సంవత్సరాలు వచ్చి పోతూ

కాలగర్భంలో కలసిపోతుంటాయి.కానీ కొన్ని

మాత్రం మరపురాని అనుభూతిని

మిగిల్చి వెళ్తాయి.నా వరకూ ఈ 2010 సంవత్సరం అలాంటిదే.



చాలా రోజుల క్రితం మా బాబు ఇంగ్లీష్ లో డిజైన్ చేసుకున్న బ్లాగ్ చూసి

తెలుగులో కూడా ఉంటాయేమో అని గూగులమ్మని అడిగితే కూడలిని

చూపించింది. అప్పటినుండి  నాకూ ఒక బ్లాగ్ రూపొందించుకోవాలని

మొదలైన చిన్నఆశ  నెరవేరి,అన్నీ నేర్చుకుని ఎలాగైతే నవంబర్ లో బ్లాగ్

లోకం లోకి అడుగు పెట్టగలిగాను. ప్రస్తుతం నా స్థితి తప్పటడుగులు

వేస్తున్న పసిపాప పరిస్థితే.ఇంకా ఎన్నో నేర్చుకోవాలి.




ఈ రెండు నెలల్లో ఏదో తెలియని ఆనందం,అనుభూతి,

ఉద్వేగం. నాకంటూ ఒక ప్రపంచాన్ని చూపిన

సంవత్సరం నాకు ఎప్పటికీ ఒక తీయని

జ్ఞాపకంగా మిగిలిపోతుంది.నా ఈ తొలి

ప్రయాణంలో స్వాగతించి,స్నేహ పరిమళాలు 

పంచుతున్న ప్రతి ఒక్కరికీ,ఈ బ్లాగ్ డిజైన్

చేసిపెట్టిన మా బాబుకూ  నా కృతజ్ఞతలు.

థాంక్ యూ  వెరీ మచ్.
 

Wednesday, December 29, 2010

నీ హృదయం తపన తెలిసీ



            రాత్రి పది గంటలు దాటుతోంది.అసహనంగా అటూ ఇటూ కదిలాను.నిద్ర రావడం లేదు.  హర్ష  మనసు    గాయపడిందేమో.ఆ ఊహే భరించలేనిది గా ఉంది.యస్ నేనే తొందర పడ్డాను. అలా అని ఉండాల్సింది కాదు.
నాకెందుకో కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది.ఇష్టమైన మనిషిని బాధ పెడితే ఇంత వేదన ఉంటుందా, ఏమో అది ఇప్పుడే అనుభవం లోకి వస్తోంది.గంట క్రితం జరిగినది కళ్ళ ముందు మెదుల్తోంది.
"మీతో ఒక విషయం చెప్పాలి " కొంచెం సందేహిస్తూనే అన్నాను.
"వావ్ ఎనీ గుడ్ న్యూస్" అల్లరిగా నన్ను చుట్టేస్తుంటే ముందు అర్ధం కాలేదు. తరువాత నేనూ  నవ్వేసి '"అబ్బ అదేం కాదు,చెప్పేది వినండి "
"ఓకే చెప్పు ఏమిటి" బెడ్ మీద వాలాడు తను.
"నేను, నాకు  జాబ్ వచ్చింది" తటపటాయిస్తూ చెప్పాను. హర్ష గంభీరంగా  మారిపోయాడు. 
"నాకు చెప్పకుండానే ఇంటర్వ్యూ చేసావా  "అదోలా అడిగాడు.
"అంటే జాబ్ వస్తే అప్పుడు చెప్పొచ్చు అనీ" అతని ముఖం చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు
"నువ్వు జాబ్ చెయ్యడం నాకు ఇష్టం లేదు " ముక్తసరిగా చెప్పేసి బుక్ అందుకున్నాడు.
"అదే ఎందుకని " నేనూ వాదనకి సిద్దం అయిపోయాను.
"ఇష్టం లేదన్నాను కదా,నువ్వు ఎన్నిసార్లు ఈ టాపిక్ తెచ్చినా నా సమాధానం ఇదే" అనేసి అవతలి వైపు తిరిగి పుస్తకం చదువుకుంటుంటే ఒళ్ళు మండిపోయింది.
"మీ మొండితనం మీదే కాని నన్ను అర్ధం చేసుకోరా,ఇంట్లో పగలంతా ఏమి తోచడం లేదు.జాబ్ చేస్తే తప్పేమిటి" నాకు నిజంగానే అర్ధం కావడం లేదు. ఎందుకు అతనికి ఇంత పట్టుదల.
నిజానికి అతను ఈ విషయం ముందే చెప్పాడు. పెళ్ళికి అతను పెట్టిన షరతు అనాలో లేక అతని అభిప్రాయం అనాలో కానీ,అప్పుడు నేను ఈ విషయం అంత సీరియస్ గా తీసుకోలేదు.మంచి సంబంధం,ఈ ఒక్క కారణం తో  వదులుకోవడం  ఇష్టం లేక మా వాళ్ళు నన్ను కన్విన్స్ చెయ్యడం కొంత అయితే, నిజంగా హర్ష నాకు చాలా నచ్చాడు.ఒక వ్యక్తిని పెళ్లిచూపుల్లో చూసి అంత ఇష్టపడడం అన్నది ఇంకెవరైనా చెప్తే నేను నమ్మేదాన్ని కాదేమో. కానీ ఫార్మల్ గా కలవడానికి వచ్చి నన్ను ఎంతగా ఇంప్రెస్  చేసాడు అంటే చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి అనేంతగా.అందుకే నేను జాబ్ విషయమై అప్పుడు ఖచ్చితంగా మాట్లాడలేకపోయాను.అది నా పొరపాటే కావచ్చు.  కానీ మే బీ నిజాయితీగా చెప్పాలంటే ఆ మాత్రం పెళ్ళయ్యాక కన్విన్స్ చెయ్యలేకపోతానా  అన్న అహం కూడా కావచ్చు. అప్పుడు నాకు ఇది చిన్న విషయం గానే తోచింది.
నిజంగా ఈ ఆరునెలల్లో అతని భార్యను అయినందుకు ఎంత మురిసిపోయానో,ఎన్నిసార్లు దేవుడికి థాంక్స్ చెప్పుకున్నానో నాకే తెలియదు.అంత ప్రేమించే వ్యక్తి దొరకడం ఖచ్చితంగా  ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టమే . ఎటు తిరిగీ ఈ ఒక్క విషయం లోనే అతను ఒప్పుకోడం లేదు.ముందు చెప్పి ఒప్పించలేక ఈ సారి జాబ్ తెచ్చుకుని మరీ చెప్తే, ఇప్పుడు ఇలా.కానీ ఈసారితో తేలిపోవాలి. అంతే నేనూ వెనక్కి తగ్గదల్చుకోలేదు.
"నాకు సమాధానం కావాలి" మొండిగా కూర్చున్నాను
"శ్వేతా ప్లీజ్ నన్ను విసిగించకు.నేను నీకు పెళ్ళికి ముందే చెప్పాను.నీకు జాబ్ చెయ్యాలని ఉంటే  అప్పుడే చెప్పాల్సింది."
"అదే నేను చేసిన తప్పు "ఉక్రోషంగా అన్నాను. నవ్వాడు హర్ష ఆ నవ్వు చూసి ఇంకా మండింది నాకు.
"ఏమైనా సరే నాకు కారణం కావాలి". 
"నాకు ఇష్టం లేదు అని చెప్పాను కదా ...." అతని మాట పూర్తి కాకముందే నేను విసురుగా లేచాను
"ఇష్టం లేదు, ఇష్టం లేదు అంతే తప్ప కారణం చెప్పరు. పోనీ నేను చెప్పనా. జాబ్ చేస్తే నేను మీకంటే ఎక్కడ ఎదిగిపోతానో అని మీకు భయం.అంతేనా లేక బయటికి వెళ్తే పరాయి మగవాళ్ళతో పరిచయాలు పెరుగుతాయని అనుమానం కూడా ఉందా.సరే ఈ జన్మకి ఇంతే అని సరిపెట్టుకుంటాను " ఇంకేదో అనబోయిన నేను అతని ముఖం చూసి ఆపేసాను.
హర్ష లేచి హాల్లోకి  వెళ్ళిపోతే నేను నీరసంగా కూలబడ్డాను. 
ఛ తొందరపడ్డానేమో,అంత మాట అనకుండా ఉండాల్సింది.నాలో నేనే మధనపడి చివరికి అతనికి సారీ చెప్దామని లేచాను.కానీ మోచేతి వంపులో తల దాచుకుని సోఫాలో పడుకున్న తనని కదిలించే ధైర్యం చెయ్యలేకపోయాను.
ఏ తెల్లవారుజామున నిద్ర పట్టిందో, మెలకువ వచ్చేసరికి చాలా టైం అయ్యింది. ఉలిక్కిపడి లేచాను.అప్పటికే హర్ష రెడీ అయిపోయి షూ వేసుకుంటుంటే  కిచెన్ లోకి పరిగెత్తి కాఫీ కలిపాను.నేను కప్పుతో హాల్లోకి రావడం అతను బయటికి వెళ్ళిపోవడం ఒకేసారి జరిగాయి.ఉసూరుమంటూ కూర్చోబోయి,లేచి  బ్రష్  చేసుకుని వచ్చి కాఫీ కప్పు అందుకుంటూ, ఎందుకో టీపాయ్ వేపు చూసి ఆశ్చర్యం గా దగ్గరికి వెళ్లాను.మడత పెట్టి ఉన్న ఆ పేపర్ అందుకుని ఓపెన్ చేశాను. హర్ష రాశాడు అని తెలుస్తోంది.
"శ్వేతా ,
నువ్వు కోరుకున్నది తప్పేమీ కాదు .కానీ ఈ ఆరు నెలల కాపురం లో నువ్వు నన్ను అర్ధం చేసుకున్నది ఇదే  అనుకుంటే మాత్రం చాలా బాధేస్తోంది.ఓకే. నువ్వు వినాలని అనుకుంటున్న కారణం చెప్తాను.
మా అమ్మ జాబ్ చేసేది. అందుకని నేను చిన్నప్పుడు రెండు మూడేళ్ళు మా అమ్మమ్మ దగ్గర పెరిగాను.ఆవిడ నన్ను బాగానే పెంచింది.అదే సమయంలో ఆరోగ్యం బాగుండక ఒక నెల సెలవు పెట్టి అమ్మ వచ్చింది.ఆ నెల రోజుల్లో అమ్మకి నేను ఎంతగా దగ్గరయ్యానంటే నిద్రపోతే అమ్మ వెళ్ళిపోతుందేమోనని భయపడేవాడిని .అది చూసి అమ్మ నన్నుతనతో తెచ్చేసుకుంది. ఒక ఆరునెలలు క్రెచ్ లో వేసి తరువాత స్కూల్ లో చేర్చింది.ఉదయం ఎనిమిది గంటలకి బయల్దేరితే అమ్మ తిరిగి వచ్చేసరికి రాత్రి ఏడు గంటలు అయ్యేది.నాలుగింటికే స్కూల్ నుండి వచ్చిన నేను మూసిన తలుపుల ఎదురుగా అమ్మ కోసం ఎదురుచూస్తూ కూర్చునే వాణ్ని.
అలసిపోయి వచ్చిన అమ్మని విసిగించాలని అనిపించేది కాదు.ఫలితంగా చిన్న చిన్న కోరికలు అమ్మ నాకు అన్నం తినిపించాలని,కధలు చెప్పాలని ఇలాంటివి కూడా నాకు ఎండమావులయ్యాయి నా పనేదో నేను చేసుకోడం,
చదువుకోవడం,  ఇదే నా ప్రపంచం అయిపోయింది.
ఇన్నేళ్ళ  తరువాత నేను ఆమెని తప్పు పట్టడం లేదు శ్వేతా. అప్పటి పరిస్థితులు అలాంటివి.అందుకే ఆర్ధిక ఇబ్బందులు కారణంగా నా భార్య చేత ఉద్యోగం చేయించ కూడదని ,నా పిల్లలు నాలాగ ఒంటరితనం అనుభవించకూడదని,  వయసు పెరిగే కొద్ది ఒక బలమైన అభిప్రాయం నాలో ఏర్పడిపోయింది.అదే నేనీ స్థాయికి  ఎదిగేలా చేసింది.నా చదువు పూర్తవ్వ గానే  నేను చేసిన మొట్టమొదటి పని అమ్మ తో జాబ్ మానిపించడం.నువ్వు జాబ్ చెయ్యడానికి నేను వ్యతిరేకిని కాను.కేవలం నా జీవితం ఇలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అంతే.
ఇప్పుడు నువ్వు జాబ్ కి వెళ్ళిపోతే  నేను కోల్పోయే  అనుభూతులు నీకెలా చెప్పను.చిరునవ్వుతో ఎదురొచ్చే నీ రూపం నా అలసటని తీర్చేస్తుందని  చెప్పనా.ఇంటికి రాగానే కాళ్ళకి  చుట్టుకునే పసిపాప అంతులేని తృప్తిని ఇస్తుందని చెప్పనా.ఎవరు ఎంత బాగా పెంచినా కన్నతల్లి కాలేరు శ్వేతా ఇది నిజం.నన్ను మించి ఎదిగి పోతావనో, మరేదో నాకు లేదు.పగలంతా బయట తిరిగే నేను,ఇంట్లో ఉండే నువ్వు ఎవరు ఎవరికి కాపలా. నమ్మకం.కేవలం ఆ నమ్మకమే భార్యా భర్తల్ని నడిపిస్తుంది.
ఇప్పుడు కూడా నిర్ణయం నీదే. అది ఏదైనా నేను అడ్డు చెప్పను.ముందే చెప్పాను కనుక నువ్వు కట్టుబడి ఉండాలి అని శాసించను.ఎందుకంటే నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు. ఒంటరితనమూ, ఎదురుచూపులూ నాకు కొత్త కాదు.....నీ హర్ష."
గుండె కరిగి గోదారవుతోంది.క్షణాల్లో ఒక నిర్ణయం.ఎస్ అతను కోరుకున్న జీవితాన్ని అందించడం నా బాధ్యత.నా టాలెంట్ తో,నా హాబీస్ తో నా జీవితాన్ని మలచుకోగలను.ఆ నమ్మకం నాకుంది. 
హర్షని చూడాలి వెంటనే అతని స్వరం వినాలి.మనసు కొట్టుకుంటోంది.కన్నీళ్ళ మధ్య నంబర్ డయల్ చేస్తుంటే వెనుక నుండి శబ్దం వినపడుతోంది సంభ్రమంగా  వెనక్కి తిరిగాను.
హర్ష చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు.
"లెటర్ చదివాక  నువ్వు బాధపడతావేమో అనుకుంటే ఆఫీసుకి వెళ్ళబుద్ధి  కాలేదురా. వెనక్కి వచ్చేసాను." అతని మాటలు వినబడటం లేదు. ఈ ప్రేమ కోసం,ఇంత ప్రేమ కోసం నా జన్మంతా అర్పించనూ.
సుడిగాలిలా అతన్ని చుట్టేసాను "సారీ,రియల్లీ సారీ " వెక్కిళ్ళ మధ్య అస్పష్టంగా అంటూ అతని చేతుల్లో ఒదిగి పోయాను.


నీ హృదయం తపన తెలిసీ ,నా హృదయం కనులు తడిసే వేళలో.

  

Sunday, December 26, 2010

మనసా



ఒక నిమిషం ఆనందం 
మరు నిమిషం ఆరాటం 

ఒక క్షణం ఉద్వేగం
మరుక్షణం ఉద్రేకం 

ఒక నిమిషం సంతోషం 
మరు నిమిషం సంతాపం

ఒక క్షణం ఉత్సాహం 
మరుక్షణం నిర్వేదం  

ఒక నిమిషం ఉల్లాసం 
మరు నిమిషం నిర్లిప్తం 

ఒక క్షణం మమకారం 
మరుక్షణం అధికారం 

మనసా ఎటులోర్తువే 

Thursday, December 23, 2010

మళ్లీ జన్మిస్తా, కే.కే స్వరం లో

చాలా రోజుల క్రితం ఏదో చానెల్ లోఈ పాట విన్నాను. అబ్బ బావుంది

అనుకున్నాను కానీ ఏ సినిమా లోదో తెలియలేదు.

నిన్న ఎందుకో గుర్తొచ్చి వెదికితే తెలిసింది. ఇది మా అశోక్ గాడి లవ్ స్టొరీ

సినిమాలోది అని.ఆ సినిమా ఎప్పుడు వచ్చి వెళ్ళిపోయిందో నాకు

తెలియదు. కానీ ఈ పాట ఎంత నచ్చిందో చెప్పడానికి మాత్రం మాటలు లేవు.

                   గొప్ప సాహిత్యానికి,అందమైన బాణీ కడితే అది  అద్భుతంగా 

గాయకుని స్వరం లో ఇమిడిపోతే  ఇలాగే ఉంటుంది ఏమో  అనిపించింది.

ప్రేమ లోని వేదన ఇంత తీవ్రమా అనిపిస్తుంది ఆ హై పిచ్ లో కేకే  స్వరం వింటే.

ఈ పాట నిన్నంతా నన్ను వెంటాడుతూనే  ఉంది.ఎవరు రాశారా అని మళ్లీ

చూశాను. ఇంకెవరూ ఇంత గొప్పగా రాసేది అనిపించే వన్ అండ్ ఓన్లీ శ్రీ

వేటూరి. 


మళ్లీ జన్మిస్తా,మళ్లీ జన్మిస్తా

నువ్వు నేను ఏకం అయ్యే వరకూ

మళ్లీ ప్రేమిస్తా,మళ్లీ ప్రేమిస్తా 

నీకై పుట్టి నిన్నే చేరేవరకూ

నిన్నే ప్రేమిస్తా  

ఓహో  ప్రియా ఈ మధూదయం లో ఇదేలే  నా బాస 

ప్రియా ప్రియా నీ సమాగమం లో ఇదేలే  నా ఆశ 

మళ్లీ జన్మిస్తా



నీ శ్వాస లో ఊపిరాడాలి నాకు పొత్తిళ్ళలో  పాపలా 

నీ పాపలా ఊయలూగాలి నేను కౌగిళ్ళలో ప్రేమలా 

స్నేహమల్లే  సాగేపోయే, దాహమేదో రేగే నాలో 

చెలీ చెలీ ఆశలు నాలో  ప్రియా ప్రియా

మళ్లీ  జన్మిస్తా                                    


మా అమ్మవై రూపం ఇవ్వాలి నాకు నా కంటికే చూపుగా 

ఏ జన్మకూ తోడు కావాలి నువ్వు  చుక్కానిలా చుక్కలా 

బంధమేదో పెరిగే వేళ, బ్రతుకు తరిగే  ఈ వేళ

నా నేను ప్రేమవు నీవే ప్రియా ,ప్రియా                          "మళ్లీ జన్మిస్తా "









Tuesday, December 21, 2010

కాకరకాయ కారం,శనగపప్పు కారం,నల్ల కారం

కాకరకాయ కారం :

కావలసిన  పదార్ధాలు : 

కాకరకాయలు              రెండు 

జీలకర్ర                       రెండు స్పూన్లు 

వెల్లుల్లి రెబ్బలు              పది 

ఉల్లిపాయ                   ఒకటి చిన్నది

పచ్చి కారం                 మూడు స్పూన్లు 

ఉప్పు                         తగినంత

మజ్జిగ                       ఒక కప్పు

చింతపండు                చాలా కొంచెం (ఒక్క తోలు)

నూనె                        ఒక కప్పు

పసుపు                     చిటికెడు

తాలింపుకు :

శనగపప్పు              ఒక స్పూను
మినప్పప్పు            ఒక స్పూను
ఆవాలు                అర స్పూను
ఎండుమిర్చి           రెండు మూడు
కరివేపాకు             రెండు రెమ్మలు 
వెల్లుల్లి                  రెండు రెబ్బలు  

తయారు చేసే విధానం :

కాకరకాయలు చక్రాల్లా తరగాలి. ఒక కప్పు మజ్జిగలో చిటికెడు

పసుపు,కొంచెం ఉప్పు, చింతపండు , కాకరకాయ ముక్కలు  వేసి,

మజ్జిగ ఇగిరిపోయి  ముక్కలు పొడి గా వచ్చేంతవరకు ఉడకపెట్టాలి.

పచ్చికారం,జీలకర్ర, వెల్లులి మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి, అందులో

ఉల్లిపాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా ఒకసారి తిప్పి

కచ్చాపచ్చాగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోవాలి.

నూనె వేడి చేసి ఉడికించిన కాకరకాయ చక్రాలని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే నూనెలో (వడకట్టి)  శనగపప్పు,మినప్పప్పు ఆవాలు,

ఎండుమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు వేసుకుని,కరివేపాకు కూడా వెయ్యాలి

అవి వేగాక నూరిన ముద్ద వేసి, సరిపడా ఉప్పు చల్లి , పచ్చిదనం

పోయేవరకు బాగా వేయించాలి.తరువాత వేయించిన  కాకరకాయ ముక్కలు

వేసి ఈ కారం అంతా ముక్కలకు పట్టేలా బాగా కలిపి సన్నని సెగపై రెండు
నిమిషాలు వేయించుకోవాలి.

పొడిపొడిగా కాకరకాయ కారం రెడీ అవుతుంది.


శనగపప్పు కారం:

కావలసిన పదార్ధాలు

వేయించిన శనగపప్పు 

(పుట్నాలపప్పు)           రెండు కప్పులు

ఎండుమిర్చి                 పది

ఎండుకొబ్బరి               అర చిప్ప

జీలకర్ర                      రెండు  స్పూనులు

ఉప్పు                         తగినంత

వెల్లుల్లి                       పది రెబ్బలు

నూనె                       ఒక స్పూను 
 

తయారు చేసే విధానం :

నూనె వేడిచేసి ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి

ఎండుమిర్చి,ఉప్పు ,జీలకర్ర ,ఎండుకొబ్బరి , వెల్లుల్లి మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు సెనగపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని అంతా కలిసేలా బాగా కలిపి బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.


కరివేపాకు కారం (నల్లకారం):

కావలసిన పదార్ధాలు:

కరివేపాకు                       రెండు కప్పులు

ఎండుమిర్చి                     పది

ధనియాలు                     నాలుగు స్పూన్లు

శనగపప్పు                      రెండు స్పూన్లు

మినప్పప్పు                     రెండు స్పూన్లు

ఎండుకొబ్బరి                   చిన్న ముక్క

జీలకర్ర                         రెండు స్పూన్లు

వెల్లుల్లి                         పది రెబ్బలు

చింతపండు                    కొంచెం

ఉప్పు                           తగినంత

నూనె                          నాలుగు  స్పూన్లు  

తయారుచేసే విధానం :

నూనె వేడిచేసి శనగపప్పు,మినప్పప్పు ,ధనియాలు దోరగా వేయించుకుని తీసుకోవాలి.

తరువాత ఎండుమిర్చి కూడా  దోరగా వేయించుకోవాలి.

తరువాత కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు ముందు శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర,

ఎండుకొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి,తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి,

చివరగా వేయించిన కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకుని  స్టోర్ చేసుకోవాలి.

ఈ రెండు కారంపొడులలొనూ   ఎవరి రుచిని బట్టి వారు ఎండుమిర్చి

ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు.అలాగే నల్లకారం లో చింతపండు కూడా

పులుపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.



           

Saturday, December 18, 2010

అలరించే అద్భుతమైన రుచులు

ఎన్ని రకాల కూరలున్నా, ఎన్ని వెరైటీ వంటకాలున్నా, అన్నింటినీ తలదన్ని ఎవర్  గ్రీన్ గా కొన్ని రుచులు ఉంటాయి.ఎన్నిసార్లు తిన్నా, ఎప్పుడు తిన్నా, ఎన్ని సంవత్సరాలైనా బోర్ కొట్టదు సరి కదా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది కూడా. అవేమిటో ఇప్పుడు చూద్దాం.


శనగపప్పు కారం:  

వేయించిన శనగపప్పు,ఎండుమిర్చి,ఎండుకొబ్బరి  ఎట్స్ ట్రా  కలిపి కొట్టుకునే ఈ కారప్పొడి  వేడివేడి ఇడ్లీల్లో అయినా, వేడి అన్నంలో వేసుకుని 
తిన్నా కమ్మని రుచితో   నోరూరిస్తుంది 

మీరు కొబ్బరి పచ్చడి చెయ్యండి, పల్లీ పచ్చడి చెయ్యండి, దేనితో తిన్నా చివరలో కారప్పొడీ, నెయ్యీ వేసుకుని మరో రెండు ఇడ్లీలు లాగించనిదే అసలు ఇడ్లీ  తిన్నట్టే ఉండదు అని ఫీల్ అయిపోయే వారు చాలామందే ఉంటారు.


కరివేపాకు కారం(నల్లకారం): 

ఘుమఘుమలాడే కరివేపాకు, ఎండుమిర్చి,ధనియాలు, వెల్లుల్లి  మరిన్ని వేసి తయారు చేసుకునే ఈ కారం వేడి అన్నం లో కరిగిన నెయ్యితో ఆహా అనిపిస్తుంది.



గోంగూర పచ్చడి: దీని గురించి నేను చెప్పేది ఏముంది అండీ.ఆంద్ర మాత గా స్థిరపడిపోయింది కదా. ఎండుమిర్చితో చేసినా ,పచ్చిమిర్చి తో చేసినా ఈ పచ్చడిని తలచుకోని వారు,ఆస్వాదించని వారు  ఉండరు.




ఆవకాయ:  మల్లెపువ్వు లాంటి తెల్లని అన్నంలో,ఎర్రని, ఎర్రెర్రని ఆవకాయ, ముద్దపప్పు,  నెయ్యి  అబ్బ, నోరూరిపోతోంది  కదూ

పైవి ఏవైనా ఉండవేమో కానీ ఆవకాయ లేని తెలుగిల్లు ఉండదు.

చివరగా 


కాకరకాయ కారం: ఇది ఎంతమంది ఇష్టం గా తింటారో నాకు తెలియదు కానీ చిన్నప్పుడు  అమ్మ చేస్తే నేను చాలా ఇష్టపడేదాన్ని

కాకరకాయలు చక్రాల్లా కోసి,మజ్జిగ లో ఉడకపెట్టి,నూనె లో ఫ్రై చేసి,జీలకర్ర, వెల్లుల్లి,పచ్చి కారం  కలిపి నూరిన ముద్డ వేసి వేయిస్తే దాదాపు నెల రోజులు నిలువ ఉండేది.చాలా స్పైసీ గా ఉండేది.

ఇలా రాసుకుంటూ పోతే ఇంకా కందిపొడి, కందిపచ్చడి ఈ లిస్టు కి అంతం ఉండదేమో.

ఇన్ని చెప్పిన తరువాత మీకో విషయం చెప్పాలి.నా చిన్నప్పుడు మా దూరపు బంధువులావిడ ఉండేది.ఆవిడ ప్రసక్తి ఎప్పుడు వచ్చినా ఇది తప్పకుండా చెప్పుకునేవారు. వాళ్ళ ఇంట్లో పై నాలుగు వెరైటీలు, నాలుగు సీసాల్లో టేబుల్ మీద ఉండేవట.ఆవకాయ ఎటూ ఉంటుంది కదా. వీటిలో ఏసీసా ఖాళీ అయితే అది వెంటనే చేసి నింపేసేవారట ఆవిడ. పల్లెటూరు కదా  స్వచ్చమైన వెన్న కాచిన నెయ్యి సరే సరి.

ఇంట్లో  ఎప్పుడు ఎగ్స్ రెడీగా ఉండేవి. సో, ఏ వేళ కాని వేళ, అర్ధరాత్రి,అపరాత్రి  ఏ టైం లోఅతిధులు  వచ్చినా రెండు గుడ్లతో ఆమ్లెట్ వేసి ఈ వెరైటీలు, కమ్మని నేతితో భోజనం పెట్టేవారట.ఇంకా కూరలతో పని ఏముంది చెప్పండి.

సడెన్ గా ఈ తిండి గోల ఏమిటి అనుకోకండి.ఉదయం శనగపప్పు కారం చేశాను.అది చేస్తుంటే ఈ ఆలోచనలు వచ్చాయి.అక్షర రూపం ఇస్తే ఇదిగో  ఇలా ఈ పోస్ట్ అయ్యింది. 

అదన్నమాట సంగతి.







Wednesday, December 15, 2010

నేస్తం

నీ పలకరింపు 
ఓ విరిజల్లై నన్ను తాకుతుంది

 నీ చిరునవ్వు 
నేనున్నానన్న ఓదార్పుని అందిస్తుంది 

నీ మాట
సెలయేటి పాటై నన్ను చుట్టేస్తుంది 

నీ సాంగత్యం  
నన్ను నేనే మర్చిపోయేలా చేస్తుంది 


Friday, December 10, 2010

బాబోయ్ ఇవేం ధరలు

 ఉదయాన్నే ఓ శుభవార్త. పాలు లీటరుకు  రెండు రూపాయలు పెరిగాయి అని. ఒక్క క్షణం నేత్రాలు గిర్రున తిరిగాయి.మనసు గబగబా లెక్కలు వేసేసింది.నిజంగా అన్నీ రేట్లు ఇలా పెరిగిపోతున్నాయి  ఏమిటండీ  బాబూ.
  
ఆల్ రెడీ బియ్యం,పప్పులు,కూరలు ,పళ్ళు అన్నీ తారాజువ్వల్లా ఆకాశం లోకి వెళ్లి,ఇక దిగిరామంటూ అక్కడే కూర్చున్నై.శక్తివంచన లేకుండా మిగిలినవి కూడా  ఉల్లి,వెల్లుల్లి సహా పెరుగుతూనే ఉన్నాయి. మళ్లీ పాలు ఇంకో రెండు రూపాయలు. వెరసి లీటరు పాలు కొనుక్కుంటే  నెలకు వెయ్యి రూపాయలు బడ్జెట్.ఇలా ఒక్కొక్క దానికి బడ్జెట్ పెంచుకుంటూ పొతే నెలవారీ ఖర్చు ఎంత పెరుగుతుందో తలచుకుంటే గుండె గుబుక్కుమనక మానదు.

అప్పుడప్పుడూ అనిపిస్తుంది. చేతికి ఆరేడు వేలు మాత్రమే వచ్చే సామాన్య  జీవి ఎలా బ్రతకగలడా  అని. సింపుల్. లీటర్ నుండి ముప్పావుకి  తగ్గుతాం, అవీ  ఎక్కువనిపిస్తే అర లీటర్ తో సరిపెడతాం.ఇదీ మా కజిన్ నుండి టక్కున వచ్చిన జవాబు. ఏవి ఎంత పెరిగినా కొనకా తప్పదు, తినకా తప్పదు, బ్రతక్కా  తప్పదు.ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు.కానీ ప్రస్తుత పరిస్థితుల్లో  పెరిగే రేట్లకు అనుగుణంగా ఆదాయం పెంచుకోవలసిందే తప్ప మరో మార్గం లేదేమో.

మళ్లీ పెట్రోల్ రెండురూపాయలు పెరుగుతుంది అని నిన్న న్యూస్ లో చెప్తున్నారు.నాకైతే  ఒక్కటే అనిపించింది.మూడు, నాలుగు లక్షలు పోసి కారు కొని,దాన్ని  మైంటైన్ చేస్తూ, పెట్రోల్ కి తగలేసే బదులు ఆ వడ్డీ పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళినా క్యాబ్ తెప్పించుకుని వెళ్ళొచ్చు ఏమో. కనీసం డ్రైవింగ్ యాతన అన్నా తప్పుతుంది ఈ ట్రాఫిక్ లో. 

సాధారణంగా మా రోజుల్లో అంటూ మొదలెడతారు మన తల్లిదండ్రులు ప్రతి విషయానికీ .మనమూ ప్రస్తుతం హ్యాపీగా ఆ కేటగిరీ లోకి  చేరిపోయి  కాపురం పెట్టుకున్న తొలిరోజుల్లో బడ్జెట్  గురించి చెప్పొచ్చేమో. 

 చివరగా ఒక్క మాట. అధికారం కోసం తపించే ఏ నాయకులైనా ,చిత్తశుద్ది తో పనిచేసి, ధరలు తగ్గించి, జనానికి బ్రతుకు బరువు కాకుండా ఆనందంగా బ్రతకగలిగేలా చేస్తే, జనం బ్రహ్మరధం పట్టరూ.అసాధ్యమంటారా ఇది.







Wednesday, December 8, 2010

"అశ్వనీచంద్ర "

ఇది మా బాబు పేరు దీని వెనుక చిన్న కధ ఉంది. సరదాగా రాస్తున్నాను.

పేరులో ఏముంది, పేరులోనే అంతా ఉంది. ఏమో.    

మా బాబు అశ్వనీ నక్షత్రం లో పుట్టాడు.నిజానికి ఆ నక్షత్రం ప్రకారం చ ,ల,  వీటితో మొదలయ్యే పేర్లు పెట్టాలి.ఏ చరణ్ అనో పెడితే బాగానే ఉండేది.నేను ఇలా తర్జన భర్జన  పడుతుండగా, మా ఆస్థాన బ్రాహ్మడు {మా పెళ్లి చేయించింది కూడా ఆయనే లెండి} నక్షత్రం పేరే పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది.వాడు చాలా వృద్ధిలోకి వస్తాడు, అని  "అశ్వనీకుమార్ " అని రాసి పంపించాడు.సరే బాగానే ఉంది కానీ కుమార్ మరీ పాతగా ఉంది వద్దు అనుకుని  అది తీసేసి నేను చంద్ర తగిలించాను.ఓకే .వెరసి అశ్వనీచంద్ర అయ్యింది.

చాలా చిన్నప్పుడు అంతా చెందూ  అని పిలిచేవారు.  అబ్బే, నాకు ఎందుకో అదీ నచ్చక  అశ్వీ అని పిలవడం మొదలుపెట్టాను.క్రమంగా  అది అలవాటు అయిపోయింది.అంతవరకూ బాగానే ఉంది .

ఐతే తన బర్త్ సెర్టి ఫికేట్  లో ashwanichandra   అని ఉంది.స్కూల్ లో ఎప్పుడూ ప్రాబ్లెం రాలేదు కనుక మాకూ ఆ ధ్యాస లేదు

ఇక ఇంజినీరింగ్ కి  బిట్స్ పిలానికి వెళ్ళాక కష్టాలు మొదలయ్యాయి.అశ్వని వరకే చూసి పేపర్స్ ఆడపిల్లల వాటిలో కలిపేసే ప్రొఫెసర్స్, నలుగురిలో ఉండగా సడెన్ గా వచ్చి ఆర్ యు అశ్వని అని అడిగే ఆడపిల్లలు, నోరుతిరగక పేరుని ఖూనీ చేసే కొందరు ఇలా అన్నమాట.

ఇంతకంటే గొప్ప పేరు దొరకలేదా నీకు, నీ పేరు చూడు ఎంత షార్ట్  అండ్ స్వీట్ గా ఉంటుందో. నాది ఓ దిక్కుమాలిన పేరు,ఎవరికీ నోరు తిరిగి చావదు, అని మొత్తుకునేవాడు. అచ్చ తెలుగు పేరు దానికి ఏమైంది అంటే అది తెలుగు దానిలా ఎక్కడ ఏడ్చింది, h చేరి  బెంగాలి పేరు అయ్యింది కదా అంటాడు.
             
ఈ విషయంలో  అస్సలు నా ప్రమేయం లేదు  అంతా మమ్మీదే అని హ్యాపీగా తప్పించేసుకుంటారు మా శ్రీవారు.

ఇవన్నీ చాలక ట్రైన్ రిజర్వేషన్ చేయించుకుంటే అక్కడ ఫిమేల్  అని పడుతుంది ఒకోసారి. టి.టి.లతో చిన్న గొడవ. ఐ.డి  కార్డు చూపించి మరీ నమ్మించాలి. దిక్కుమాలిన పేర్లు పెడితే ఇలాగె ఉంటుంది అని మా వాడు లెక్చర్.  ఏ రాం, టాం, జాన్  ఇలా ఏది  పెట్టినా  ఈ తిప్పలు తప్పేవి కదా అని వాపోతాడు.

ఇక చివరి ట్విస్ట్ ఏమిటంటే, మొన్న పోస్టింగ్ వచ్చి జాబ్ లో జాయిన్ అవడానికి వెళ్తే  ఎకామడేషన్ గర్ల్స్ హాస్టల్ లో ఎలాట్ చేయడాలు, క్లైంట్ నుండి వచ్చే ఈ మెయిల్స్ లో మాడం అని రాయడాలు ,  ఇక అంతే ఫోన్ లో అరగంటసేపు  నేను టార్గెట్ ఐపోయాను.

ప్చ్. ఏం చెయ్యను.అప్పుడు చిన్న వయసు. ఇంత దూరం ఆలోచించలేదు.  కొన్ని కొన్ని వెనక్కి తీసుకోలేము కదా. సారీ నాన్నా.

కొసమెరుపు ఏమిటంటే, వాళ్ళ బెంగాలీ మేనేజర్ మాత్రం అష్వనీచంద్రా  అని పూర్తి పేరుతో బ్రహ్మాండంగా పిలుస్తాడట.
                               
అశ్వనీచంద్ర . ఏమిటో. ఇప్పటికీ నాకు  ఈ పేరు డిగ్నిఫైడ్ గా  చాలా బావుంటుంది. నేను పెట్టాను కనుక అంటారా.


Wednesday, December 1, 2010

ఉషోదయం


  
"ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి రాత్రి  పైరగాలి,
బ్రతుకంతా ప్రతి నిమిషం, పాట లాగ సాగాలి,
ప్రియా, ప్రియా, పాట లాగ సాగాలి "

జీవితం లోని ప్రతి క్షణాన్ని అందంగా మలచుకోవాలని, 
ప్రతి అనుభూతిని ఆస్వాదించాలని, బ్రతుకంతా ఒక తీయని 
పాట లాగ సాగిపోవాలని,  
ఎన్ని కలలు కన్నాను, 
ఎన్ని రమ్యహర్మ్యాలు నిర్మించుకున్నాను,
ఎన్ని ఆశల పందిళ్ళు వేసుకున్నాను.
ఆ పందిళ్ళ వాకిట తొలి పొద్దునై, మలి సంధ్యనై వెలిగిపోవాలని 
ఎంతగా ఉవ్విళ్ళూరాను.
ఏవీ అవన్నీ,
గుడికే చేరని దీపాలైన నా ఆశలు,
కలల ప్రమిదలలో కర్పూరంలా  కరిగిపోయిన నా కోరికలు,
మూసిన  కనురెప్పల చాటున కన్నీటి దారుల్లో మిగిలిపోయిన 
నా రేపటి  స్వప్నాలు,  
అనుక్షణం జీవన పోరాటంలో అలసిన మనసు,కరిగిపోయే కాలంతో పాటు జీవితం అలా చేజారిపోతుంటే  ఏమీ చెయ్యలేని నిస్సహాయత, భరించలేని నిర్లిప్తత.
ఒంటరితనం  నేస్తమై, నిశ్శబ్దం నా చుట్టూ అల్లుకున్న వేళ ,
నాకు నేనే తోడునై, ఓదార్పునై  ఇలా ఎన్నినాళ్ళో.
ఐనా ఏదో  ఆశ.
ప్రతి ఉదయం మేలుకొలిపే రవికిరణంలా,
ఓ కొత్త ఉషోదయం నా కోసం వేచి ఉందనీ, 
వాసంత సమీరాలు అలలై నన్ను పలుకరిస్తాయని,
రేపటి జీవితం నాదేనని,  
చిన్న ఆశ.


Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008