Thursday, November 10, 2011

కార్తీకంలో బ్లాగ్ వనభోజనాలు

కార్తీకం అంటేనే సందడి.పూజలు,ఉపవాసాలు,కార్తీక దీపాలు.మధ్యలో వనభోజనాలు,మనసు ఎక్కడికో  వెళ్ళిపోతుంది.ప్రతి నెలా పౌర్ణమి వస్తూనే ఉన్నాకార్తీక పున్నమి ప్రత్యేకతే వేరు.నిండుచంద్రుని వెన్నెల్లో,వెలిగే దీపాల నడుమ,భక్తి ప్రపత్తులతో,సరదాల పరదాలతో సాగే భోజనాలు నిజంగా అపురూపమే. 

ఇక వనభోజనాలు.

విశాలమైన తోటల్లోఉసిరిచెట్ల కింద భోజనాలు ఒకప్పుడైతే బ్లాగుల ముంగిట ఘుమఘుమల పరిమళాలు ఇప్పుడు.
మరి ఈ వెన్నెల వెలుగుల్లో నా వంటలు కూడా రుచి చూసేయండి.ఉపవాసంతో అలసిపోయే  పెద్దలకు,పిన్నలకు రుచితో పాటు పోషకాలు కూడా ఇచ్చే ఈ తీయతీయని బాదం ఖర్జూర పాయసం చేసుకుందాం.దీన్నేఆల్మండ్ డేట్స్ ఖీర్ అని పిల్చుకున్నా వాకే .

 


 కావలసినవి 


చిక్కని పాలు                       పావు లీటరు 
ఖర్జూరాలు                          పది 
బాదంపప్పు                         పది 
ఇలాచీ పొడి                        అర స్పూను 
మిల్క్ మెయిడ్                   రెండు టేబుల్ స్పూన్స్  


ముందుగా బాదంపప్పును వేడినీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసేయ్యాలి.
ఖర్జూరాలు గింజలు తీసేసి కొంచెం నీటిలో ఉడికించాలి.
ఈ రెంటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అవసరమైతే కొంచెం పాలు వాడొచ్చు.
ఇప్పుడు పాలను కొంచెం మరిగించి బాదం ఖర్జూర మిశ్రమం వేసి కొంచెం ఉడికించాలి.
చివరగా మిల్క్ మెయిడ్ వేసి కలపాలి.ఇది లేకపోతే తగినంత పంచదార వేసుకోవచ్చు.
ఇలాచీపొడి వేసి కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చల్లారాక ఇంకా చిక్కగా అవుతుంది 
సన్నగా తరిగిన బాదం,ఖర్జూరాలతో అలంకరించుకోవాలి. 

అంతేనండి చాలా సులువు కదా.కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తింటే రుచి కూడా అంత మధురంగానూ ఉంటుంది. 


ఇక కార్తీకమాసంలో నేతిబీరకాయ పచ్చడి తినాలంటారు.ఇక్కడేమో మరి అవి దొరకవు కదా.
అందుకని బీరకాయతో, టమాటా కలిపి ఈ పచ్చడి చేసుకుందాం.వనభోజనాలకు బ్రహ్మాండంగా ఉంటుంది.




కావలసినవి

బీరకాయ                           ఒకటి పెద్దది
టమాటా                            ఒకటి పెద్దది 
కొత్తిమీర                            అర కట్ట
పచ్చిమిర్చి                         ఆరేడు 
వెల్లుల్లి                             నాలుగు రెబ్బలు 
ఉప్పు,జీలకర్ర,చింతపండు,నూనె 


బీరకాయ చెక్కు తీసి ముక్కలు కోయాలి.
వీటిలో మిర్చి,టమాటా ముక్కలు,కొత్తిమీర వేసి రెండు స్పూన్ల నూనె వేసి నీరుపోయి బాగా దగ్గరయ్యేవరకు మగ్గనివ్వాలి.
మిర్చి,ఉప్పు,వెల్లుల్లి,జీలకర్ర,చింతపండు కలిపి ఒకసారి గ్రైండ్ చేసి,ఉడికిన బీరకాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేయ్యడమే. 

రెండూ రుచి చూసేసి ఎలా ఉన్నాయో చెప్పండి మరి.మళ్ళీ వచ్చే ఏడు మరిన్ని చేసుకుందాం

















Monday, November 7, 2011

హ్యాపీ బర్త్ డే


ఈ రోజు నా పుట్టినరోజు.నాకెంతో ఇష్టమైన ఈబ్లాగ్ పుట్టినరోజు కూడా

జీవితం చాలా చిన్నది,కానీ చాలా విలువైనది.ఎంతో అపురూపమైనది.ఇంత అందమైన జీవితం ఓ తీయనిపాటలా,సెలయేటి గలగలలా సాగిపోతే అంతకు  మించి కావలసింది ఏముంది.ప్రతిక్షణం జీవితాన్నిజీవించాలనే చిన్నిఆశ.

ఇది తీరాలంటే జీవితాన్నిప్రేమించాలి చిన్నచిన్నఆనందాలను,వాటిలోని 
అనుభూతులను ఆస్వాదించగలగాలి.

సమస్యలూ,కష్టాలూ,కన్నీళ్లు ఇవీ జీవితంలో ఓ భాగమే.ఎవరో అన్నట్టూ కష్టంస్ అండ్ సుఖంస్ ఈజ్ ది కాంబినేషన్ అఫ్ లైఫ్,కాకపోతే కొన్ని చిన్న సమస్యలు,కొన్నిపెద్ద సమస్యలు.ఎవరికైనా తప్పవు.ఇవన్నీఎప్పుడూ ఉండేవే.మిగతారోజులన్నీఎలా గడిచినా సంవత్సరంలో ఒక్కరోజు,మనకి మాత్రమే సొంతమైన పుట్టినరోజున మాత్రం అన్నిచికాకులనీ పక్కన పెట్టి హాయిగా ఆనందంగా గడిపితే మనసుకి తృప్తిగా ఉంటుంది.

పోయిన ఏడాది ఇదేరోజున ఈబ్లాగ్ మొదలుపెట్టి కూడలిలో చేర్చికొత్త ప్రపంచంలోకి వచ్చాను.ఆ ఉద్వేగం,ఉద్విగ్నతతోనే ఆరోజు గడిపాను.ఇవ్వాళా మనసులో అదే అనుభూతి చుట్టుముడుతోంది.ఏడాదికాలం చాలా త్వరగా గడిచిపోయినట్టు ఉంది.ఆత్మీయంగా ఆదరించిన అందరికీ నా ధన్యవాదాలు.

నిజానికి నా ప్రపంచం చాలా చిన్నది.ఏం చేయాలో తెలియని ఒంటరితనంలో   కొట్టుకుపోతున్నతరుణంలో ఈబ్లాగ్స్ నాకు ఊరటనిచ్చాయి.నా మనసులో తోచిన భావాలను ఇందులో రాసుకుంటూ వచ్చాను.వంట చేయడం ఇష్టం కావడంతో "అభిరుచి"మొదలుపెట్టాను.నాకంటూ ఒక వ్యాపకం ఏర్పడింది.
కొంతమందికైనా నన్నుపరిచయం చేసింది.ఇందుకు చాలాచాలా సంతోషంగా ఉంది.థాంక్ యూ ఒన్స్ ఎగైన్.







Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008