మామిళ్ళ సందడి
మామిడికాయలు.మామిడిపళ్ళు వీటిని ఇష్టపడని వారెవరు ఉంటారు.అందరికీ ఇష్టమే.మా ఇంట్లో అయితే అందరి మీద ఇంకాస్త ఎక్కువే.అవేమో పచ్చివైనా,పండువైనా చూడగానే నోరూరించేస్తాయి
ఏ మార్చ్ మొదటి వారంలోనో మొట్టమొదటి మామిడికాయ కనిపిస్తుంది.అప్పటికే దాదాపు పదినెలల గాప్ వచ్చేస్తుంది కాబట్టి అత్యుత్సాహంగా కొనుక్కొచ్చేసి అర్జెంట్ గా పచ్చడి చేసేయడం జరిగిపోతుంది.
అలా మొదలై పప్పులోకి,ముక్కలపచ్చడి,కొబ్బరితోటి,తురుముపచ్చడి,పులిహోర,శాంపిల్ ఆవకాయ,మాగాయ అబ్బో ఎన్నో.ఇవన్నీఅయ్యేసరికి మనకీ చేతుల దురద తీరి ఉత్సాహం తగ్గుముఖం పడుతుంది.
ఎవరో ఒకరు ఇచ్చారనో,మార్కెట్ నుండి తెచ్చుకునో కాయలు వస్తుంటాయి.అందులో కొన్ని కొంచెం తియ్యగా చప్పగా ఉంటాయి వాటిని సేల్ చెయ్యడం పెద్ద పని.ఇంతలో ఏడాదికి సరిపడా ఆవకాయ రెడీ అవుతుంది.అయినా మనసులో ఓ మూల ఎక్కడో భయమే ఎటువెళ్లి ఏ కాయలు తెచ్చేస్తారో అని.ఆమధ్య జూన్ లోఅనుకుంటా ఓ రోజు పొద్దున్నే రైతుబజారుకి వెళ్లి ఒక డజనుకాయలు తెచ్చేసారు.చిన్నవే అనుకోండి చూడగానే గుండె గుభేల్మంది.ఇన్ని తెచ్చారు ఎందుకు అన్నాను అనుమానంగా, చూస్తే అవేమో నాటుకాయల్లా ఉన్నాయి.ఆ మధ్య తురుము పచ్చడి చేసావు చాలా బావుంది,మళ్లీ చేసుకుందామని తెచ్చాను అన్నారు.ఓరి నాయనో అనుకుని ఇన్నికాయలు తురమడమా అన్నాను.
అబ్బే నీకెందుకు నేను తురిమేస్తా నువ్వు పచ్చడి చెయ్యి చాలు అంటే ఓహో ఇది కూడానా అనుకున్నా.చెక్కు తీసి అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నారు పాపం సగం కాయ తురిమేసరికి అయ్యగారి పని ఫినిష్.అవేమో మరి లోపల పసుపురంగు వచ్చేసి చేతిలోంచి జారిపోతూ కుదరడంలేదు.అంతే గప్ చుప్ గా అన్నీ పక్కన పెట్టేసి, సారీ ఒకటి నాముఖాన పడేసి ఇంచక్కా ఆఫీసుకి చెక్కేశారు.
చస్తానా ఇక, కాసేపు సణుక్కుంటూ,కాసేపు ఏడ్చుకుంటూ పండుదంతా తీసేసి,పనికొచ్చినవి ముక్కలు కోసి ,మళ్లీ అవి తురిమే ఓపికలేక అన్నీ మిక్సీలో పడేసి ఎలా అయితే పచ్చడి షేప్ రప్పించాను.తాలింపు వేసి సీసాడు పచ్చడి టేబుల్ మీద పెట్టి లంచ్ కి వచ్చినప్పుడు కొంచెం సీరియస్ గానే చెప్పాను దేనిలోకి తింటారో నాకు తెలియదు.తిని సేల్ చేసే బాధ్యత మీదే అని.తను తెచ్చుకున్న కాయలు కదా తియ్యతియ్యగా పుల్లపుల్లగా బ్రహ్మాండంగా ఉంది పచ్చడి థాంక్స్ అంటూ ఓ మెచ్చుకోలు
పచ్చికాయల ప్రహసనం ఇలా సాగుతూ ఉంటుందా,పండుమామిళ్ళ గోల మరోలా ఉంటుంది.దొరికే ఏ వెరైటీనీ వదిలిపెట్టరు.రంగువేసి పండించిన రసాలతో మొదలై ఇదిగో ఇంకా ఉన్నాయి ఇంట్లో.
రసాలు,బంగినపల్లి ఎటూ తింటాము అనుకోండి.వీటి మధ్యలో ఏ వైపునుండో చెట్టున పండినకాయలు అని తెస్తారు,అవి రసంగాను తినలేము ముక్కలూ కోయలేము.ఈ లోగా ఏ పెళ్ళో పేరంటమో తగుల్తుంది.విజయవాడ వెళ్తే అక్కడినుండి పార్సెల్.అవన్నీసర్దుకోడం,కోయడం,పాడవుతుంటే జ్యూస్ తీయడం చేతినిండా పని.ఇంకా ఎరుపూ పసుపూకలిసి చిట్టిచిట్టి కాయలు ఉంటాయి అబ్బ ఒకటని కాదు.
ఇలా ఉండగా అయ్యో పిల్లాడు దూరాన ఉన్నాడు ఒక్క రసమైనా తినలేదు అని మనసు పీకుతుంది.కాయ తిన్న ఫీల్ రాకపోయినా రసం తింటాడు అని మంచి కాయలు జ్యూస్ తీసి స్టోర్ చెయ్యడం.పూటపూటా చెక్కు తీసి ముక్కలు కోసి రెడీ చెయ్యడం,బుజ్జితల్లి కాయ తినదు కనుక దానికి మిల్క్ షేక్ లు,లస్సీలు చేసి పట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలు అయినా ఆగదేమో.
నాలుగురోజుల క్రితం కిందకి వెళ్లి కనుచూపు మేర ఏ మామిడిబండీ లేకపోతే ఈసీజన్ కి అయిపోయాయి అనుకున్నాను.ఇంటికి వచ్చి అరగంట గడిచిందో లేదో మామిడిపళ్ళతో మాఆయన వచ్చేసారు.ఇంకా ఎక్కడివి అనడానికి తెరిచిన నానోరు టక్కున మూతపడిపోయింది.యివీ మద్రాస్ కాయలు అని ఇస్తుంటే.గుండ్రంగా ఉండి ఓరకమైన టేస్ట్ తో ఉంటాయి అవి.శుభం ఈసారి ఇంకా ఇవే రాలేదు అనుకున్నావచ్చేశాయి అనుకుంటూ ఫ్రిజ్ లో
సర్దాను.అవే ఇంకా నాలుగు ఉన్నాయి,ఇవి అయ్యేలోపు తగులూ,మిగులూ వెరైటీ ఏదీ మా ఆయన కంటపడకుండా ఉంటే ఈ ఏటికి ప్రహసనం పూర్తి అవుతుంది.
ఆఫ్ కోర్స్ చాలావరకూ అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది అనుకుంటా మా ఇంట్లో ఓపాలు ఎక్కువ.ఏతావాతా వీటి పుణ్యమా అని ఒక రెండు కిలోలన్నా బరువు పెరగడం, దాన్ని కరిగించుకోడానికి యోగాలూ,పుల్కాలూ ఎట్సెట్రా తప్పవు
మళ్లీ మార్చ్ లో షరా మామూలే
(కమ్మగా తెచ్చిపెడుతుంటే తినడానికి యేమైంది అంటారా,జస్ట్ సరదాగా రాశానండీ)
Post a Comment
8 comments:
:)) ఎన్ని తీయని(పుల్లని) కష్టాలో మామిడి కాయల/పళ్ళతో.
హ్హహ్హహ్హా! భలే ఫన్నీగా ఉంది ;) మరీముఖ్యంగా ఆ తురుము పచ్చడి :))))))
మామిడిపళ్ళు మెయింటైన్ చేయడం కష్టమే! కాని చేసేదేమీ లేదుకదా! తినేరుచిముందు ఇవన్ని తేలిపోతాయేమో! మీకు తెలుసా! నేను ఈ ఏడు ఒక్క మామిడిపండు ముక్క తినలేదు...నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక వేసవి మామిడిపళ్ళు లేకుండా గడపడం! :(((
అవును శిశిరా తీయని కష్టాలే
నిజమే ఇందూ ఆ రుచి ముందు ఇవన్నీ ఎంత
ఎందుకని తినలేదు ఈసారి, అక్కడ దొరుకుతాయి కద
దొరుకుతాయ్! కాని చాలా చండాలంగా ఉన్నాయ్! అప్పటికే ఎందుకైనా మంచిదని రెండు పళ్లే తెచ్చాను...కాని అస్సలు మామిడిపండులాగే లేవు! పుల్లగా...ఏమి బాలేవు! ఆ మామిడి వాసనే లేదు.....రెండూ...పారేసా! :(
మేమైతే మొదటి మామిడి కాయ తో పప్పు చేసి , అందులోకి చామీ లు అదేనండి చల్లమిరపకాయలు , గుమ్మడి వడియాలు వేయిస్తాము . ఇలా మా పిల్లలకు చాలా ఇష్టం :) మామిడిపళ్ళ తో కుస్తీలు , ఆవకాయ ప్రహసనాలు సరే సరి :)
బాగారాసారు .
థాంక్యూ మాలగారు
ఈ మధ్య నాకూ ఇదే పరిస్థితి. ఎక్కడికెళ్లినా సగం పండిన మామిడి కాయలు తేవటం.. వాటిని తినలేం, ఏ పచ్చళ్ళూ, కూరలూ చేయలేం.. మాంగో మిల్క్ షేక్ అనగానే పారిపోతున్నారు పిల్లలు. ఇప్పుడు కూడా.. సగం మగ్గిన పళ్ళు అరడజన్ ఉన్నాయి ఫ్రిజ్ లో :)
నిజమే కృష్ణప్రియగారు చాలా ఇబ్బంది.అలాగే పచ్చివి కాస్త తియ్యగా ఉన్నా ఇదే గోల తప్పదు
Post a Comment