Friday, July 8, 2011

ఆడపిల్ల

ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందంటారు.మురిపాలు పంచుతారు.ఎంతో అపురూపంగా పెంచుతారు.
ఎన్నెన్ని ముద్దుముచ్చట్లో,ఎన్నెన్ని తీపిగుర్తులో.రకరకాల గౌనులు వేసినా,పట్టులంగాలు కుట్టించినా,నగలు పెట్టి అలంకరించినా,మువ్వల పట్టీలు చేయించినా,పూలజడలు వేసి మురిసిపోయినా ఇలా యే ముచ్చట తీరాలన్నా ఆడపిల్లతోనే తీరుతుంది.లంగా ఓణీలో పుత్తడిబొమ్మలా మెరిసిపోయే కూతుర్ని చూసి మురిసిపోని మనసుంటుందా.
తన గుండెల మీద పడుకుని ఆడుకుని,తన చెయ్యి పట్టుకుని నడిచిన చిన్నారితల్లి పెద్దదైతే యే తండ్రి కళ్ళు చెమ్మగిల్లవు.అంత అపురూపంగా పెంచుకున్న ఆడపిల్లని పెళ్ళి చేసి పంపేటప్పుడు ఆనందం ఒక వైపు,బాధ మరోవైపు మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి.తమకోసం ఏమీ కొనుక్కోకుండా ప్రతిరూపాయి పోగుచేసి ఆడపిల్లకి అన్నీ అమర్చుతారు

ఆడపిల్లకి జీవితంలో ఎప్పుడు యే కష్టం వచ్చినా,సమస్య వచ్చినా ఆదుకునేది కన్నవారే.కబురు తెలిస్తే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోయి మేమున్నామంటూ అక్కునచేర్చుకునేదీ,అండగా నిలిచేదీ కన్నవాళ్ళే.పెళ్ళిళ్ళై పాతికేళ్ళు గడిచాక కూడా పుట్టింటికి వెళ్ళి వచ్చినా,అక్కడినుండి ఎవరన్నా వచ్చినా సర్దుకోడానికే ఒక రోజు పడుతుంది.పచ్చళ్ళు,పిండివంటలు,వడియాలు ఇలా ఎన్నో.ఓపిక ఉన్నాలేకపొయినా కష్టపడి చేసి పంపిస్తారు. ఇక్కడే ఒకటి అనిపిస్తుంది.మా కొడుకు మాకు హక్కు అనే అత్తింటివారు హక్కులతో పాటు ఉండే బాధ్యతలు ఎందుకు మర్చిపోతారో అర్ధం కాదు.

అంత అపురూపమైన పుట్టింటికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది మనసు.కానీ బాధ్యతల వత్తిళ్ళ నడుమ ఎన్నిసార్లు వెళ్ళి ప్రశాంతంగా ఉండగలం.ఎవరూ వెళ్ళొద్దని అనకపోవచ్చు.కానీ ఇల్లు కదిలి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఏమీ చెయ్యలేము.పరిస్థితులకు బందీ అయ్యి కదల్లేని జీవితాలు కొన్ని అయితే,దగ్గరలోనే  ఉన్నా వెళ్ళి మనసారా  నాలుగు రోజులు ఉండలేని నిస్సహాయత మరికొందరిది.ప్చ్.జీవితంలో ఎన్ని పార్శ్వాలో.చాలామంది జీవితాల్లో  జరిగేవే ఇవన్నీ

అందుకేనేమో అంత అందంగా రాశారు వేటూరి

పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది
పుట్టింటికే  మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో మనసున్న మామా
సయ్యోధ్యలేలేటి  సాకేతరామా

ఈ పోస్ట్ తో పాటు అందమైన ఈ పాట




Post a Comment

4 comments:

మాలా కుమార్

ఆడపిల్ల గురించి బాగా రాసారండి .
ఈ పాట నాకూ చాలా ఇష్టం . చాలా బాగుంటుంది .మీరన్ని నా కిష్టమైన పాటలే పెడుతున్నారు . థాంక్ యు .

జయ

ఆడపిల్ల అంటేనే, ఆ అందం నిండుతనం వస్తుందండి. ఎంత 'ఆడ 'పిల్లే అయినా, తల్లిదండ్రుల పట్ల మమకారం ఎప్పటికీ తీరనిదే. ఆ ప్రేమ అతీతమయింది. అందుకే ఆడపిల్ల తప్పనిసరిగా కావాలి అని ఆశపడేరోజు తప్పకుండా వస్తుందని నా ఆశ. చాలా బాగా చెప్పారండి.

లత

మన ఇద్దరం ఒకే పాటలు ఇష్టపడుతున్నాం మాలగారూ, థాంక్యూ

థాంక్యూ జయగారు,
అందం,ముచ్చట,బాధ్యత అన్నీ ఆడపిల్లతోటే కదా ఆ అందమైన అనుభూతిని వర్ణించలేము

శిశిర

ఈ సినిమాలో పాటలన్నీ తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటాయి. ఈ పాట నాకు చాలా ఇష్టమండి.

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008