Friday, July 29, 2011

అమ్మ

చిన్న పల్లెటూరిలో పుట్టి,రోజూ రెండు మైళ్ళు నడిచి స్కూల్ కి వెళ్లి ఎస్.ఎల్.సి పాసైన అమ్మ

పదిహేనేళ్ళకే పెళ్ళిచేసుకుని పెద్ద కుటుంబంలోకి కోడలిగా వెళ్లి ,ఎన్నోశుభకార్యాలు తన ఇంట్లో జరిపించిన అమ్మ (పెళ్లిచూపులు,నిశ్చితార్ధాలు,పెళ్ళిళ్ళు ఇలా ఎన్నో )

ఏ వేళ ఇంటికి ఎవరొచ్చినా వండి వడ్డించి అన్నపూర్ణలా ఆదరించిన అమ్మ

ఒక్కగానొక్క కూతుర్ని కావడంతో ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని పెంచిన అమ్మ,

కాలేజ్ కి వెళ్ళే రోజుల్లో కూడా చదువుకుంటుంటే అన్నం కలిపి ముద్దలు తినిపించిన అమ్మ

నా పిల్లలకి ఆరోగ్యం బావుండకపోతే ఏళ్ళ తరబడి గురువారాలు మొత్తం ఉపవాసాలు చేసిన అమ్మ 

ఈ రూపాయి ఉంటే పిల్లలకి ఉంటుంది అనుకుంటుందే తప్ప,ఈనాటికీ నాకిది కావాలి అని ఏమీ కొనుక్కోని అమ్మ 

ఆరోగ్యం సహకరించకపోయినా ఇప్పటికీ ఏదో ఒకటి వండి పంపిస్తూనే ఉండే అమ్మ,

హ్మ్,అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే,ఏమి చెప్పినా తక్కువే.
ఈ రోజు తన పుట్టిన రోజు.అరవై వసంతాలు పూర్తిచేసుకుని అరవై ఒకటో ఏట అడుగుపెడుతూ సీనియర్ సిటిజెన్ అవుతున్న అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు 
హాపీ హాపీ బర్త్ డే అమ్మా

మనసుకు రెక్కలున్నట్టు మనిషికి కూడా రెక్కలుంటే ఎంత బావుంటుందో.రివ్వున ఎగిరి అమ్మ దగ్గర వాలిపోవచ్చు .



 




Thursday, July 21, 2011

మామిళ్ళ సందడి




మామిడికాయలు.మామిడిపళ్ళు వీటిని ఇష్టపడని వారెవరు ఉంటారు.అందరికీ ఇష్టమే.మా ఇంట్లో అయితే అందరి మీద ఇంకాస్త ఎక్కువే.అవేమో పచ్చివైనా,పండువైనా చూడగానే నోరూరించేస్తాయి

ఏ మార్చ్ మొదటి వారంలోనో మొట్టమొదటి మామిడికాయ కనిపిస్తుంది.అప్పటికే దాదాపు పదినెలల గాప్ వచ్చేస్తుంది కాబట్టి అత్యుత్సాహంగా కొనుక్కొచ్చేసి అర్జెంట్ గా పచ్చడి చేసేయడం జరిగిపోతుంది.

అలా మొదలై పప్పులోకి,ముక్కలపచ్చడి,కొబ్బరితోటి,తురుముపచ్చడి,పులిహోర,శాంపిల్ ఆవకాయ,మాగాయ అబ్బో ఎన్నో.ఇవన్నీఅయ్యేసరికి మనకీ చేతుల దురద తీరి ఉత్సాహం తగ్గుముఖం పడుతుంది.

ఎవరో ఒకరు ఇచ్చారనో,మార్కెట్ నుండి తెచ్చుకునో కాయలు వస్తుంటాయి.అందులో కొన్ని కొంచెం తియ్యగా చప్పగా ఉంటాయి వాటిని సేల్ చెయ్యడం పెద్ద పని.ఇంతలో ఏడాదికి సరిపడా ఆవకాయ రెడీ అవుతుంది.అయినా మనసులో ఓ మూల ఎక్కడో భయమే ఎటువెళ్లి ఏ కాయలు తెచ్చేస్తారో అని.ఆమధ్య జూన్ లోఅనుకుంటా ఓ రోజు పొద్దున్నే రైతుబజారుకి వెళ్లి ఒక డజనుకాయలు తెచ్చేసారు.చిన్నవే అనుకోండి చూడగానే గుండె గుభేల్మంది.ఇన్ని తెచ్చారు ఎందుకు అన్నాను అనుమానంగా, చూస్తే అవేమో నాటుకాయల్లా ఉన్నాయి.ఆ మధ్య తురుము పచ్చడి చేసావు చాలా బావుంది,మళ్లీ చేసుకుందామని తెచ్చాను అన్నారు.ఓరి నాయనో అనుకుని ఇన్నికాయలు తురమడమా అన్నాను.

అబ్బే నీకెందుకు నేను తురిమేస్తా నువ్వు పచ్చడి చెయ్యి చాలు అంటే ఓహో ఇది కూడానా అనుకున్నా.చెక్కు తీసి అన్నీ రెడీ చేసుకుని కూర్చున్నారు పాపం సగం కాయ తురిమేసరికి  అయ్యగారి పని ఫినిష్.అవేమో మరి లోపల పసుపురంగు వచ్చేసి చేతిలోంచి జారిపోతూ కుదరడంలేదు.అంతే గప్ చుప్ గా అన్నీ పక్కన పెట్టేసి, సారీ ఒకటి నాముఖాన పడేసి ఇంచక్కా ఆఫీసుకి చెక్కేశారు.

చస్తానా ఇక, కాసేపు సణుక్కుంటూ,కాసేపు ఏడ్చుకుంటూ పండుదంతా తీసేసి,పనికొచ్చినవి ముక్కలు కోసి ,మళ్లీ అవి తురిమే ఓపికలేక అన్నీ మిక్సీలో పడేసి ఎలా అయితే పచ్చడి షేప్ రప్పించాను.తాలింపు వేసి సీసాడు పచ్చడి టేబుల్ మీద పెట్టి లంచ్ కి వచ్చినప్పుడు కొంచెం సీరియస్ గానే చెప్పాను దేనిలోకి తింటారో నాకు తెలియదు.తిని సేల్ చేసే బాధ్యత మీదే అని.తను తెచ్చుకున్న కాయలు కదా తియ్యతియ్యగా పుల్లపుల్లగా బ్రహ్మాండంగా ఉంది పచ్చడి థాంక్స్ అంటూ ఓ మెచ్చుకోలు

పచ్చికాయల ప్రహసనం ఇలా సాగుతూ ఉంటుందా,పండుమామిళ్ళ గోల మరోలా ఉంటుంది.దొరికే ఏ వెరైటీనీ వదిలిపెట్టరు.రంగువేసి పండించిన రసాలతో మొదలై ఇదిగో ఇంకా ఉన్నాయి ఇంట్లో.

రసాలు,బంగినపల్లి ఎటూ తింటాము అనుకోండి.వీటి మధ్యలో ఏ వైపునుండో చెట్టున పండినకాయలు అని తెస్తారు,అవి రసంగాను తినలేము ముక్కలూ కోయలేము.ఈ లోగా ఏ పెళ్ళో పేరంటమో తగుల్తుంది.విజయవాడ వెళ్తే అక్కడినుండి పార్సెల్.అవన్నీసర్దుకోడం,కోయడం,పాడవుతుంటే జ్యూస్ తీయడం చేతినిండా పని.ఇంకా ఎరుపూ పసుపూకలిసి చిట్టిచిట్టి కాయలు ఉంటాయి అబ్బ ఒకటని కాదు.

ఇలా ఉండగా అయ్యో పిల్లాడు దూరాన ఉన్నాడు ఒక్క రసమైనా తినలేదు అని మనసు పీకుతుంది.కాయ తిన్న ఫీల్ రాకపోయినా రసం తింటాడు అని మంచి కాయలు జ్యూస్ తీసి స్టోర్ చెయ్యడం.పూటపూటా చెక్కు తీసి ముక్కలు కోసి రెడీ చెయ్యడం,బుజ్జితల్లి కాయ తినదు కనుక దానికి మిల్క్ షేక్ లు,లస్సీలు చేసి పట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేజీలు అయినా ఆగదేమో.

నాలుగురోజుల క్రితం కిందకి వెళ్లి కనుచూపు మేర ఏ మామిడిబండీ లేకపోతే ఈసీజన్ కి అయిపోయాయి అనుకున్నాను.ఇంటికి వచ్చి అరగంట గడిచిందో లేదో మామిడిపళ్ళతో మాఆయన వచ్చేసారు.ఇంకా ఎక్కడివి అనడానికి తెరిచిన నానోరు టక్కున మూతపడిపోయింది.యివీ మద్రాస్ కాయలు అని ఇస్తుంటే.గుండ్రంగా ఉండి ఓరకమైన టేస్ట్ తో ఉంటాయి అవి.శుభం ఈసారి ఇంకా ఇవే రాలేదు అనుకున్నావచ్చేశాయి అనుకుంటూ ఫ్రిజ్ లో
సర్దాను.అవే ఇంకా నాలుగు ఉన్నాయి,ఇవి అయ్యేలోపు తగులూ,మిగులూ వెరైటీ ఏదీ మా ఆయన కంటపడకుండా ఉంటే ఈ ఏటికి ప్రహసనం పూర్తి అవుతుంది.

ఆఫ్ కోర్స్ చాలావరకూ అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటుంది అనుకుంటా మా ఇంట్లో ఓపాలు ఎక్కువ.ఏతావాతా వీటి పుణ్యమా అని ఒక రెండు కిలోలన్నా బరువు పెరగడం, దాన్ని కరిగించుకోడానికి యోగాలూ,పుల్కాలూ ఎట్సెట్రా తప్పవు

మళ్లీ మార్చ్ లో షరా మామూలే
చరిత్ర పునరావృతం

(కమ్మగా తెచ్చిపెడుతుంటే తినడానికి యేమైంది అంటారా,జస్ట్ సరదాగా రాశానండీ)


Monday, July 11, 2011

పేలాల పండుగ



 ఈ రోజు  తొలి ఏకాదశి. ఈ పండగగా కంటే పేలాల పండగగానే అందరికీ గుర్తు ఏమో.ఎందుకంటే ఈ రోజు తప్పకుండా పేలాలపిండి తినిపించేవారు చిన్నప్పుడు.
బహుశా దీనితోనే మనకు పండగలు మొదలవుతాయి అనుకుంటా.

తప్పనిసరిగా ఈనాటికీ  ఇల్లు దులుపుకుని,కడుగుకుని,ఈ రోజు తలంటుకుని పూజ చేస్తారు.చాలా సంవత్సరాల తరువాత ఇవ్వాళ్ళ నేను పేలాల పిండి చేశాను.ఇంట్లో మొక్కజొన్నలు ఉండడంతో వాటిని పాప్ కార్న్ చేసి,బెల్లం కలిపి గ్రైండ్ చేస్తే పిండి రెడీ అయ్యింది.ఇన్నేళ్ళ తరువాత ఆ టేస్ట్ ఎంత  నచ్చుతుందో చూడాలి.అసలు ఇప్పటి తరం వాళ్లకి ఇది తెలియదేమో కూడా.

ఇది చేస్తుంటే ఒక సంగతి గుర్తొచ్చింది,చాలా చిన్నపుడు ఇది తింటుంటే చింది ఒళ్ళంతా పడేది.ఎందుకలా జరిగేదో నా చిన్నిబుర్రకి అసలు అర్ధం అయ్యేది కాదు.ఆలోచించగా, చించగా తెలిసింది ఏమిటంటే శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరి వదులుతాము కదా.స్పూన్ నోటి దగ్గరకు వచ్చినప్పుడే నేను ఊపిరి వదిలేసరికి ఆ పొడి చింది పడేది అన్నమాట.ఒకసారి అది అర్ధం అయ్యాక నీట్ గా తినేదాన్ని అనుకోండి.అది వేరే సంగతి.కాకపోతే ఈ పేలాపిండి ఈ రోజే ఎందుకు తినాలో మాత్రం నాకూ తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

Friday, July 8, 2011

ఆడపిల్ల

ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందంటారు.మురిపాలు పంచుతారు.ఎంతో అపురూపంగా పెంచుతారు.
ఎన్నెన్ని ముద్దుముచ్చట్లో,ఎన్నెన్ని తీపిగుర్తులో.రకరకాల గౌనులు వేసినా,పట్టులంగాలు కుట్టించినా,నగలు పెట్టి అలంకరించినా,మువ్వల పట్టీలు చేయించినా,పూలజడలు వేసి మురిసిపోయినా ఇలా యే ముచ్చట తీరాలన్నా ఆడపిల్లతోనే తీరుతుంది.లంగా ఓణీలో పుత్తడిబొమ్మలా మెరిసిపోయే కూతుర్ని చూసి మురిసిపోని మనసుంటుందా.
తన గుండెల మీద పడుకుని ఆడుకుని,తన చెయ్యి పట్టుకుని నడిచిన చిన్నారితల్లి పెద్దదైతే యే తండ్రి కళ్ళు చెమ్మగిల్లవు.అంత అపురూపంగా పెంచుకున్న ఆడపిల్లని పెళ్ళి చేసి పంపేటప్పుడు ఆనందం ఒక వైపు,బాధ మరోవైపు మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి.తమకోసం ఏమీ కొనుక్కోకుండా ప్రతిరూపాయి పోగుచేసి ఆడపిల్లకి అన్నీ అమర్చుతారు

ఆడపిల్లకి జీవితంలో ఎప్పుడు యే కష్టం వచ్చినా,సమస్య వచ్చినా ఆదుకునేది కన్నవారే.కబురు తెలిస్తే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోయి మేమున్నామంటూ అక్కునచేర్చుకునేదీ,అండగా నిలిచేదీ కన్నవాళ్ళే.పెళ్ళిళ్ళై పాతికేళ్ళు గడిచాక కూడా పుట్టింటికి వెళ్ళి వచ్చినా,అక్కడినుండి ఎవరన్నా వచ్చినా సర్దుకోడానికే ఒక రోజు పడుతుంది.పచ్చళ్ళు,పిండివంటలు,వడియాలు ఇలా ఎన్నో.ఓపిక ఉన్నాలేకపొయినా కష్టపడి చేసి పంపిస్తారు. ఇక్కడే ఒకటి అనిపిస్తుంది.మా కొడుకు మాకు హక్కు అనే అత్తింటివారు హక్కులతో పాటు ఉండే బాధ్యతలు ఎందుకు మర్చిపోతారో అర్ధం కాదు.

అంత అపురూపమైన పుట్టింటికి రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది మనసు.కానీ బాధ్యతల వత్తిళ్ళ నడుమ ఎన్నిసార్లు వెళ్ళి ప్రశాంతంగా ఉండగలం.ఎవరూ వెళ్ళొద్దని అనకపోవచ్చు.కానీ ఇల్లు కదిలి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఏమీ చెయ్యలేము.పరిస్థితులకు బందీ అయ్యి కదల్లేని జీవితాలు కొన్ని అయితే,దగ్గరలోనే  ఉన్నా వెళ్ళి మనసారా  నాలుగు రోజులు ఉండలేని నిస్సహాయత మరికొందరిది.ప్చ్.జీవితంలో ఎన్ని పార్శ్వాలో.చాలామంది జీవితాల్లో  జరిగేవే ఇవన్నీ

అందుకేనేమో అంత అందంగా రాశారు వేటూరి

పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది
పుట్టింటికే  మనసు పరుగు తీస్తుంది
తెలుసుకో తెలుసుకో మనసున్న మామా
సయ్యోధ్యలేలేటి  సాకేతరామా

ఈ పోస్ట్ తో పాటు అందమైన ఈ పాట




Friday, July 1, 2011

ప్లాస్టిక్ కవర్స్

చాలా సంవత్సరాల తరువాత  చేతిలో బాగ్ తో బయటికి వెళ్ళడం.దాదాపు  పదిహేనేళ్ళు దాటిందేమో,ఊపుకుంటూ వెళ్లి అన్నీ కవర్లలో తెచ్చుకోడం మొదలుపెట్టి.

రేపటినుండి మేము కవర్లు ఇవ్వము ఆంటీ మీరే తెచ్చుకోండి అని ప్రతివాళ్ళూ నిన్నేచెప్పేసారు.దాంతో ఈపూట గుర్తుపెట్టుకుని బాగ్ తీసుకువెళ్తుంటే
గమ్మత్తుగా అనిపించింది.బజార్లో కూడా తెచ్చుకోనివాళ్ళు అయ్యో
అనుకుంటూ,ఒక పెద్దాయన జామపళ్ళు జేబులో నింపుకోలేక అవస్థ
పడుతూ, మొత్తానికి ఇవన్నీ చూస్తే కొంచెం నవ్వొచ్చింది కూడా.ఎంతగా అలవాటు పడిపోయాము అని ఆశ్చర్యం కూడా వేసింది.నాలుగు రోజులు ఇలా ఉంటుంది తరువాత అదే అలవాటు అయిపోతుంది.ఇదివరకు తెచ్చుకునే వాళ్లమేగా అంటున్నారు అంతా.

చిన్నప్పుడు పెద్దపెద్ద వైరు బుట్టలు తీసుకుని విజయవాడ వెళ్లి మరీ పచారీ  కొట్లో సరుకులు కట్టించుకుని తెచ్చుకునేవాళ్ళం.ఆ రోజులన్నీగుర్తొచ్చాయి.ఏది ఏమైనా ఈసారన్నా అందరూ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గి, ప్రకృతికి ఎంతో కొంత మేలు జరిగితే అంతకన్నా కావలసింది ఏముంది.పనిలో పనిగా ఇంట్లో కూడా సగం చెత్త తగ్గుతుంది, 

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008