Tuesday, August 9, 2011

చిన్ననాటి జ్ఞాపకాలు

ఆనాటి ఆ స్నేహమానంద గీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం.

రాత్రి కిచెన్ లో పని చేసుకుంటుంటే ఫోన్ మోగింది .లిఫ్ట్ చెయ్యగానే లతా బావున్నారామ్మా నేను రాముని అన్నారు.ఒక్కక్షణం లైట్ వెలగలేదు.ఎవరండి అన్నాను సంకోచంగా.నేనమ్మా మీతో కలిసి చదువుకున్నాను తెలుగు మాస్టారు శాస్త్రిగారబ్బాయిని అన్నారు.అప్పుడు గుర్తొచ్చింది ఆ మధ్య రాము వచ్చాడు నెంబర్ తీసుకున్నాడు అని అమ్మ చెప్పిన సంగతి.కుశలప్రశ్నలయ్యాక  ఈమధ్య తను కలిసిన కొందరి విషయాలు చెప్పారు అందరం ఒక్కసారి కలిస్తే బాగుంటుంది అన్నారు.సరే ట్రై చెయ్యండి అంతా దొరకాలి కదా అన్నాను.ఫోన్ అయితే పెట్టేసాను కానీ మనసు మాత్రం రివ్వుమని స్కూల్ రోజుల్లోకి ఎగిరిపోయింది.

ఎంత బావుంటాయో చిన్ననాటి  ఆ రోజులు.జిల్లాపరిషత్ స్కూల్ అయినా మా స్కూల్ కి చాలా పేరుండేది. టీచింగ్ చాలా బావుండేది.నాన్నగారు కూడా అదే స్కూల్ లో వర్క్ చేసేవారు.
వాణి,లక్ష్మి,ప్రసన్న,నాగమణి.శైలజ,సాయి,గోవర్ధన అందరం ఒక బృందం.

వాణి స్వరం కంచుగంటలా వినిపించేది.అయిగిరినందిని,బ్రహ్మమురారి సురార్చిత లింగం ఈ రెండుపాటలు హై పిచ్ లో తను పాడుతుంటే క్లాస్ అంతా మంత్రముగ్ధుల్లా వినేవారు.
లక్ష్మి సాఫ్ట్ గా ఉండేది.మల్లెలు ,జాజులు,డిశంబరాలు,కనకాంబరాలు ఎవైనా సరే తన ముందు పెడితే నిమిషాల్లో వత్తుగా,లావుగా మాల తయారై పోయేది
సాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకునేది.వాళ్ళ మామయ్యనే చేసుకుని ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటోంది,ఆ ఇంట్లో ఉసిరిచెట్టు ఉండేది.చిట్టి చిట్టి ఉసిరికాయలు భలే తినేవాళ్ళం.
నాగమణి,తనకి పొట్లకాయలంటే ఎంత చీదరో.వాళ్ళ దొడ్లోనేమో విరగకాసేవి.అందరికీ పంచమని వాళ్ళ అమ్మగారు తనకే చెప్పేవారు.వాటిని అంటుకోకుండా రెండు న్యూస్ పేపర్స్ లో చుట్టి ఎడంగా పట్టుకుని ఇచ్చి వచ్చేది.
శైలజకి చదువంటే ఎంత ప్రాణమో. లక్షల ఆస్తికి వారసురాలు కావడంతో పెద్దవాళ్ళు సెవెంత్ లోనే పెళ్లి చేసేసారు.టెన్త్ లో సరిగ్గా  మొదటి పరిక్ష రోజే పాప పుట్టి చదువు ఆగిపోయింది.ఆ కసితోనేమో పిల్లలు ముగ్గుర్ని బాగా చదివించింది.
ప్రసన్న ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.మేమిద్దరం టెన్త్ తరువాత కూడా ఇంటర్ స్టెల్లా కాలేజ్ కి కలిసే వెళ్ళేవాళ్ళం తరువాత దారులు వేరై వివరాలు తెలియదు.గోవర్ధన కూడా ఆ ఊళ్ళో అబ్బాయినే చేసుకుని అక్కడే ఉంది.
ఒక్కసారి మళ్లీ అందరం కలిస్తే...ఆ ఊహే అందంగా ఉంది.

ప్రతి ఏడూ టెన్నికాయిట్ టోర్నమెంట్స్ కి స్కూల్ తరపున వెళ్లి ఆడి వచ్చేవాళ్ళం. విజయవాడ రేడియోస్టేషన్ కి వెళ్లి వివిధభారతిలో క్విజ్ లో పాల్గొని కప్పు గెలుచుకోడం ఓ గొప్ప అనుభూతి.ఆ ప్రోగ్రాం కోసం పెనమలూరు స్కూల్ నుండి వచ్చి పరిచయమై ఆ తరువాత ఇంటర్, డిగ్రీ కలిసి చదువుకున్న శ్రీదేవి, ఇంటర్ తరువాత మాతో కలిసిన సునీత నాకు ప్రాణ స్నేహితులు.ఇప్పటికీ రెగ్యులర్ గా టచ్ లో ఉంటాము.

ప్రతి సంవత్సరం క్లాస్ ఫస్ట్ తెచ్చుకుని ప్రైజ్ తీసుకోడం నా చదువుకి సంబంధించి మర్చిపోలేని జ్ఞాపకం.బాచ్ వైజ్ గా టెన్త్ క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నవారి లిస్టు లో నా పేరు బోర్డుమీద పెయింట్ చేసి ఉంటుంది.చిన్నప్పుడు నాన్నగారితో స్కూల్ కి వెళ్ళినప్పుడు  అది చూసి మా అబ్బాయి ఎంత మురిసిపోయాడో.ఇప్పటికీ టీచర్స్ అంటారు నాన్నగారితో లత ఏ ఇంజినీరింగో చేసి మంచి జాబ్ లో ఉంటుంది అనుకున్నాము అని. హు.డెస్టినీ డిసైడ్స్ అంతే చివరికి విధిచేయు వింతలన్నీ అని పాడుకోడం మాత్రం మిగిలింది.

ఒక్క ఫోన్ కాల్ ఎన్ని జ్ఞాపకాలను తట్టిలేపిందో. వాటిని పదిలపరచుకునే ప్రయత్నమే ఇది.

Post a Comment

10 comments:

SJ

bagunnayi sweet memories...

జయ

అందుకేనేమో, ప్రతివక్కరు తమకు చెప్పకుండానే వెళ్ళిపోయిన బాల్యాన్ని అంత ఇష్టపడ్తారు. మళ్ళీ మళ్ళీ ఆ స్నేహితుల్ని, రోజులనీ తలచుకుంటూ ఉంటాము. మీ జ్ఞాపకాలు చాలా బాగున్నాయి.

శిశిర

అవునండీ. డెస్టినీ డిసైడ్స్. బాగున్నాయి మీ జ్ఞాపకాలు.

వనజ తాతినేని/VanajaTatineni

mee jnaapakaalu chaalaa baagunnaayi. meetho paatu mammalani theesuku vellaarukadhaa!.

ఇందు

లతగారూ మీకే కాదూ నాకు నా చిన్నప్పటి గ్నాపకాలన్నీ గుర్తొచ్చాయి :) అందరం ఎక్కడెక్కడున్నామో! మీలాగె మా మమ్మీ పేరుకూడా స్కూల్లో గోడమీద పయింట్ చేసి ఉంటుంది. తను తన స్కూల్ ఫర్స్ట్ :) అలాగే మా తమ్ముడు కూడా మా అమ్మ వారసత్వాన్ని నిలబెట్తాడు. మనకంత సినిమ లేదులేండీ ;) కానీ మీ పోస్ట్ చాలా బాగుంది. మీ పాత మిత్రులందరినీ కలిస్తే...ఆ విసేషాలన్ని తప్పక ఇంకో టపా రాయాలి :)

లత

సాయిగారు
అవును జయగారు ఒక్కసారి ఆ రోజులన్నీ కళ్ళముందు కదిలి నిద్ర కూడా రాలేదు
నిజం శిశిరా, అది మాత్రం మార్చలేము
వనజగారు ,
కలిస్తే తప్పకుండా రాస్తాను ఇందూ చూడాలి ఎంతవరకు జరుగుతుందో
అందరికీ ధన్యవాదాలు

మాలా కుమార్

బాగున్నాయండి మీ జ్ఞాపకాలన్నీ . ఈ మద్య నేను చదివిన వూర్ల కు వెళ్ళినప్పుడు మా స్కూల్ ఫొటోస్ తీసుకుంటున్నాను . అదో తృప్తి :)

లత

అవును మాలగారు,నేనూ మొన్నే అనుకున్నాను.ఈ సారి ఫొటోస్ తీయాలి అని.థాంక్యూ

Unknown

బాగున్నాయండి మీ జ్ఞాపకాలన్నీ.మీ నేస్తాల ఇష్టాలు కూడా పదిలంగా గుర్తుపెట్టుకోవడం నాకు బాగా నచ్చింది.

లత

థాంక్యూ శైలుగారు. మీరు రాసిన అన్ని కామెంట్స్ కీ ధన్యవాదాలు.

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008