Saturday, April 16, 2011

మల్లెలవాన



వేసవి వచ్చిందంటే చాలు మల్లెల ఘుమఘుమలూ,మామిళ్ళ మధురిమలూ మనసులోకి వచ్చేస్తాయి వీటి కోసమైనా వేసవి కోసం ఎదురుచూడాలని అనిపిస్తుంది.మన ప్రమేయం లేకుండానే మల్లెలు పూసే వెన్నెల కాసే అంటూ మనసు పాటలు పాడుకుంటుంది.ఏడాదికోసారి మల్లెల వానలోతడిసి 
పోవాలని ఎవరికి ఉండదు చెప్పండి.

అరవిచ్చిన మల్లెల్నిచూస్తే నాకు పూలజడ గుర్తొస్తుంది.అసలు ఆడపిల్లకీ పూలజడకి బోలెడు అనుబంధం ఉంటుంది ఎంత సరదా పడి  వేయించుకునే వాళ్ళమో చిన్నప్పుడు.సీజన్ మొదలైన దగ్గరనుండీ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూపులు.పూలజడ బాగా  కుట్టే ప్రావీణ్యం ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరో ఉండేవారు ముందు వాళ్ళ అప్పాయింట్ మెంట్ దొరకాలి.ఇక రేపు పూలజడ అంటే ఎంత సంబరమో.వాడుకగా పూలు తెచ్చే అతనికి మంచి మొగ్గలు తెమ్మని చెప్పేది అమ్మ.ఉదయమే తలంటు పోసుకుని,ఆరాక చిక్కు తీసి పిల్లకుప్పెలు పెట్టి జడ వేసుకునేదాన్ని.సవరం కూడా అక్కరలేదండోయ్  నిజ్జంగా అంత పెద్ద జుట్టు ఉండేది నాకు.ఏ మూడు గంటలకో పూలు రాగానే హడావుడి మొదలయ్యేది 

మంచి మొగ్గలు అన్నీ ఏరి పొడవుగా ఉన్న పుల్లలకి గుచ్చి రెడీ చేసేవారు.
జడకు రెండువైపులా రెండు చొప్పున పెట్టి పైనుండి కిందవరకూ  టాకాలు వేసి కుట్టేవారు. వాటిమధ్య గాప్ నింపడానికి మల్లెలూ,అక్కడక్కడా అందం కోసం కనకంబరాలూ,మరువం వేసి చివరి వరకూ కుట్టేవాళ్ళు.ఆఖరికి పైన ముద్దగా మల్లెచెండూ,మళ్ళీ కదంబమాల,మల్లెల మాల ఇలా పేర్చి అన్నివైపులా కుట్టడంతో జడ పూర్తయ్యేది అప్పటివరకూ వంచిన తలఎత్తితే ఒట్టు 

అప్పుడు ఫ్రెష్ అయ్యి పట్టులంగా వేసుకుని నగలు పెట్టుకుని ముస్తాబు అయ్యేసరికి స్నేహితులు కూడా రెడీ అయ్యి వచ్చేసేవారు.ఈ లోగా ఏదమ్మా జడ చూపించు అంటూ ఇరుగుపొరుగుల కేకలు మనం ఏమో మహరాణిలా వెళ్లి అందరికీ జడ చూపించి రావడం,ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది కానీ అప్పుడు సహజంగా ఆలా జరిగిపోయేవి. ఈలోగా ఊళ్ళో ఉన్న ఒక్క ఫోటో స్టూడియో అతన్నీ తీసుకొస్తే అద్దం ముందు మనం,అద్దంలో జడతో ఫోటో దిగడంతో ఒక ఘట్టం పూర్తయ్యేది 

ఇక అసలు కధ అప్పుడు మొదలయ్యేది ఎక్కడ జడ నలిగిపోతుందో అని కూర్చోవాలన్నా,పడుకోవాలన్నా భయం.అమ్మ చేత అన్నం తినిపించుకుని,జాగ్రత్తగా పక్క చేరి తెల్లవార్లూ బోర్లా పడుకోవడమే కదిలితే ఒట్టు తెల్లవారేసరికి మొగ్గలు విచ్చి ఇంకా అందంగా ఉండేది.ఇక ఆ రోజు మోయగలిగినంత సేపు ఉంచుకుని,మల్లెలు వాడుతుంటే అప్పుడు మెల్లగా ఊడదీస్తే పూలజడ ప్రహసనం పూర్తయ్యేది.మళ్లీ తలంటుకునే వరకూ జుట్టు మల్లెల పరిమళంతో గుబాళిస్తూ ఉండేది.ఒకోసారి సీజన్ అయ్యేముందు ఇంకోసారి  వేయించుకునే వాళ్ళం.అలా ఏటా సాగిన పూలజడ ముచ్చటకి పెళ్ళినాడు వేసుకోవడంతో ఫుల్ స్టాప్ పడిపోయింది 

ఇప్పుడు మూరమల్లెలు కొనుక్కుంటే తలలో నిలుస్తాయో లేదో అనుమానమే. 
ఏం చేస్తాం ఆ తీపి గుర్తులని తలచుకుని మురిసిపోడం తప్ప    

Post a Comment

17 comments:

రాజ్యలక్ష్మి.N

లత గారు మీ మల్లెపూలజడ తీపిగుర్తులు చాలా బాగున్నాయండీ.
మీ పోస్టింగ్ చూడగానే నాకు నా పూలజడ గుర్తొచ్చింది.

సుజాత వేల్పూరి

ఎక్కడికో తీసుకెళ్ళారు! అవును, ఆ పూల జడ మెడ విరిగిపోతున్నా ఇష్టంగా మోయడం, ఫొటో స్టూడియో వాడి మచ్చల అద్దం, వాడి దగ్గర ఉండే గులాబీ రంగు పౌడర్ రాసుకోవాలనే తపన,ప్రతి వేసవి కోసం ఎదురు చూసేలా ఉండేవి.

మా అమ్మగారిది పూల జడ కుట్టడంలో అందె వేసిన చేయి. వేసవి మధ్యాహ్నాలు భలే డిమాండ్ ఉండేది. పైగా వంకీల జడ అని పాయల మధ్యలో మాత్రమే మల్లెలు వచ్చేలా జడ షేప్ లోనే అందంగా మల్లెలు మెలికలు తిరుగుతూ ఎంతో అందంగా ఉండేది జడ వేసేది!

ఇప్పుడు మా పాప జుట్టు మంచి పొడవైన జుట్టు. బంగారు కుప్పెలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ జడ ఎవరు కుడతారో తెలీదు. అలా కుట్టే వాళ్ళు దొరికితే పూల జడ వేయించి ఫొటో స్టూడియోలో ఫొటో తీయించి బహుమతిగా ఇవ్వాలని ఉంది.

Sravya V

భలే రాసారండి !

జ్యోతి

ఏం చెప్పమంటారు?సేమ్ పించ్... అప్పటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసుకుని మురిసిపోవడమే...


సుజాతగారు మీ అమ్మాయికి నేను కుట్టనా పూలజడ?, జడకైనా సరే, విస్తరాకుమీద కుట్టి, జడకు అతికించడమైనా సరే..

లత

రాజి,
సుజాతగారు,
అవునండి వంకీల జడ కూడ బావుంటుంది. మీ పాపకి జ్యోతిగారు జడ కుడతాను అంటున్నారు ఈ సీజన్ వేయించండి మరి
శ్రావ్యా,
జ్యోతిగారు,
నిజమండి,ఆ ఫొటోస్ చూసుకుంటే భలే ఉంటుంది,

అందరికీ ధన్యవాదాలు

సిరిసిరిమువ్వ

హ్హు..ఓ పెద్ద చాంతాడంత కామెంటు వ్రాస్తే బ్లాగరు "We are sorry, but we were unable to complete your request" అంటూ వెనక్కి తన్నింది.

మీ తీపి గుర్తులు బాగున్నాయి.

ప్రతి వేసవిలో ఇంటికెళ్లినప్పుడల్లా మా అమ్మాయికీ వేయించేదాన్ని. ఇక ఇప్పుడు పెద్దదయింది కదా వేయించుకోదు.

మా నాయనమ్మ వంకుల జడ చాల బాగా వేసేది. రకరకాల ముడులు కూడా వేస్తారు కానీ నాకు జడే నచ్చుతుంది.

వేసవి అంతా ఈ జడలు వేసేవాళ్ళకి ఎంత డిమాండో!

బొండు మల్లెల కన్నా సన్నగా పొడవుగా ఉండే మొగ్గలే జడకి బాగుంటాయి. బాపట్ల గరువు పూలు చాలా బాగుండేవి. తొందరగా వాడేవి కావు.

జ్యోతి

ఇదిగోండి నా పూలజడ ముచ్చట్లు...

http://jyothivalaboju.blogspot.com/2008/04/blog-post_05.html

తృష్ణ

ఎక్కడికో....తీసుకెళ్ళిపోయారు లతగారూ ! నాకు పదిహేనేళ్ళు వచ్చేదాకా ప్రతి పుట్టినరోజుకీ పట్టుపరికిణీ, పూలజడ , దానితో ఫోటో. ప్రతిఏడూ పుట్టినరోజుకి స్టూడియోలో ఫోటో తప్పకుండా తీయించేది అమ్మ. అది కాక మీరు రాసినట్లూ వేసంకాలంలో మల్లెపూలతో ప్రత్యేకం పూలజడ వేయించేది. విజయవాడలో అమ్మమ్మగారు(మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్) ఉండేవారు. ఎంత బాగా అల్లేవారంటే అంత బాగా అల్లేవారు. అమ్మమ్మగారూవాళ్ళు ఇల్లు మారిపోయి చాలా దూరం వెళ్ళిపోయాక అమ్మ నన్ను రిక్షాలో వాళ్ళింటికి తీసుకునివెళ్ళేది. అందులోనూ నాది ఇంత లావున ,ఒత్తుగా, పొడుగాటి జుట్టు ఉండేది. ఇప్పుడూ చిక్కిపోయింది..:(

నా పెళ్ళికి కూడా ప్రత్యేకంగా ఎక్కడినుంచో తెప్పించారు బాగా అల్లిన పూలజడ. మధురస్మృతుల్లోకి తీసుకెళ్ళిపోయారు. థాంక్స్.

సుజాత వేల్పూరి

జ్యోతిగారూ,

మీరు సీరియస్ గానే అంటుంటే నేను తీసుకొస్తాను మా అమ్మాయిని! విస్తరాకు మీద కుట్టింది కాదు , అది బయటెక్కడనా దొరుకుతుంది కదా! జడకే కుట్టాలి. పూల జడ కుట్టే వాళ్ళ పక్కన కూచుని "ఊ" అన్నప్పుడల్లా పిన్నులు, మల్లెపూలు అందించడం భలే ఉంటుంది! మా అమ్మాయి జడ కి కూడా అవన్నీ అందిస్తాను మీకు!

మీ పూల జడ ముచ్చట్లు కూడా చదివా! మీకు మనవరాలు పుట్టే లోపు మా అమ్మాయికి కుట్టండి!

Anonymous

మీ పూల జడ ముచ్చట్లు బాగున్నాయి.మా పిన్ని పూలజడ చాల బాగా వేసేది.జడ వేయించుకోవటం పూర్తయ్యేసరికి మెడ నొప్పి వచ్చేది.అయినా పూలజడ వేయించుకోవటం సరదా గానే ఉండేది.

"ఇప్పుడు మూరమల్లెలు కొనుక్కుంటే తలలో నిలుస్తాయో లేదో అనుమానమే"
సేం పించ్ లత గారు.

లత

సిరిసిరిమువ్వ గారు
అవునండి సన్నగా కాడ బారుగా ఉన్న మొగ్గలే బాగుంటాయి
జ్యోతిగారు,మీ పూలజడ ముచ్చట్లు చదివాను,బాగున్నాయి
త్రుష్ణగారు నిజంగా అవన్నీ మధురస్మ్రుతులేనండి
అనుగారు ఆ సరదాయే వేరండి
అందరికీ ధన్యవాదాలు

జయ

అందరి జ్ఞాపకాల తలుపులు తెరిచి, సువాసనల మల్లెల జల్లు కురిపించారండి. మీ పూల జడ చాలా బాగుంది.

Anonymous

దొడ్లో మల్లంట్లు అన్నీ వెతికి కోసిన పూలన్నీ ఒక్కచొటపోసి గ్లాసుతో కొలిచి పంచుకోవటం గుర్తొస్తుంది
కోరి కోరి ఆడపిల్లను కన్నాను ఇలాంటి ముచ్చట తీర్చుకోటానికే . నా కూతురికి కూడా పూలంటే పిచ్చి జడకూడా పెద్దదే . ఏ సీజన్ లో ఆ పూలు తలనిండా నింపేస్తుంది . మీ పోస్ట్ ఎన్ని జ్ఞాపకాలను దులిపిందో చూడండి

మాలా కుమార్

మీ పూల జడ కబుర్లు బాగున్నాయండి . ఒక్క మల్లె పూలే కాదు అన్ని రకాల పూల తో జడలు వేయించుకునేవారం మేము . బంతి పూల తో వంకీ జడ కూడా భలే వుంటుంది .

లత

జయగారు,
లలితగారు,
మాలగారు,
మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది
థాంక్యూ

Unknown

naku kuda nenu veyinchukunna poolajada gurtuku vachindandi. baga rasaru. meku vilunnapudu na blog ki randi.
http:/kallurisailabala.blogspot.com

లత

శైలగారు థాంక్యూ

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008