ఎన్నెన్ని ఇష్టాలో
కొత్త సంవత్సరం లో, కాదు కాదు కొత్త దశాబ్దం లో మొదటి రోజు
అయిపోయింది.రెండో రోజూ అయిపోతోంది.అదే జీవితం,అవే పనులు అదే
రొటీన్. కానీ జనవరి ఫస్ట్ అనగానే ఏదో హడావుడి,సంతోషం ,కాస్త ఆశ,
వీటన్నింటి మధ్య ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు.
ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే , జ్ఞాపకాల పొరలు
విప్పుకుంటూ ఎన్నో గుర్తొస్తున్నాయి. ఒకప్పటి కలలూ,కోరికలూ, ఆశలూ
అన్నీ.
నాకే కాదు ఎవరికైనా మనసొకటే. స్పందన ఒకటే. ప్రతి ఒక్కరికీ వాళ్లకి
మాత్రమే సొంతమైన ఇష్టాలు ఖచ్చితంగా ఉంటాయి కదూ.
పిండారబోసినట్టు విరబూసిన వెన్నెల్లో, కొబ్బరాకుల కింద కూర్చుని పాటలు
వింటూ,మనసుకు నచ్చిన పుస్తకం చదువుకోవడం ఇష్టం. అందాలు చిందే
గులాబీలు,చిట్టి చిట్టి చేమంతులూ, విరబూసే మందారాలూ, పరిమళాలు
విరజిమ్మే మల్లెలూ వీటిని పెంచడం ఎంతో ఇష్టం.వాకిట్లో చుక్కలు పెట్టి
అందమైన ముగ్గులు వెయ్యడం ఇష్టం.ఓ వెన్నెల రాత్రి సముద్రపు ఒడ్డున
కూర్చుని కెరటాల హోరుని వినడం ఇష్టం.ఏ దూర ప్రాంతానికో వెళ్లి ప్రకృతిలో
మమేకమై పోవడం ఇంకా ఇష్టం. మనసుకి దగ్గరైన స్నేహితులతో, గంటల
తరబడి కబుర్లు చెప్పుకోవడం ఇష్టం.
మా ఫ్రెండ్ అంటుంది మనం ఎక్కువ ఏమీ ఆశించలేదు, ప్రశాంతమైన
జీవితం కోరుకున్నాం.కానీ చిత్రం ఏమిటంటే అదే మనకి దొరకలేదు అని.
ఇన్నేళ్ళ జీవిత పయనంలో ఇవన్నీ ఏ చాటుకు వెళ్లిపోయాయో
తల్చుకుంటే ఆశ్చర్యం వేస్తోంది.నిశ్శబ్దంగా పరుగులు తీసే కాలం బంధాల
బాధ్యతల మధ్యకి నన్ను నెట్టేసి, కమ్మేసిందేమో.
Post a Comment
4 comments:
happy new year
అవునండి. కాలం కొన్నిటిని ఇస్తుంది. కొన్నిటిని తీసుకుపోతుంది. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మాల గారూ,శిశిర గారూ
థాంక్స్ అండీ
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలండి...
Post a Comment