Showing posts with label వంటలు. Show all posts
Showing posts with label వంటలు. Show all posts

Thursday, November 10, 2011

కార్తీకంలో బ్లాగ్ వనభోజనాలు

కార్తీకం అంటేనే సందడి.పూజలు,ఉపవాసాలు,కార్తీక దీపాలు.మధ్యలో వనభోజనాలు,మనసు ఎక్కడికో  వెళ్ళిపోతుంది.ప్రతి నెలా పౌర్ణమి వస్తూనే ఉన్నాకార్తీక పున్నమి ప్రత్యేకతే వేరు.నిండుచంద్రుని వెన్నెల్లో,వెలిగే దీపాల నడుమ,భక్తి ప్రపత్తులతో,సరదాల పరదాలతో సాగే భోజనాలు నిజంగా అపురూపమే. 

ఇక వనభోజనాలు.

విశాలమైన తోటల్లోఉసిరిచెట్ల కింద భోజనాలు ఒకప్పుడైతే బ్లాగుల ముంగిట ఘుమఘుమల పరిమళాలు ఇప్పుడు.
మరి ఈ వెన్నెల వెలుగుల్లో నా వంటలు కూడా రుచి చూసేయండి.ఉపవాసంతో అలసిపోయే  పెద్దలకు,పిన్నలకు రుచితో పాటు పోషకాలు కూడా ఇచ్చే ఈ తీయతీయని బాదం ఖర్జూర పాయసం చేసుకుందాం.దీన్నేఆల్మండ్ డేట్స్ ఖీర్ అని పిల్చుకున్నా వాకే .

 


 కావలసినవి 


చిక్కని పాలు                       పావు లీటరు 
ఖర్జూరాలు                          పది 
బాదంపప్పు                         పది 
ఇలాచీ పొడి                        అర స్పూను 
మిల్క్ మెయిడ్                   రెండు టేబుల్ స్పూన్స్  


ముందుగా బాదంపప్పును వేడినీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసేయ్యాలి.
ఖర్జూరాలు గింజలు తీసేసి కొంచెం నీటిలో ఉడికించాలి.
ఈ రెంటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అవసరమైతే కొంచెం పాలు వాడొచ్చు.
ఇప్పుడు పాలను కొంచెం మరిగించి బాదం ఖర్జూర మిశ్రమం వేసి కొంచెం ఉడికించాలి.
చివరగా మిల్క్ మెయిడ్ వేసి కలపాలి.ఇది లేకపోతే తగినంత పంచదార వేసుకోవచ్చు.
ఇలాచీపొడి వేసి కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చల్లారాక ఇంకా చిక్కగా అవుతుంది 
సన్నగా తరిగిన బాదం,ఖర్జూరాలతో అలంకరించుకోవాలి. 

అంతేనండి చాలా సులువు కదా.కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తింటే రుచి కూడా అంత మధురంగానూ ఉంటుంది. 


ఇక కార్తీకమాసంలో నేతిబీరకాయ పచ్చడి తినాలంటారు.ఇక్కడేమో మరి అవి దొరకవు కదా.
అందుకని బీరకాయతో, టమాటా కలిపి ఈ పచ్చడి చేసుకుందాం.వనభోజనాలకు బ్రహ్మాండంగా ఉంటుంది.




కావలసినవి

బీరకాయ                           ఒకటి పెద్దది
టమాటా                            ఒకటి పెద్దది 
కొత్తిమీర                            అర కట్ట
పచ్చిమిర్చి                         ఆరేడు 
వెల్లుల్లి                             నాలుగు రెబ్బలు 
ఉప్పు,జీలకర్ర,చింతపండు,నూనె 


బీరకాయ చెక్కు తీసి ముక్కలు కోయాలి.
వీటిలో మిర్చి,టమాటా ముక్కలు,కొత్తిమీర వేసి రెండు స్పూన్ల నూనె వేసి నీరుపోయి బాగా దగ్గరయ్యేవరకు మగ్గనివ్వాలి.
మిర్చి,ఉప్పు,వెల్లుల్లి,జీలకర్ర,చింతపండు కలిపి ఒకసారి గ్రైండ్ చేసి,ఉడికిన బీరకాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేయ్యడమే. 

రెండూ రుచి చూసేసి ఎలా ఉన్నాయో చెప్పండి మరి.మళ్ళీ వచ్చే ఏడు మరిన్ని చేసుకుందాం

















Tuesday, December 21, 2010

కాకరకాయ కారం,శనగపప్పు కారం,నల్ల కారం

కాకరకాయ కారం :

కావలసిన  పదార్ధాలు : 

కాకరకాయలు              రెండు 

జీలకర్ర                       రెండు స్పూన్లు 

వెల్లుల్లి రెబ్బలు              పది 

ఉల్లిపాయ                   ఒకటి చిన్నది

పచ్చి కారం                 మూడు స్పూన్లు 

ఉప్పు                         తగినంత

మజ్జిగ                       ఒక కప్పు

చింతపండు                చాలా కొంచెం (ఒక్క తోలు)

నూనె                        ఒక కప్పు

పసుపు                     చిటికెడు

తాలింపుకు :

శనగపప్పు              ఒక స్పూను
మినప్పప్పు            ఒక స్పూను
ఆవాలు                అర స్పూను
ఎండుమిర్చి           రెండు మూడు
కరివేపాకు             రెండు రెమ్మలు 
వెల్లుల్లి                  రెండు రెబ్బలు  

తయారు చేసే విధానం :

కాకరకాయలు చక్రాల్లా తరగాలి. ఒక కప్పు మజ్జిగలో చిటికెడు

పసుపు,కొంచెం ఉప్పు, చింతపండు , కాకరకాయ ముక్కలు  వేసి,

మజ్జిగ ఇగిరిపోయి  ముక్కలు పొడి గా వచ్చేంతవరకు ఉడకపెట్టాలి.

పచ్చికారం,జీలకర్ర, వెల్లులి మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసి, అందులో

ఉల్లిపాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా ఒకసారి తిప్పి

కచ్చాపచ్చాగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోవాలి.

నూనె వేడి చేసి ఉడికించిన కాకరకాయ చక్రాలని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే నూనెలో (వడకట్టి)  శనగపప్పు,మినప్పప్పు ఆవాలు,

ఎండుమిర్చి ,వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు వేసుకుని,కరివేపాకు కూడా వెయ్యాలి

అవి వేగాక నూరిన ముద్ద వేసి, సరిపడా ఉప్పు చల్లి , పచ్చిదనం

పోయేవరకు బాగా వేయించాలి.తరువాత వేయించిన  కాకరకాయ ముక్కలు

వేసి ఈ కారం అంతా ముక్కలకు పట్టేలా బాగా కలిపి సన్నని సెగపై రెండు
నిమిషాలు వేయించుకోవాలి.

పొడిపొడిగా కాకరకాయ కారం రెడీ అవుతుంది.


శనగపప్పు కారం:

కావలసిన పదార్ధాలు

వేయించిన శనగపప్పు 

(పుట్నాలపప్పు)           రెండు కప్పులు

ఎండుమిర్చి                 పది

ఎండుకొబ్బరి               అర చిప్ప

జీలకర్ర                      రెండు  స్పూనులు

ఉప్పు                         తగినంత

వెల్లుల్లి                       పది రెబ్బలు

నూనె                       ఒక స్పూను 
 

తయారు చేసే విధానం :

నూనె వేడిచేసి ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి

ఎండుమిర్చి,ఉప్పు ,జీలకర్ర ,ఎండుకొబ్బరి , వెల్లుల్లి మిక్సీ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు సెనగపప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని అంతా కలిసేలా బాగా కలిపి బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.


కరివేపాకు కారం (నల్లకారం):

కావలసిన పదార్ధాలు:

కరివేపాకు                       రెండు కప్పులు

ఎండుమిర్చి                     పది

ధనియాలు                     నాలుగు స్పూన్లు

శనగపప్పు                      రెండు స్పూన్లు

మినప్పప్పు                     రెండు స్పూన్లు

ఎండుకొబ్బరి                   చిన్న ముక్క

జీలకర్ర                         రెండు స్పూన్లు

వెల్లుల్లి                         పది రెబ్బలు

చింతపండు                    కొంచెం

ఉప్పు                           తగినంత

నూనె                          నాలుగు  స్పూన్లు  

తయారుచేసే విధానం :

నూనె వేడిచేసి శనగపప్పు,మినప్పప్పు ,ధనియాలు దోరగా వేయించుకుని తీసుకోవాలి.

తరువాత ఎండుమిర్చి కూడా  దోరగా వేయించుకోవాలి.

తరువాత కడిగి ఆరబెట్టిన కరివేపాకు వేసి బాగా వేయించాలి.

ఇప్పుడు ముందు శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర,

ఎండుకొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి,తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి,

చివరగా వేయించిన కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకుని  స్టోర్ చేసుకోవాలి.

ఈ రెండు కారంపొడులలొనూ   ఎవరి రుచిని బట్టి వారు ఎండుమిర్చి

ఎక్కువ తక్కువలు చేసుకోవచ్చు.అలాగే నల్లకారం లో చింతపండు కూడా

పులుపు ఎక్కువ తినేవారు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.



           

Sunday, November 21, 2010

బ్లాగ్ వనభోజనం లో మేతిచమన్,బ్రెడ్ బాసుంది

బ్లాగ్ వనభోజనాలు.

అందరికి ఆహ్వానం. వెరైటీగా బ్లాగ్స్ లో చేసుకుంటున్నాము కదా, అందుకే 

కొంచెం వెరైటీగా ఈ రెండు వంటలూ మీ కోసం.


                             మేథీచమన్




కావలసిన  పదార్ధాలు ;

మెంతికూర                 1 కప్ 
పాలకూర                   1 కప్ 
టమాటా ప్యూరీ             1 కప్   
పనీర్ తురుము            1 కప్
ఉల్లిపాయ                   1 మీడియం సైజ్  
పచ్చిమిర్చి                 4   
అల్లం,వెల్లుల్లి ముద్డ        2 టీస్పూనులు 
ఉప్పు,కారం                 తగినంత 
పసుపు                     అర స్పూను
కసూరిమేతి                 2 టీస్పూన్స్ 
గరంమసాలపొడి           1 టీస్పూన్ 
కాజూ                       1/2 కప్
క్రీం                          1/2  కప్
కొత్తిమీర                    కొంచెం.
నూనె                       4 టేబుల్ స్పూన్స్ 


తయారు చేసే విధానం; 

ఒక టేబుల్ స్పూన్ నూనె లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, మిర్చి కాజు వేయించి ముద్దగా నూరుకోవాలి.
మిగిలిన నూనె వేడిచేసి ఈ ముద్దను వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్దవేసి వేయించాలి.
టమాటా ప్యూరీ వేసి నూనె తేలేవరకూ ఉంచి  పసుపు,తగినంత కారం వేసి ఒక నిమిషం వేయించాలి. 
సన్నగా తరిగిన మెంతికూర, పాలకూర వేసి బాగా మగ్గిన తరువాత పనీర్ తురుము వేసి   ఉడికించాలి
చివరగా గరం మసాల పొడి, క్రీం, తగినంత  ఉప్పు, కలిపి అరకప్పు నీరు పోసి బాగా ఉడికించి కసూరిమేతి పొడి, కొత్తిమీర చల్లి ఒక నిమిషం  ఉంచి దింపెయ్యాలి.
కొంచెం తురిమిన పనీర్, క్రీం తో అలంకరించుకుంటే  మేతిచమన్ రెడీ .    

           
నిన్న స్పెషల్ గా మీకోసం చేసి మరీ  ఈ స్వీట్ ఫోటో తీసి పెట్టానండి.అందరూ వచ్చి నోరు తీపి చేసుకోవాలి మరి.

                                                             

బ్రెడ్ బాసుంది 




                                               

కావలసిన  పదార్ధాలు:

బ్రెడ్                       4 స్లైసెస్ 
పాలు                     1/2  లీటర్ 
పంచదార                 1 కప్  
యాలకుల  పొడి         1 టీస్పూన్ 
కాజూ బాదం              2 టీస్పూన్స్ 
నెయ్యి                    3 టేబుల్ స్పూన్స్ 
ఇన్ స్టెంట్ బాదం మిక్స్ పౌడర్   1 స్పూన్ 
టుటి ఫ్రుటిలు ,చెర్రిస్   అలంకరణకి 

తయారు చేసే విధానం:
 బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ లో ఒకటి రండు సార్లు జస్ట్ తిప్పి వదిలేస్తే క్రంబ్స్ లా అవుతుంది.
 రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొంచెం పెద్ద గాజు బౌల్ లో తీసుకుని ఈ బ్రెడ్ క్రంబ్స్ వేసి  మైక్రోవేవ్ లో 1 మినిట్  హై లో పెట్టాలి.
ఒకసారి బాగా  కలిపి టెంపరేచర్ తగ్గించి ఇంకో నిమిషం పెట్టాలి  బ్రెడ్  క్రిస్పీగా  లైట్ బ్రౌన్ గా  ఫ్రై అవుతుంది  
తరువాత కాచిన పాలు కలిపి 2 మినిట్స్  హై లో ఉంచాలి. తీసి మళ్లీ కలిపి పంచదార,యాలకుల పొడి  కలిపి,మళ్లీ 2 మినిట్స్ హై లో ఉంచాలి. 
తీసి నేతిలో వేయించిన కాజూ బాదం మిగిలిన ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక నిమిషంహై లో ఉంచి తియ్యాలి.
ఇన్ స్టెంట్ బాదం మిక్స్ పోదో ఆప్షనల్  అండీ  వేస్తే కొంచెం కలర్ ,ఫ్లేవర్  బావుంటుంది.
కాసేపు ఫ్రిజ్ లో ఉంచి, టుటి ఫ్రుటిలు,చెర్రిస్ తో గార్నిష్ చేసుకుని  సర్వ్ చేస్తే తిన్నవారు ఆహా  ఏమి రుచి అనక మానరు.
 ఫ్రిజ్ లో ఉంచినప్పుడు కొంచెం చిక్కగా అయ్యింది అనుకుంటే ఒక కప్పు చిక్కని పాలు కలిపి సర్వ్ చెయ్యొచ్చు. 

అందరూ రుచి చూసి (చదివి) ఎలా  ఉన్నది చెప్పాలి మరి.   
                              

Blogger template 'FlowerFlush' by Ourblogtemplates.com 2008